కరోనా సమయంలో...

ABN , First Publish Date - 2020-08-09T10:48:15+05:30 IST

కరోనా సమయంలో స్థిరాస్థి క్రయ విక్రయాలు భారీగా పడిపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కుదేలయ్యారు. రిజిస్ట్రేషన్‌ శాఖ అదాయం కూడా భారీగా పడిపోయింది.

కరోనా సమయంలో...

 ఖజానాకు కాసుల గలగల

 భూముల మార్కెట్‌ విలువ పెరగడమే కారణం

 అనుడా పరిధిలో 10-45 శాతం పెరిగే అవకాశం

 ఈనెల 10 నుంచి అమల్లోకి

 జూలై, ఆగస్టు నెలల్లో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు

 37 రోజుల్లో రూ.27 కోట్లు రాబడి


(కడప - ఆంధ్రజ్యోతి) 


కరోనా సమయంలో స్థిరాస్థి క్రయ విక్రయాలు భారీగా పడిపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కుదేలయ్యారు. రిజిస్ట్రేషన్‌ శాఖ అదాయం కూడా భారీగా పడిపోయింది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 10వ తేదీ పెంచిన భూముల ధరలు అమల్లోకి వస్తాయి. దీంతో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. కరోనా సమయంలోను ఖజానా కాస్తా కళకళలాడింది. ఒక్క జూలై నెలలో రూ.20.86 కోట్ల రాబడి వస్తే ఆగస్టు 7 రోజుల్లో రూ.7 కోట్లకు పైగా ఖజానాకు చేరింది. 


రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు నెలలో భూముల మార్కెట్‌ విలువ పెంచుతూ వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ఆదాయం ఊహించని విధంగా పడిపోయింది. రాష్ట్ర అదాయ వనరుల్లో కీలకమైన రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సగం అదాయం రానీ పరిస్థితి. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువను పెంచింది. ఈ ఉత్తర్వులు ఈనెల 10వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

అన్నమయ్య అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (అనుడా) పరిధిలో మాత్రమే భూముల మార్కెట్‌ విలువ పెరగనుంది. అనుడా పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో 5 నుంచి 25 శాతం, కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట వంటి నగర, పురపాలక పట్టణ ప్రాంతాల్లో 10 నుంచి 45 శాతం పెరిగే అవకాశం ఉంది. దీంతో ఒక్కసారిగా భూములు, స్థిరాస్తుల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. జూలై ఆఖరి పది రోజులు, ఆగస్టు 7 రోజుల్లో ఖజానా భారీగా పెరిగింది. 

ఒక్కనెలలో..

జిల్లాలో కడప, ప్రొద్దుటూరు జిల్లా రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో 18 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఏడాదిలో రూ.158.05 కోట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రాబట్టాలన్నది లక్ష్యం. ఏప్రిల్‌ నుంచి జూలై ఆఖరు వరకు ఆరు నెలల టార్గెట్‌ రూ.105.89 కోట్లు కాగా, రిజిస్ట్రేషన్లు, స్టాంప్‌ డ్యూటీ ద్వారా రూ.57.15 కోట్లు ఆదాయం సమకూరింది. అయితే ఒక్క జూలై నెలలో మాత్రమే రూ.28.14 కోట్లు లక్ష్యం కాగా, రూ.20.86 కోట్లు రాబడి సాధించారు. ఆగస్టు నెల తొలి 7 రోజుల్లో దాదాపు రూ.7 కోట్లు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

అంతే పెరిగిన భూముల మార్కెట్‌ విలువ అమల్లోకి రావడానికి 15 రోజుల నుంచి జోరుగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒక్క జూలై మాసంలోనే కడప జిల్లా రిజిస్ర్టార్‌ కార్యాలయం పరిధిలోని 9 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో 10,903 డాక్యుమెంట్లు, ప్రొద్దుటూరు జిల్లా రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలోని 9 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో 12,951 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆగస్టు నెలలో ఈ 7 రోజులు దాదాపు జిల్లా అంతటా దాదాపు 7 వేలు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి రూ.7 కోట్లు వరకు ఆదాయం వచ్చింది. 


జిల్లాలో ఆరు నెలల్లో టార్గెట్‌, రాబడి వివరాలు రూ.కోట్లల్లో


వివరాలు కడప ప్రొద్దుటూరు మొత్తం

టార్గెట్‌ 52.95 52.95 105.90

రాబడి 28.59 28.56 .59.17

జూలై టార్గెట్‌ 16.59 11.56 .28.15

రాబడి 10.31 10.56 .28.87


10 నుంచి అమల్లోకి - గిరిబాబు, డీఐజీ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ, కడప

ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్‌ విలువ ఈనెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అనుడా పరిధిలో 5-25 శాతం పెరిగే అవకాశం ఉంది. కీలక పట్టణ ప్రాంతాల్లో 10-45 శాతం పెరగనుంది. పెంచిన రేట్లు అమల్లోకి వస్తుండటంతో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు పెరిగి రోజుకు సగటున రూ.కోటి ఆదాయం వస్తుంది. 

Updated Date - 2020-08-09T10:48:15+05:30 IST