సంప్రదాయబద్ధంగా ముగిసిన దసరా సంబరాలు

ABN , First Publish Date - 2022-10-07T06:26:11+05:30 IST

దేవి శరన్నవరాత్రుల పూజా కార్యక్రమాల సందర్భంగా స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాతను విజయధనలక్ష్మీదేవి అలంకరించారు.

సంప్రదాయబద్ధంగా ముగిసిన దసరా సంబరాలు
యర్రగొండపాలెంలో కరెన్సీ నోట్లతో అలంకరణ

 ఎర్రగొండపాలెం, అక్టోబరు 6 : దేవి శరన్నవరాత్రుల పూజా కార్యక్రమాల సందర్భంగా స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాతను విజయధనలక్ష్మీదేవి అలంకరించారు. 25లక్షలు నగదుతో భక్తులు  అలంకరణ చేశారు. ఆర్యవైశ్యపెద్దలు పాల్గొని భక్తులకు తీర్ధప్రసాదములు పంపిణీ చేశారు. పేదలకు అన్న సంతర్పణ నిర్వహించారు.

వైభవంగా పారువేట మహోత్సవం

గిద్దలూరు : దసరా శరన్నవరాత్రులు, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయదశమి రోజున అమ్మవారు శ్రీవిజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిశాల నుంచి కుసుమ హరనాథ మందిరం వరకు ఊరేగింపుగా తరలివచ్చిన అమ్మవారు అక్కడ జరిగిన పారువేట మహోత్సవంలో పాల్గొన్నారు. అలాగే షరాఫ్‌ బజారులో జరిగిన బ్రహ్మోత్సవ వేడుకలు ముగిశాయి. వేంకటేశ్వరస్వామి సైతం కుసుమ హరనాథ మందిరం ఆవరణలో జరిగిన పారువేట మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. గురువారం రాత్రి అమ్మవారిశాల నుంచి పట్టణంలోని పలువీధుల గుండా గ్రామోత్సవం సాగింది. దేవస్థాన కమిటీ అధ్యక్షులు గర్రె సత్యనారాయణ, కార్యదర్శి తుమ్మలపెంట సత్యనారాయణ తెలిపారు.

వెల్లివిరిసిన మత సామరస్యం

గిద్దలూరు, అక్టోబరు 6 : దసరా సందర్భంగా గిద్దలూరులో మత సామరస్యం వెల్లువిరిసింది. పట్టణంలోని ముస్లింలు కులమతాలకు అతీతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మత సామరస్యం నింపారు. పట్టణంలోని వీరన్నబావి వీధిలోని శ్రీకాళికాంబ దేవాలయంలో విజయదశమి పర్వదినం సందర్భంగా ముస్లింలు పలువురు టీడీపీ నాయకులు దేవాలయానికి వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు సయ్యద్‌ షాన్షావలి, టీడీపీ నాయకులు దూదేకుల హజరత్‌, షేక్‌ అహ మ్మద్‌ భాషా, షేక్‌ పెద్దభాషా, మస్తాన్‌, బద్రి భాషా, దూదేకుల ఖాశిం, తదితరులతోపాటు నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు బి.చంద్రశేఖర్‌యాదవ్‌, టీడీపీ నాయకులు బోయిళ్లపల్లి కిశోర్‌, రమణ, పందిళ్ళపల్లి శ్రీనివాసులు, రాఘవేంద్రయాదవ్‌ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

వాసవీమాత సేవలో విదేశీయులు

పామూరు, అక్టోబరు 6 : స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో జరుగుతున్న దసరా నవరాత్రుల వేడుకల్లో భాగంగా బుధవారం స్థానిక భక్తులతోపాటు పామూరుకు అతిథిగా విచ్చేసిన విదేశీ భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంగళవారం దేవస్థానంలో జరుగుతున్న విశేష అలంకరణ పూజ కార్యక్రమాల్లో జర్మన్‌ జంట ఆలయ ఆచారాన్ని పాటిస్తూ సంప్రదాయ వస్రధారణలో పాల్గొన్నారు. జర్మన్‌దేశంలోని గొట్టింగ్‌గన్‌ ప్రాంతంలో పామూరుకు చెందిన చల్లా వెంకటపతి ఎంఎస్సీ బయాలజీ చేస్తున్నాడు. దసరా సెలవులకు ఇండియా వస్తూ జర్మనీలో స్నేహితులైన మైకేల్‌, ఎలీనా దంపతులను వెంట తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా వారు విశేష పూజలు చేశారు. దేవస్థాన అధ్యక్షుడు వై.బాలకొండలరావు, గౌరవ అధ్యక్షుడు విశ్వనాథుని సత్యనారాయణ, దరిశి మస్తాన్‌రావు పాల్గొన్నారు.

వైభవంగా విజయదశమి

మార్కాపురం(వన్‌టౌన్‌) : విజయదశమి పర్వదినాన్ని సాంప్రదాయబద్ధంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. స్థానిక శ్రీ లక్ష్మీ చెన్నకేశస్వామి ఆలయంలో చెన్నకేశస్వామికి పారువేట ఉత్సవం నిర్వహించారు. స్థానిక అమ్మవారిశాలలో బుధ వారం వాసవీమాత, విజయదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.   వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో పట్టణ ఆర్యవైశ్య మహి ళా సంఘం ఆధ్వర్యంలో ని బుధవారం రాత్రి 1000 మందితో శ్రీ వాసవీ సహస్త్రగళార్చన పారాయణ కార్యక్రమం నిర్వహించారు. 

Updated Date - 2022-10-07T06:26:11+05:30 IST