అంబరాన్నంటిన దసరా సంబరం

ABN , First Publish Date - 2022-10-07T05:45:13+05:30 IST

దసరా ప్రతి ఇంటా సందడి నింపింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్లెలు, పట్టణాల్లో ఆనందాలు వెల్లువిరిశాయి. ఏ ఇంటిలో చూసినా బుధవారం దసరా హడావుడి కనిపించింది.

అంబరాన్నంటిన దసరా సంబరం
సిరిసిల్లలో రామ్‌లీలకు తరలివచ్చిన ప్రజలు

- ఇంటింటా పండుగ సందడి 

- సిరిసిల్ల మానేరు తీరంలో రామ్‌లీల

- ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు  

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

దసరా ప్రతి ఇంటా సందడి నింపింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్లెలు, పట్టణాల్లో ఆనందాలు వెల్లువిరిశాయి. ఏ ఇంటిలో చూసినా బుధవారం దసరా హడావుడి కనిపించింది. కుటుంబసభ్యులు, బంధువులు ఒక చోట చేరి పండుగ జోష్‌ జరుపుకున్నారు. బతుకమ్మతో పాటు దసరాలను జిల్లాలో అతి పెద్ద పండుగగా పరిగణిస్తారు. దసరా వేళ విజయానికి సంకేతంగా రావణ వధ ఘట్టాలు నిర్వహించారు. కరోనా భయం పూర్తిగా తొలగిపోవడంతో ఈ సారి పూర్వ వైభవం కనిపించింది. 

- రావణ వధ వేడుకలు..

చెడుపై విజయంగా భావిస్తూ జిల్లాలో రావణ వధ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల మానేరు తీరంలో జమ్మిగద్దె వద్ద మొదట లక్ష్మీనర్సింహస్వామి అశ్వవాహనంపై ఊరేగింపు నిర్వహించారు.  శమీ దర్శనం చేశారు. ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో జమ్మి చెట్టుతో శోభాయాత్ర నిర్వహించారు. శమీదర్శనం, రామ్‌లీల వేడుకలకు వేలాది మంది తరలిరాగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, పవర్‌లూం మరియు టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు శమీపూజలు చేశారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, రావణ వధ వేడుకలను ప్రారంభించారు. జన సందోహం మధ్య రావన దాహనం జరిగింది. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ జిందం కళ మాట్లాడుతూ విజయదశమి ప్రజలందరికి సుఖసంతోషాలు కలిగించాలని అన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ ఆధ్వర్యంలో జరిగే స్వచ్ఛత కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. హిందూ ఉత్సవ సమితి చైర్మన్‌ చేపూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ వధ కార్యక్రమాన్ని ప్రతియేటా విజయవంతంగా నిర్వహించడానికి సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అడెపు రవీందర్‌, కౌన్సిలర్లు వెల్దండి దేవదాస్‌, పద్మ, వెంకటలక్ష్మీ, గాజుల వేణు, సత్యం, తదితరులు పాల్గొన్నారు. 

- శమీ... ఆయుధ పూజలు 

విజయదశమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శమీ పూజలు, అయుధ పూజలు జరిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా  పోలీస్‌ కార్యాలయంలో అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు, ఆయుధ పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లకు మామిడాకులు, బంతిపూల దండలు కట్టారు. గుమ్మడి కాయలు కొట్టారు. జిల్లాలోని పవర్‌లూం కర్ఖానాలు, వివిధ ప్యాక్టరీల్లో పూజ కార్యక్రమాలను ఘనంగా చేపట్టారు. ఇళ్లలోకి వెళ్లి దసరా శుభాకాంక్షలను తెలుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ వాహనాలకు పూజలు చేశారు. దసరా రోజు ఊరు శివార్లలో పల్లెల్లో పాలపిట్టను దర్శించుకున్నారు. పాలపిట్ట కనబడితే సంవత్సరం పొడవునా విజయాలు కలుగుతాయని శుభసూచకంగా భావిస్తారు. 

-  ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు 

అశ్వయుజ శుద్ధ దశమిని విజయానికి సంకేతంగా అమ్మవారిని ఆరాధించుకుంటూ తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగిన శరన్నవరాత్రి ఉత్సవాలు దసరా రోజు పూర్ణహుతి నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అమ్మవారిని వివిధ ప్రాంతాల్లో శోభాయాత్రగా ప్రజలకు దర్శనం కల్పించారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారికి స్వాగతించారు. 


Updated Date - 2022-10-07T05:45:13+05:30 IST