ఆ జీవో ఆపండి

ABN , First Publish Date - 2021-08-03T06:23:10+05:30 IST

విజయవాడ దుర్గా కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ వ్యవసాయ, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి జూలై 14న జారీ చేసిన జీవో 440ని హైకోర్టు సస్పెండ్‌ చేసింది.

ఆ జీవో ఆపండి

దుర్గా కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ పాలకవర్గం నియామకంపై హైకోర్టు ఉత్తర్వులు

అధికారులతో కూడిన కమిటీకే బాధ్యతలు


అమరావతి/వన్‌టౌన్‌, ఆగస్టు 2 : విజయవాడ దుర్గా కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌  పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ వ్యవసాయ, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి జూలై 14న జారీ చేసిన జీవో 440ని హైకోర్టు సస్పెండ్‌ చేసింది. దుర్గా కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ పాలకవర్గ నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పొట్నూరి రజనీకాంత్‌, పోతిన వెంకట రాంబాబు వేసిన రిట్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ మేరకు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 262 ప్రకారం అధికారులతో ఇంతకు ముందు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ బ్యాంక్‌ వ్యవహారాలు చూసుకోవాలని తేల్చి చెప్పింది. అధికారుల కమిటీ కాలపరిమితి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని వ్యవసాయ, సహకార శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దుర్గా కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌, పాలక కమిటీ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది. 


బ్యాంక్‌ పాలకవర్గం నిబంధనలకు విరుద్థంగా ఏర్పాటయిందని ఇంతకు ముందు కూడా నగరానికి చెందిన మరికొందరు పిటిషన్‌ దాఖలు చేశారు. దుర్గా కో-ఆపరేటివ్‌ బ్యాంకు పాలకవర్గాన్ని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తన అనుయాయులతో నిబంధనలకు విరుద్ధంగా నియమించారని పిటిషనర్ల తరపు సీనియర్‌ న్యాయవాది వీఎస్‌ఆర్‌ ఆంజనేయులు వాదించారు. జీవో 440 ద్వారా అప్పటివరకు అధికారులతో ఉన్న కమిటీ స్థానంలో అధికారేతరులతో కమిటీ ఏర్పాటు చేశారని ఆయన వాదించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ జీవోను రద్దు చేసి, అధికారులతో ఉన్న కమిటీని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అన్ని కోణాలలోనూ పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయమూర్తి.. అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటుకు మే నెలలో కో-ఆపరేటివ్‌ కమిషనర్‌ సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకు భిన్నంగా జూలై 2021లో నాన్‌ అఫీషియల్‌ సభ్యులతో కమిటీ ఏర్పాటుకు ఎలా సిఫార్సు చేస్తారని ప్రశ్నించారు. అధికారిక కమిటీని అత్యవసరంగా మార్చడానికి కారణాలు ఏవీ పేర్కొనలేదని న్యాయమూర్తి అన్నారు. కాగా హైకోర్టు ఆదేశాలపై జనసేన నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్‌ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి వెలంపల్లి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తన అనుయాయుల కోసం నిబంధనలను తుంగలో తొక్కారంటూ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-08-03T06:23:10+05:30 IST