నకిలీగాళ్లు!

ABN , First Publish Date - 2022-01-26T07:11:37+05:30 IST

జిల్లాలో నకిలీ వైద్యం విచ్చలవిడిగా సాగుతోంది. కొందరు వైద్యులు వచ్చిరాని వైద్యంతో మరింత రెచ్చిపోతున్నారు. యేటా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు అమాయక ప్రజల ను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఏంతో కొంత అనుభవం ఉన్న వారంతా

నకిలీగాళ్లు!
బేలలో ఆసుపత్రులను తనిఖీ చేస్తున్న జిల్లా వైద్యాధికారులు

జిల్లాలో వచ్చీరాని వైద్యంతో రెచ్చిపోతున్న వైద్యులు

తాజాగా బేల మండలంలో పలు ఆసుపత్రులు సీజ్‌

క్షేత్రస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ

ఫిర్యాదు చేస్తేనే అధికారుల హడావుడి 

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు

జిల్లావ్యాప్తంగా కేవలం 103 ఆసుపత్రులకే అనుమతులు

ఆదిలాబాద్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నకిలీ వైద్యం విచ్చలవిడిగా సాగుతోంది. కొందరు వైద్యులు వచ్చిరాని వైద్యంతో మరింత రెచ్చిపోతున్నారు. యేటా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు అమాయక ప్రజల ను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఏంతో కొంత అనుభవం ఉన్న వారంతా పట్టా చేతికి రాగానే ఆసుపత్రిని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత జోరుగానే ప్రచారం చే సుకుంటున్నారు. అర్హత లేకున్నా.. పెద్దపెద్ద అక్షరాలతో ఆసుపత్రుల పేర్లు, వైద్య అర్హతలను బోర్డులపై రాసుకుంటూ వైద్యం చేయడం మొదలు పెడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా.. తెలివిగా రాజకీయ నేతలు, వీఐపీలతో ఆసుపత్రులను ప్రారంభిస్తున్నారు. జిల్లాలో 103 రిజిస్ట్రర్‌ ఆసుపత్రులు ఉండగా.. మరెన్నో ఆసుపత్రులకు ఎలాంటి అనుమతులు లేకుండానే వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదంతా ఎక్కడో రహస్యంగా జరుగుతుందనుకుంటే పొరపాటే. ఇంత జ రుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ చోద్యం చూస్తూనే ఉంది.  తాజాగా బేల మండల కేంద్రంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.సాధన ఆకస్మిక తనిఖీలు చేసి పలు ఆసుపత్రులను సీజ్‌ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆసుపత్రులను ఏర్పాటు చేసిన యేడాది తర్వాత అధికారులు దాడులు చేసి నోటీసులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

అడపాదడపా తనిఖీలు

జిల్లాలో నకిలీ వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం అడపాదడపగానే తనిఖీలు చేస్తూ సరిపెడుతున్నారు. క్రమం తప్పకుండా తనిఖీలు చేపడితేనే నకిలీ వైద్యుల ఆగడాలకు ప్రారంభంలోనే అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వైద్య అధికారుల తీరు కనిపిస్తోంది. బేల మండలంలో ఏర్పాటు చేసిన తులసి ఆసుపత్రితో పాటు ఇతర ఆర్‌ఎంపీలు గత కొంత కాలంగా  వైద్య సేవలు అందిస్తున్న విషయం అధికారులకు తెలిసినా.. ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉండిపోయారో? అర్థం కావడం లేదంటున్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఆసుపత్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లు అనుమతులు లేకుండానే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అలాగే బోథ్‌, ఇచ్చోడ, ఉట్నూర్‌ మండల కేంద్రాలలోనూ పలు ఆసుపత్రులకు అనుమతులు లేకుండానే కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా దాడులు చేపడితే మరిన్ని ఆసుపత్రుల నకిలీ వైద్యం గుట్టురట్టయ్యే అవకాశం ఉంది.

గల్లీగల్లీకో ఆర్‌ఎంపీ

ఏదైనా ప్రైవేట్‌ ఆసుపత్రిలో కొంత కాలం పని చేసిన అనుభవం ఉంటే చాలు.. ఆర్‌ఎంపీలుగా అవతారమెత్తి వైద్యం చేస్తామంటూ వైద్యులుగా చెలామణి అవుతున్నారు. కిరాణా కొట్టులా మాదిరిగా గల్లీగల్లీకో ఆర్‌ఎంపీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఆర్‌ఎంపీలు రోగులకు ఫస్ట్‌ ఎయిడ్‌ మాత్రమే చేసి.. ఆ తర్వాత అర్హత కలిగిన వైద్యుల వద్దకు రెఫర్‌ చేయాల్సి ఉంటుంది. కాని అడ్డగోలుగా వైద్యం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఆపరేషన్లు చేస్తున్న దాఖలాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే వచ్చిరాని వైద్యం చేసిన కొంతమంది ఆర్‌ఎంపీ వైద్యులపై కేసులు నమోదు కావడంతో జైలుకు వెళ్లిన సందర్భాలున్నాయి. శంకర్‌దాదాలుగా రెచ్చిపోతూ  అమాయక జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏదైనా జరుగకూడని సంఘటన జరిగితేనే అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో వారు హడావుడి చేయడం, ఆ తర్వాత అంతా మాములుగా మారిపోతుంది.

అనుమతి లేని ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చాం

: డా.సాధన, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్‌

జిల్లాలో అనుమతి లేని ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చాం. బేల మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఆసుపత్రులపై ఫిర్యాదులు రావడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు తనిఖీలు చేసి పలు ఆసుపత్రులను సీజ్‌ చేశాం. తులసి ఆసుపత్రి వైద్యుడు అర్హతకు మించిన వైద్యం చేయడం, ఆసుపత్రిని రిజిస్ర్టార్‌ చేసుకోకపోవడంతో నోటీసులు ఇచ్చాం. అలాగే స్థానిక ఆర్‌ఎంపీ వైద్యులు కూడా స్థాయిని మించి వైద్యం చేస్తున్నట్లు మా దృష్టికి రావడంతో చర్యలకు ఆదేశించాం. జిల్లాలో అనుమతులు లేకుండా ఆసుపత్రులను ఏర్పాటు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు.

Updated Date - 2022-01-26T07:11:37+05:30 IST