మనిషిని బతికించడం మరిచిపోలేను..

ABN , First Publish Date - 2022-09-24T16:21:27+05:30 IST

సాధారణ కానిస్టేబుల్‌ విధులు నిర్వహిస్తున్న నేను తొక్కిసలాటలో అచేతనంగా పడి ఉన్న మహిళకు ప్రాణం పోయడం నా జీవితంలో మరచిపోలేని అనుభూతి అని బేగంపేటలో మహిళా

మనిషిని బతికించడం మరిచిపోలేను..

హైదరాబాద్/బేగంపేట: సాధారణ కానిస్టేబుల్‌ విధులు నిర్వహిస్తున్న నేను తొక్కిసలాటలో అచేతనంగా పడి ఉన్న మహిళకు ప్రాణం పోయడం నా జీవితంలో మరచిపోలేని అనుభూతి అని బేగంపేటలో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దువ్వ నవీన తెలిపారు. గురువారం జింఖానా మైదానం వద్ద క్రికెట్‌మ్యాచ్‌ టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో సుమారు 25మంది  స్వీపర్‌ రజిత(40)పై పడడంతో ఆమె కిందపడి అచేతన స్థితికి చేరుకున్న సంగతి విదితమే. వెంటనే కానిస్టేబుల్‌ నవీన 2 నుంచి 5 నిమిషాల వరకు సీపీఆర్‌ చేయడంతో రజిత తిరిగి శ్వాసతీసుకోవడం, అచేతనంగా ఉన్న మహిళలో కదలిక ప్రారంభమైంది. దీంతో ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి ప్రాణాలు కాపాడిన నవీనను పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమెను ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించింది. 


పోలీస్‌ అవ్వాలనేది మా నాన్న కల

మాది కరీంనగర్‌ జిల్లాలోని బాపుపేట. మానాన్న శివప్రసాద్‌, అమ్మ అనిత. మేం ఇద్దరం పిల్లలం నవీన, రాహుల్‌. నాతోపాటు చిన్నపుడే పద్మారావునగర్‌(సికింద్రాబాద్‌)లోని హమాలీబస్తీకి వచ్చి స్థిరపడ్డాం. నేను పోలీస్‌ అవ్వాలనేది మానాన్న కల.  దీంతో చిన్నప్పటి నుంచి నా మనస్సులో పోలీస్‌ కావాలని బలంగా ఉండేది. డిగ్రీ పూర్తయిన అనంతరం కానిస్టేబుల్‌గా సెలెక్ట్‌ అయ్యాను. మా నాన్న కల నెరవేర్చినందుకు సంతోషంగా ఉంది. అంతేకాదు.. పోలీసు శిక్షణలో నేర్పిన సీపీఆర్‌ పద్ధతితో ఓ మహిళకు సరైన సమయంలో చికిత్సను అందించి ప్రాణాపాయ స్థితినుంచి బయటకు తీసుకురావడం మరిచిపోలేను.


డాక్టరే కాదు పోలీస్‌ ప్రాణం పోస్తాడు...

ప్రజల తొక్కిసలాటలో ప్రాణప్రాయ స్థితి నుంచి మహిళను కాపాడిన కానిస్టేబుల్‌ నవీనను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్‌ వైద్యం చేసి ప్రాణం పోస్తాడని, అయితే ఎలాంటి వైద్యం తెలియక పోయినా.. మనిషికి శ్వాస అందనప్పుడు పోలీస్‌ శిక్షణలో చెప్పిన విషయాన్ని మననం చేసుకొని ఆచరణలో పెట్టి పోలీసులు సైతం ప్రాణం పోస్తారని పలువురు ఈ సందర్బంగా ఆమెను ప్రశంసించారు. 

 

పలువురి ప్రశంసలు

ప్రాణాపాయ స్థితి నుంచి ఓ మహిళనుకాపాడిన కానిస్టేబుల్‌ దవా నవీనాను నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సన్మానించారు. ఈ సందర్భంగా 5వేల నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అపోలో ఆస్పత్రి నిర్వాహకులు సైతం ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి సన్మానిస్తామన్నారు. కానిస్టేబుల్‌ వివరాలను పంపాలని గవర్నర్‌ తమిళి సై బేగంపేట పోలీసులకు సమాచారం పంపినట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. 

Updated Date - 2022-09-24T16:21:27+05:30 IST