ఆనందోత్సాహాలతో దసరా వేడుకలు

ABN , First Publish Date - 2021-10-17T06:27:50+05:30 IST

జిల్లా ప్రజలు శుక్రవారం దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. గ్రామం మొదలుకొని నగరం వరకు సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలు కొత్తదుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆనందోత్సాహాలతో దసరా వేడుకలు
పడిగెలలో రావణదహనం నిర్వహిస్తున్న దృశ్యం, నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో శమీ వృక్షానికి పూజలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత

జిల్లా అంతటా ఘనంగా దసరా సంబరాలు

శమీ వృక్షానికి పూజలు నిర్వహించిన భక్తజనం

ఉదయం నుంచే కిటకిటలాడిన ఆలయాలు

జోరుగా సాగిన నూతన వాహనాల అమ్మకాలు 

పలు ప్రాంతాల్లో పాల్గొన్న ప్రముఖులు

నిజామాబాద్‌ కల్చరల్‌, నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 16: జిల్లా ప్రజలు శుక్రవారం దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. గ్రామం మొదలుకొని నగరం వరకు సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలు కొత్తదుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలలో, శమీ వృక్షం వద్ద శమీ పూజలు నిర్వహించి ఒకరికొకరు శమి(బంగారం)ను పంచుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అలాయ్‌బలాయ్‌ చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డిపేట, లింగంపేట, బాన్సువాడ, ధర్పల్లి, డిచ్‌పల్లి, మోర్తాడ్‌, బాల్కొండ, కమ్మర్‌పల్లి, నిజాంసాగర్‌, ఆర్మూర్‌, బోధన్‌, భీంగల్‌, సిరికొండ, జక్రాన్‌పల్లి, మాక్లూర్‌, నవీపేట, నందిపేట తదితర ప్రాంతాలలో వేడుకగా దసరా ఉత్సవాలను జరుపుకొన్నారు. పలు ప్రాంతాల్లో మహిషాసుర మర్దిని అవతారంలో రాక్షస సంహారం చేయగా మరికొన్నిప్రాంతాల్లో రాముడు రావణాసురుడిని సంహరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన దసరా వేడుకల్లో పార్టీలకు అతీతంగా తాజా మాజీ ప్రతినిధులు, రాజకీయ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

పాలపిట్ట దర్శనం కోసం ఆరాటం

దసరా పండగ రోజు పాలపిట్టను దర్శించుకుంటే మం చిదని పండితులు పేర్కొనడంతో ప్రజలు పాలపిట్ట దర్శనం కోసం ఆరాటపడ్డారు. పాల పిట్టను దర్శించుకొనేందుకు నగర శివారు ప్రాంతాలకు వెళ్లి మరీ భక్తులు దర్శించుకున్నారు. పాలపిట్ట దర్శనంతో దసరా ఉత్సవానికి పరిపూర్ణత వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. దీంతో పాలపిట్ట దర్శనం కోసం గ్రామ సరిహద్దుదాటి అడవిబాట పట్టారు. ఈసారి పాల పిట్ట దర్శనం కోసం పలు ప్రాంతాల్లో ఎదురుచూడక తప్పలేదు. పాల పిట్ట దర్శనం చేసుకున్న తర్వాత ఆనంద పారవశ్యం చెందారు. 

వాహనాలు, ఆయుధాలకు పూజలు

విజయ దశమి పర్వదినాన ఏ వస్తువు కోన్నా శుభాన్ని అందిస్తుందని భక్తుల విశ్వాసం దీంతో వాహనాలను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేశారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని వాహన వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్శించే విధంగా లక్కీడ్రాల పేరిట స్కీంలను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు వాహనాలను విక్రయాలు చేసి పూజలు నిర్వహించారు. వివిధ వృత్తుల వారు, కార్మికులు పరికరాలకు, ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేశారు. వాహన పూజలతో ఆలయాలు సందడిగా మారాయి. గత ఏడాది కరోనా కారణంగా మందకొడిగా సాగిన వాహనాల అమ్మకాలు ఈసారి జోరుగా సాగాయి. 

దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

దసరా ఉత్సవాలు గత సంవత్సరంకంటే ఈ సారి వేడుకగా సాగాయి. కరోనా కారణంగా గత సంవత్సరం దసరా వేడుకలను సాధారణంగా నిర్వహించుకోగా ప్రముఖులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సారి కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొని శమి వృ క్షానికి పూజలు చేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని గాయత్రి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రావణదహనం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్త ముఖ్యఅతిథిగా హాజరై రాముడికి పూజలు చేసి రావణదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ వినాయక్‌నగర్‌లోని అభయాంజనేయ ఆలయంలో నిర్వహించిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం ఆయనకు జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ముఖ్య నేతలు మానాల మోహన్‌రెడ్డి, కేశవేణు, నగేష్‌రెడ్డి, శేఖర్‌గౌడ్‌ దసరా శుభాకాంక్షలు తెలిపారు. 

కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకొన్న ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత దసరా పండుగను నిజామాబాద్‌లో నగరంలో తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొన్నారు. హౌజింగ్‌బోర్డులోని తన నివాసంలో మొదట ఆయుధపూజ నిర్వహించిన ఆమె అనంతరం సుభాష్‌నగర్‌ రామాలయంలో సతీసమేతంగా జంబి పూజలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ మైదానంలో జరిగిన దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. శనివారం తన క్యాంప్‌ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉండగా పలువురు ఆమెకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ తదితరులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - 2021-10-17T06:27:50+05:30 IST