అంతరాలు లేవంటూనే.. అంతరాలయ దర్శనం

ABN , First Publish Date - 2020-10-25T09:49:23+05:30 IST

దసరా ఉత్సవాల ప్రారంభానికి ముందు దుర్గగుడి అధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు పదేపదే చెప్పిన నిబంధనలవి.

అంతరాలు లేవంటూనే.. అంతరాలయ దర్శనం

కొవిడ్‌ నిబంధనలకు నీళ్లొదిలిన దుర్గగుడి అధికారులు

మంత్రులు, పోలీస్‌ బాస్‌లకు అంతరాలయ ప్రవేశం

చైర్మన్‌, ఈవో సమక్షంలోనే..

భక్తుల నుంచి తీవ్ర విమర్శలు

ఆరా తీసిన మంత్రి కొడాలి నాని


విజయవాడ, ఆంధ్రజ్యోతి: ‘కొవిడ్‌ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అంతరాలయ దర్శనాలు రద్దు చేశాం. వీఐపీలు సహా అందరికీ ముఖమండప దర్శనమే. వీఐపీలు తమకు కేటాయించిన నిర్ణీత సమయాల్లోనే దర్శనానికి రావాలి. కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎవరికీ శఠారి, తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు, పూర్ణకుంభ స్వాగతాలు ఉండవు.’ 


దసరా ఉత్సవాల ప్రారంభానికి ముందు దుర్గగుడి అధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు పదేపదే చెప్పిన నిబంధనలవి. కానీ, మాటలకే పరిమితమైన దుర్గగుడి అధికారులు చేతల్లో మాత్రం వీఐపీల సేవల్లో తరించారు. మంత్రులు, ఉన్నతాధికారులకు అంతరాలయ దర్శనం కల్పించి మరోసారి విమర్శలపాలయ్యారు.‘కొవిడ్‌ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అంతరాలయ దర్శనాలు రద్దు చేశాం. వీఐపీలు సహా అందరికీ ముఖమండప దర్శనమే. వీఐపీలు తమకు కేటాయించిన నిర్ణీత సమయాల్లోనే దర్శనానికి రావాలి. కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎవరికీ శఠారి, తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు, పూర్ణకుంభ స్వాగతాలు ఉండవు.’ 


దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ అంతరాలయ దర్శనాలను రద్దు చేశామని చెప్పిన దుర్గగుడి అధికారులు శనివారం మాత్రం ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు రాచమర్యాలతో అంతరాలయ దర్శనం చేయించారు. వారితో ఆలయం లోపల ప్రత్యేక పూజలు చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఆలయ ఈవో సురేష్‌బాబు దగ్గరుండి అంతరాలయంలోకి తీసుకెళ్లి పూజలు చేయించారు. అంతేకాదు.. వేదపండితులతో ఆశీర్వచనాలు ఇప్పించారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి కురసాల కన్నబాబు, డీజీపీ గౌతం సవాంగ్‌, సీపీ బి.శ్రీనివాసులు తదితర ప్రముఖులతో పాటు పాలకమండలి చైర్మన్‌, ఈవో, కొందరు పాలకమండలి సభ్యులు కూడా అమ్మవారి అంతరాలయంలోకి ప్రవేశించి దర్శనాలు చేసుకున్నారు. దీంతో కొవిడ్‌ నిబంధనలు సామాన్యులకేనా? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.


మంత్రి కొడాలి నాని కినుక..?

మంత్రులు, కొంతమంది వీఐపీలకు అంతరాలయ దర్శనాలు చేయించారని తెలియడంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని దుర్గగుడి అధికారుల తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఈనెల 22వ తేదీన కొడాలి నాని జన్మదినం కావడంతో ఆయన కుటుంబ సభ్యులను తీసుకుని దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. మంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు ఆరోజు అంతరాలయంలోకి అనుమతించకుండా ముఖమండపం నుంచే దర్శనం కల్పించారు. శనివారం దేవదాయశాఖ మంత్రి కుటుంబ సభ్యులు, హోంమంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులకు అంతరాలయ దర్శనం కల్పించడంపై దుర్గగుడిలో తనకు తెలిసిన వ్యక్తులకు కొడాలి నాని ఫోన్‌ చేసి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Updated Date - 2020-10-25T09:49:23+05:30 IST