పండుగ చేసుకున్నారు!

ABN , First Publish Date - 2021-10-17T05:13:34+05:30 IST

జిల్లాలో దసరా వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించే విజయదశమిని ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

పండుగ చేసుకున్నారు!

  •  వైభవంగా దసరా వేడుకలు
  • ఊరూరా జమ్మి చెట్లకు పూజలు.. రావణ దహనాలు 
  • అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్త జనం
  • భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర, చెరువుల్లో ప్రతిమల నిమజ్జనం
  • ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు, బతుకమ్మ ఆటాపాటలు
  • జమ్మి ఇచ్చి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు


జిల్లాలో దసరా వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించే విజయదశమిని  ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గతేడాది కొవిడ్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైన జనం ఈ సారి వాడవాడలా అమ్మవార్లను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజలు  చేసి నిమజ్జనం చేశారు. శుక్రవారం దసరా సందర్భంగా  శమి వృక్షాలకు పూజలు చేశారు. అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. జమ్మిని పంచుతూ ఒకరికొకరు  పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.   


ఆమనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి/చేవెళ్ల/కందుకూరు/ఇబ్రహీంపట్నం/యాచారం/శంషాబాద్‌ రూరల్‌/షాద్‌నగర్‌ అర్బన్‌/ మాడ్గుల/ కొందుర్గు: జిల్లాలో దసరా వేడుకలు అంబరాన్నంటాయి. ఆమనగల్లు పట్టణంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రచ్చకట్ట వద్ద బేతాళుడి, ఆయుఽ ద పూజలు నిర్వహించి బ్యాండు వాయిద్యాలతో మాడ్గుల రోడ్డులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు చేపట్టారు. అనంతరం రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమండ్రి కళాకారుల బృందం నిర్వహించిన మహిషాసురమర్ధిని నృత్యరూపకాలు, కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కడ్తాల మండ లం  మైసిగండి శివరామాలయం లో దసరా ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధల తో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా  అమ్మవారు రాజరాజేశ్వరీదేవి  అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడ్గుల మండలంలోని దుర్గామాత ఆలయంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పూజలు చేశారు.  కందుకూరు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో  దసరా పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కందుకూరు, దాపర్లపల్లి, నేదునూరు తదితర గ్రామాల్లో అమ్మవారి శోభాయాత్ర నిర్వహించి చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ యువ నేత ప్రశాంత్‌మార్‌రెడ్డిలు స్వగ్రామమైన ఎలిమినేడులో జమ్మి పూజ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే తల్లి పద్మమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రజాప్రతినిఽధులు, నాయకులు ఎమ్మెల్యేను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా యాచారం, మంచాల, ఆదిభట్ల మండలాల్లో పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. శంషాబాద్‌ మండల పరిధి పెద్దగోల్కొండలో దుర్గామాత ముక్కు పుడకను గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్‌ రూ.2.60లక్షలకు దక్కించుకున్నారు. దసరా ఉత్సవాలు షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని కేశంపేట, కొత్తూరు, నందిగామ మండలాల్లో  శుక్రవారం రాత్రి ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గామాత విగ్రహాలు శనివారం గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. కొందుర్గు మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారిని ఆలయం నుంచి పెండ్యాల గుట్టపై ఉన్న పాత ఆలయం వరకు ఉరేగింపు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. 

వైభవంగా వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం

చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ మండలాల్లో దసరా ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా చేవెళ్ల మండల కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం స్వామివారి ఊరేగింపు కనుల పండువగా కొనసాగింది. వేడుకలను తిలకించేందుకు ప్రజలు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. చేవెళ్ల మండల కేంద్రంలోని రచ్చబండ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. క్రేన్‌ సహాయంతో అమ్మవారి విగ్రహాన్ని పుష్కరిణిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు. అనంతరం రాత్రి వేంకటేశ్వరస్వామివారు ఆలయం నుంచి గ్రామం వరకు ఆశ్వ వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ ప్రజలకు దర్శనమిచ్చా రు. శోభాయాత్ర సందర్భంగా చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐ విజయ్‌భాస్కర్‌రెడ్డి బందోబస్తు నిర్వహించారు.

వికారాబాద్‌ మేడ్చల్‌ జిల్లాలో మిన్నంటిన సంబురాలు

వికారాబాద్‌/మర్పల్లి/బంట్వారం/కోట్‌పల్లి/మోమిన్‌పేట/నవాబుపేట/ ధారూరు/ తాండూరు/ తాం డూరురూరల్‌/పెద్దేముల్‌/పరిగి/పరిగిరూరల్‌/ కులకచర్ల/దోమ/పూడూరు/యాలాల/బషీరాబాద్‌:  దసరా వేడుకలు వికారాబాద్‌, మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాల్లో అంబరాన్నంటాయి. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. జమ్మిగడ్డ వద్ద ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  కాగా ఆలంపల్లి అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో పూజల్లో భాగంగా  ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరమేష్‌ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారు జమ్మిగడ్డకు చేరుకున్న తర్వాత సాయంత్రం రావణ దహనం నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకొని  జమ్మిని పంచుతూ ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. దసరా ఉత్సవాల కోసం మున్సిపల్‌ ఈసారి రూ.9 లక్షలకు పైగా నిధులు ఖర్చు చేసి ఏర్పాట్లను చేయడం విశేషం. ధారూరు మండల పరిధిలో సాయంత్రం శమీ వృక్షానికి పూజలు చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వికారాబాద్‌ నియోజకవర్గంలోని మర్పల్లి, బంట్వారం, కోట్‌పల్లి, మోమిన్‌పేట, నవాబుపేట, వికారాబాద్‌ మండల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాల్లో దసరా వేడుకలతో పాటు శరన్నవరాత్రిలో భాగంగా ఆయా గ్రామాల్లో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి  ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేశారు.  తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిలు పేర్కొన్నారు.  తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఉత్సవాలు పాత తాండూరు బోనమ్మ ఆలయంలో రాత్రి వరకు కొనసాగాయి. ప్రత్యేక దర్శనంగా భవించే పాలపిట్టలను పట్టణ వాసులకు దర్శనం చేయించి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాలపిట్టలను వదిలారు. అనంతరం రావణదహనం నిర్వహించారు. అనంతరం శమిపూజలు నిర్వహించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఒకరికొకరు జమ్మి ఇచ్చి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ హిందూ ఉత్సవ సమితికి ఏర్పాటు చేసిన స్థలంలో  108 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. యాలాల, బషీరాబాద్‌ మండలాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నాయకులు, కార్యాకర్తలు కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

పరిగి, కొడంగల్‌ నియోజకవర్గంలో..

 పరిగి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే మహే్‌షరెడ్డి దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఆలయంలో జమ్మి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పోల్కంపల్లి, తొండపల్లి తదితర గ్రామాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకున్నారు. శుభాకాంక్షలు తెలిపేందుకు ఎమ్మెల్యే నివాసానికి భారీగా తరలివచ్చారు. డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి నివాసం వద్ద కూడా నాయకుల సందడి కనిపించింది. కులకచర్లలో కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడాపూర్‌లో దుర్గామాత నిమజ్జనం నిర్వహించారు.  తిర్మలాపూర్‌, ఇప్పాయిపల్లి, ఘనాపూర్‌ దుర్గామాత నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. తిర్మలాపూర్‌ గ్రామంలో డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దోమ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో దసరా పండుగను ప్రజలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి శివారెడ్డిపల్లిలో జమ్మిపూజలో పాల్గొన్నారు.  దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగింపు రోజు దోమ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేశారు. తొమ్మిది రోజుల పాటు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారి విగ్రహాలకు పూజలు నిర్వహించిన భక్తులు ఘనంగా నిమజ్జనం చేశారు. పూడూరు మండల పరిధిలో దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో  దసరా వేడుకలతో పాటు, దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా అమ్మవార్లను ఉరేగింపుగా తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనాలు చేశారు. 

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్‌, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలతో పాటు ఘట్‌కేసర్‌, శామీర్‌పేట, కీసర శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాలతోపాటు ఆయా గ్రామాల్లో శుక్రవారం దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి ఆలయాల వద్ద పెద్దఎత్తున వాహనాలకు పూజలు నిర్వహించారు. మహిళలు దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆయా గ్రామాల్లో బొడ్రాయిలు, జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించారు. మేడ్చల్‌, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఎదులాబాద్‌ ప్రధాన చౌరస్తాలో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడి వేషధారణలో చిన్నారులు గుర్రపు బండిలో వచ్చి రామబాణం ఎక్కుపెట్టి రావణ దహనం నిర్వహించారు. నాగారం, దమ్మాయిగూడ, తూంకుంట మున్సిపాలిటీల్లో రావణ దహనం నిర్వహించారు.  కాగా, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రి మల్లారెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

కండ్లకోయలో లాఠీఛార్జి

గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ కండ్లకోయలో దసరా వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ సందర్భంగా జరిగిన ఘర్షణలో పోలీసులు లాఠీచార్జి నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి జెండా ఆవిష్కరణ చే యకుండా బీజేపీ కౌన్సిలర్‌ హంసకృష్ణగౌడ్‌ అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో లాఠీఛార్జి చేసి ఇరువర్గాలనుచెదరగొట్టి, కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అప్పారావు తెలిపారు.

Updated Date - 2021-10-17T05:13:34+05:30 IST