విజయీభవ..ఇరు జిల్లాల్లో ఘనంగా దసరా వేడుకలు

ABN , First Publish Date - 2020-10-27T10:23:23+05:30 IST

చెడుపై విజయానికి ప్రతీకగా దసరా ఉత్సవాలను ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆదివారం వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు

విజయీభవ..ఇరు జిల్లాల్లో ఘనంగా దసరా వేడుకలు

ఆలయాల్లో శమీ పూజలు, హోమాలు

కొవిడ్‌తో నిలిచిన పారువేట ఉత్సవం

కనిపించని ‘రావణాసుర వధ’


ఖమ్మం సాంస్కృతికం/ కొత్తగూడెం సాంస్కృతికం, అక్టోబరు26:  చెడుపై విజయానికి ప్రతీకగా దసరా ఉత్సవాలను ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆదివారం వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. వాహనదారులు ప్రత్యేకంగా వాహనాలకు పూజలు చేయించుకున్నారు. దుర్గాదేవికి హోమాలు, అభిషేకాలు  చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ఆలయాలలోని జమ్మచెట్టు వద్ద శమీ పూజలను   నిర్వహించారు. మనసులోని  కోరికలను కాగితాలపై రాసి జమ్మి కొమ్మలను గుచ్చారు. మధిర, తల్లాడ, సత్తుపల్లి, వైరా, తదితరప్రాతాలతో పాటు అన్ని గ్రామాల్లోను దసరా పండుగను జరుపుకొన్నారు.


ఖమ్మంలోని శ్రీస్తంబాధ్రి లక్ష్మి నర్సింహాస్వామి వారు పారువేట ఉత్సవం జమ్మబండపై జరగాల్సి ఉండగా కొవిడ్‌వల్ల ఈ ఏడాది పారువేట ఉత్సవాన్ని నిలిపి వేశారు. జమ్మిబండపై స్వామి వారి దర్శనం లేక పావడంతో భక్తులు అమ్మవారిని  ప్రధాన గేటు వద్దనుంచే దర్శించుకుని వెళ్లారు. జిల్లాలోని అన్ని ఆలయాల్లో శమి పూజల్ని జరిపారు.  ఖమ్మం్మలోని శ్రీస్తంబాద్రి లక్ష్మీ నర్సింహాప్వామి ఆలయంలో స్వామి వారికివ ఏకాంతంగా శమీ పూజను నిర్వహించారు.


కొత్తగూడెం, రుద్రంపూర్‌, సుజాతనగర్‌, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ తదితర ప్రాంతాల్లోన్ని దుర్గమ్మతల్లి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వం అనుమతులను నిరాకరించడంతో రావణదహనం వంటి కార్యక్రమాలు పట్టణంలో ఎక్కడ నిర్వహించలేదు.  ఖమ్మం మేయర్‌  పాపలాల్‌ సుడా చైర్మన్‌ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు నరహరి నర్సింహాచార్యులు, రామకృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు పూజల్ని జరిపారు. ఈవో కొత్తూరు జగన్‌మోహన్‌రావు పర్యవేక్షించారు. 

Updated Date - 2020-10-27T10:23:23+05:30 IST