75 ఏళ్ల స్వాంతంత్య్ర సంబరాల వేళ..ఆస్పత్రికి వెళ్లే దారిలేక నిండు గర్భిణి మృతి

ABN , First Publish Date - 2022-08-16T10:07:16+05:30 IST

దేశం ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న వేళ.. ఆస్పత్రికి వెళ్లే దారి లేక నిండు గర్భిణి మూడు రోజులుగా ప్రసవ వేదనతో అల్లాడి ప్రాణాలు వీడింది.

75  ఏళ్ల స్వాంతంత్య్ర సంబరాల వేళ..ఆస్పత్రికి వెళ్లే దారిలేక నిండు గర్భిణి మృతి

  • మూడు రోజులు ప్రసవ వేదన
  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోరం

జి.మాడుగుల, ఆగస్టు 15: దేశం ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న వేళ.. ఆస్పత్రికి వెళ్లే దారి లేక నిండు గర్భిణి మూడు రోజులుగా ప్రసవ వేదనతో అల్లాడి ప్రాణాలు వీడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ బొడ్డపాడుమామిడి గ్రామంలో ఆదివారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పాంగి సొలితిమ(20)కు మూడు రోజులుగా పురిటి నొప్పులు వస్తున్నాయి. గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. జి.మాడుగులలోని ఆస్పత్రికి వెళ్లాలంటే 20 కిలోమీటర్లు కాలినడకన, అక్కడి నుంచి ఆటో లేదా వ్యాన్‌లో మరో 15 కిలోమీటర్లు ప్రయాణించాలి. వర్షాలు కురుస్తుండడంతో 20 కిలోమీటర్లు డోలీలో తీసుకెళ్లడం కూడా కుదరక ఆస్పత్రికి తరలించలేకపోయారు. దీంతో ఇంట్లోనే ప్రసవ వేదనతో ఆమె ఆదివారం రాత్రి ఏడు గంటలకు మృతి చెందారు. గ్రామంలో 27 కుటుంబాలకు చెందిన 180 మంది నివస్తున్నారు. ఆ గ్రామంలో ఆరోగ్య కార్యకర్త(సీహెచ్‌డబ్ల్యూ), ఆశ వర్కర్‌ కూడా లేరు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించలేదని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో మరో ముగ్గురు గర్భిణులు ఉన్నారని, వారికైనా వైద్యం అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2022-08-16T10:07:16+05:30 IST