Advertisement

భద్రత కోసం దుర్గలా!

Dec 3 2020 @ 00:00AM

స్ఫూర్తి

మహిళలు, బాలికలు వీధిలోకి వెళితే సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తారో లేదో తెలియని రోజులివి. దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలోనూ బహిరంగ ప్రదేశాల్లో మహిళల రక్షణ ప్రశ్నార్థకమే! ‘ఈ పరిస్థితి మారాలి’ అంటున్నారు ప్రియా వరదరాజన్‌. దీనికోసం ఆమె ఏర్పాటు చేసిన ‘దుర్గ ఇండియా’ సంస్థ లైంగిక వేధింపులపై మహిళల్లో అవగాహనకు దోహదపడుతోంది.వీధుల్లో, వాడల్లో మహిళలకు మరింత భద్రత కల్పించడానికి కృషి చేస్తోంది. 


మహిళలు వీధుల్లో లైంగిక 

వేధింపులు ఎదుర్కొంటున్నప్పుడు సాయపడేందుకు ముందుకు వచ్చే వాళ్లు ప్రతి చోటా ఉంటారు. వీధుల్లో  అమ్మకాలు చేసేవారు, టీ దుకాణాలవారు... ఇలా అనేక మందిని మేము గుర్తించాం. 


‘‘మహిళల రక్షణకు సరైన ఆయుధం ధైర్యమే. అది ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా నిర్భయంగా ఎదుర్కోగలరు’’ అంటారు ప్రియా వరదరాజన్‌. బెంగళూరు కేంద్రంగా 2013లో ఆమె స్థాపించిన ‘దుర్గ ఇండియా’ (డేర్‌ టు అండర్‌స్టాండ్‌ బిహేవియర్‌, రెస్పాండ్‌ ఎప్రోపరేట్లీ అండ్‌ గార్డ్‌ అవర్‌ సెల్వ్స్‌ ఏబ్లీ) స్వచ్ఛంద సంస్థ బహిరంగ స్థలాల్లో మహిళలపై వేధింపులనూ, అత్యాచారాలను నివారించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ‘దుర్గలా ఉండండి’ అనేది ఈ సంస్థ నినాదం. ‘‘2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ప్రపంచాన్ని దిగ్ర్భాంతి పరిచింది. బహిరంగ స్థలాల్లో మహిళల రక్షణపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారికీ... నాకూ... మాలాంటి ఎందరికో భద్రత ఎలా దొరుకుతుంది? దానికి ఏం చేయాలి? నాలో తలెత్తిన ఇలాంటి ప్రశ్నల్లోంచీ ఏర్పాటైనదే దుర్గ స్వచ్ఛంద సంస్థ’’ అని అంటారామె! 


ప్రదర్శనల ద్వారా అవగాహన

ప్రియా వరదరాజన్‌ వృత్తిరీత్యా ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌. పుస్తకాలు చదవడం, ప్రయాణాలు, బ్లాగ్స్‌ రాయడం ఆమె అభిరుచులు. కర్ణాటక సంగీతం అంటే ప్రాణం.మంచి వక్త కూడా. అనేక ప్రముఖ సంస్థల్లో ఆమె పని చేశారు. ప్రస్తుతం అజిమ్‌ ప్రేమ్‌జీ ఫిలాంత్రఫిక్‌ ఇనిషియేటివ్స్‌ (ఎపిపిఐ)లో జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ‘నిర్భయ ఘటన’ స్ఫూర్తితో ఏర్పాటైన ‘దుర్గ ’ సంస్థ ద్వారా అనేక ప్రాంతాల్లో ఆమె వర్క్‌ షాపులు నిర్వహిస్తున్నారు. బహిరంగ స్థలాల్లో లైంగిక వేధింపులను ఎదుర్కోవడానికి అవసరమైన ఆత్మరక్షణ చర్యల గురించి మహిళలకూ, బాలికలకూ అవగాహన కల్పిస్తున్నారు. ముంబాయి, బెంగళూరు, పుణే, చెన్నై, జెంషెడ్‌పూర్‌తో సహా అనేక నగరాల్లో అయిదు వేల మందికి పైగా ఈ సంస్థలో భాగస్వాములయ్యారు.


‘‘మహిళలపై జరుగుతున్న లైంగిక హింస, వేధింపులపై చర్యలు తీసుకోవడానికి సాంకేతికత ద్వారా, ఉద్యమాల ద్వారా, న్యాయపరమైన మద్దతు ద్వారా సహకారం అందిస్తున్న సంస్థలు అనేకం ఉన్నాయి. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా మహిళల్లో అవగాహన అవవసరం. అందుకే రంగస్థల ఆధారిత వర్క్‌ షాపుల ద్వారా మేము పని చేస్తున్నాం. రోజువారీ జీవితాల్లో... బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ఎదురవుతున్న లైంగిక వేధింపులను సమర్థంగా ఎదుర్కోడానికి అనేక పరిష్కారాలను ప్రదర్శనల ద్వారా తెలియజేస్తున్నాం. వివిధ పాత్రలు, చిన్న ఆటలు,వివిధ అంశాల్లో స్ఫూర్తి కలిగించే బోధనలతో మహిళల్లో చైతన్యాన్ని మరింత సులువుగా పెంపొందించవచ్చు’’ అంటారు ప్రియ. ఒక్కో వర్క్‌ షాప్‌ మూడు గంటల సేపు సాగుతుంది. భవన నిర్మాణాలు జరిగే ప్రదేశాల్లో, కాలనీల్లో, కార్పొరేట్‌ సంస్థల కార్యాలయాల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో, బాలికల వసతి గృహాల్లో నెలకు రెండు సార్లు ఈ వర్క్‌ షాపులు ఉంటాయి. 


మహిళల భద్రత అందరి బాధ్యత...

‘‘సామాన్య మహిళలే నాకు పెద్ద స్ఫూర్తి. వాళ్ళు అనేక పనులు చేస్తారు. బాధ్యతగా ఉంటారు. పరిష్కారాలను వేగంగా వెతుకుతారు. మహిళలుగా మేము బలమైనవాళ్ళం. అదే సమయంలో అత్యాచారాలకు తేలికైన లక్ష్యాలం కూడా. ప్రతి అంశంలోనూ మహిళలకు సమానత్వం కావాలి. మహిళలు సురక్షితమైన జీవనం సాగించాలన్నది ‘దుర్గ’ ధ్యేయం. ఆ దిశగానే మేము పని చేస్తున్నాం’’ అని చెబుతారు ప్రియ. ‘‘నా భద్రత కేవలం నా బాధ్యత మాత్రమే కాదు. సామాజికమైన ఒక ప్రదేశంలో, ఒక సంస్థలో, ఒక పాఠశాలలో... ఇలా నేను ఎక్కడ ఉన్నా... ఆ బాధ్యతను ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ పంచుకోవాల్సిందే. ఒక మహిళగా, ఎక్కువమంది మహిళలు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నేను సురక్షితంగా భావించగలుగుతాను’’ అని అంటారామె.


వీధుల్లో కంప్లయింట్‌ బాక్స్‌లు

బస్టాపులు, వీధులు, రద్దీగా ఉండే ప్రదేశాలు, షాపింగ్‌ మాల్స్‌, కార్యాలయాలు, కళాశాలలూ, ఆఖరికి కాలనీలూ, ఇళ్ళూ... ఇలా మహిళల వేధింపులు ఎక్కడైనా జరగొచ్చు. వాటిని వేధింపులు జరిగే ప్రదేశాలుగా గుర్తిస్తే... భద్రత కోసం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోగలం. కానీ ఈ రోజున ఫిర్యాదులు చేయడం కోసం పోలీస్‌ స్టేషన్లకు వెళ్ళడానికి మహిళలు ఇష్టపడడం లేదు. మరి భద్రత లేని ప్రదేశాలు ఏవనేది ఎలా తెలుస్తుంది? ‘‘అందుకే పోలీసుల సహకారంతో నగర వ్యాప్తంగా అనేక కంప్లయింట్‌ బాక్సుల్ని ఏర్పాటు చేశాం. మహిళలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ ఫిర్యాదుల్ని ఆ బాక్సుల్లో వెయ్యొచ్చు. వాటిని పోలీసులకు మేం అందజేసి, చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం’’ అని వివరించారు ప్రియ. అలాగే చీకటిగా, నిర్మానుష్యంగా... మహిళలపై దాడులు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న చోట్ల బెంగళూరు కార్పొరేషన్‌, పోలీసుల సహకారంతో వీధి దీపాలనూ, గస్తీని ఈ సంస్థ ఏర్పాటు చేయించింది. అంతేకాదు, బెంగళూరు సిటీబస్సుల్లో... వేధింపులకు గురయ్యే మహిళల కోసం దుర్గా అలారాలను ప్రవేశపెట్టడం వెనుక ‘దుర్గ’ కృషి ఎంతో ఉంది. ఆన్‌లైన్‌ ద్వారా కూడా అవగాహన కార్యక్రమాలను ఈ సంస్థ చేపట్టింది.

 

నిజమైన హీరోల్ని గుర్తించేందుకు ‘డేర్‌’!

గత ఎనిమిది నెలల్లో ‘దుర్గ’ చేపట్టిన కార్యక్రమం ‘దుర్గాస్‌ ఆర్‌ రియల్‌ హీరోస్‌ ఎవ్విరివేర్‌’ (డేర్‌). ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు సాయపడే బాధ్యతాయుతమైన పౌరులను ఈ కార్యక్రమం ద్వారా గుర్తిస్తున్నారు. ‘‘మహిళలు వీధుల్లో లైంగిక వేధింపుల్లాంటివి ఎదుర్కొంటున్నప్పుడు సాయపడేందుకు ముందుకు వచ్చే వ్యక్తులు ప్రతిచోటా ఉంటారు. వీధుల్లో అమ్మకాలు చేసేవారు, టీ దుకాణాలవారు... ఇలా అనేక మందిని మేము గుర్తించాం. వారు ఉండే ప్రదేశాల్లో మహిళల భద్రత పౌరులుగా వారి బాధ్యత కూడా అని వారికి అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే కొన్ని కళాశాలల్లో ‘వాయిస్‌ క్లబ్‌’లు ఏర్పాటు చేసి, జెండర్‌ సమస్యల మీద చర్చలు నిర్వహిస్తున్నాం. త్వరలో మరిన్ని కళాశాలలకు విస్తరిస్తాం’’ అంటున్నారు ప్రియా వరదరాజన్‌.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.