అంతా కాసుల ‘మేటర్‌’

ABN , First Publish Date - 2020-09-23T07:23:56+05:30 IST

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న డ్వాక్రా యానిమేటర్లలో పలువురు సంఘాల్లో సభ్యుల నుంచి మామూళ్లు భారీగా

అంతా కాసుల ‘మేటర్‌’

జిల్లాలో డ్వాక్రా సంఘాలను అడ్డంగా పిండేస్తున్న పలువురు యానిమేటర్లు

సర్కార్‌ పథకాల డబ్బులు, బ్యాంకు రుణాలు ఖాతాలో పడగానే కమీషన్ల వసూళ్లు

రుణం ఏది మంజూరైనా ఒక్కో గ్రూపు నుంచి రూ.10 వేల వరకు షరా ‘మామూళ్లు’

ఇటీవల ఒక్కో మహిళ ఖాతాలో ఆసరా కింద నేరుగా రూ.18,500 వరకు జమ 

తమవల్లే డబ్బులు పడ్డాయంటూ సభ్యుల ఇంటికి వెళ్లి వెయ్యి చొప్పున లాగేసిన వైనం

డ్వాక్రా రుణాలు, కొవిడ్‌ రుణాలు, స్త్రీనిధి రుణాలు ఏది వచ్చినా గ్రూపు నుంచి ముట్టాల్సిందే

నెలనెలా యానిమేటర్లకు జీతం వస్తున్నా గ్రూపు ఖర్చుల కింద కొందరు మామూళ్ల దందా

ఇవ్వకపోతే రుణాలు రావని, గ్రూపు నుంచి తొలగిస్తారనే భయంతో మహిళల చెల్లింపులు


జిల్లాలో డ్వాక్రా సంఘాలు కొందరు యానిమేటర్లకు కాసుల కల్పతరువుల్లా మారాయి. లక్షలకు లక్షల ఆదాయం అర్జించే కామధేనువుల్లా మారాయి. ప్రభుత్వం నుంచి డ్వాక్రా సంఘాలకు రుణాలు మంజూరు దగ్గర నుంచి కొవిడ్‌ రుణాలు, స్త్రీనిధి రుణాలు, బీమా డబ్బులు ఏవి మంజూరైనా సభ్యుల కంటే ఈ గ్రూపులను పర్యవేక్షించే యానిమేటర్లకే ఆర్థిక ప్రయోజనం అందుతోంది. తమ వల్లే రుణాలు వచ్చాయని, కాగితాల ఖర్చుల పేరుతో పలువురు యానిమేటర్లు చేసే వసూళ్లు జిల్లావ్యాప్తంగా కోట్లలో ఉంటున్నాయి. ఒక్కో గ్రూపు నుంచి రూ.పది వేల వరకు డబ్బులు దండేస్తున్నారు. ఆసరా కింద గ్రూపు మహిళలకు నేరుగా ఖాతాల్లో డబ్బు జమవగా, తమ ఘనతేనని ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి వెయ్యిచొప్పున బాదేశారు. కొవిడ్‌ రుణాలు, బ్యాంకు రుణాల్లో పది శాతం కమీషన్‌ పిండేస్తున్నారు. డీఆర్‌డీఏ ఉన్నతాధికారులకు విషయం తెలిసినా కిమ్మనడం లేదు.


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న డ్వాక్రా యానిమేటర్లలో పలువురు సంఘాల్లో సభ్యుల నుంచి మామూళ్లు భారీగా పిండేస్తున్నారు. దీంతో గ్రూపు సభ్యులంతా లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం నుంచి బ్యాంకు ద్వారా ఆర్థికంగా ఏ రుణం, ప్రయోజ నం మంజూరైనా అందులో తమ వాటా కింద అడ్డగోలుగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. కాగితాల ఖర్చుల పేరుతో కాసులు పెద్దఎత్తున లాగేస్తున్నారు. అటు బ్యాంకర్ల సహకారం, అధికారుల అండదండలు ఉం టుండడంతో అడ్డగోలుగా మామూళ్లు వసూలు చేస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో గ్రామాల్లో యానిమేటర్లు పనిచేస్తారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.8 వేల వేతనం ఇస్తోంది. ఒక్కో యా నిమేటర్‌ తమ పరిధిలో 35 వరకు డ్వాక్రా గ్రూపులను పర్యవేక్షించాలి. ఆయా సంఘాలకు రుణాలు ఇప్పించడం, తిరిగి కట్టించడం, బ్యాంకర్లతో మాట్లాడి ఆర్థికంగా ఎదిగేలా చేయడం, గ్రూపు రికార్డులు పక్కాగా నిర్వహించడం వంటివన్నీ వీరిదే బాధ్యత.


జిల్లాలో 1.07 లక్షల డ్వాక్రా గ్రూపులను 2,300 మంది యానిమేటర్లు పర్యవేక్షిస్తున్నారు. వీరిలో కొందరు డ్వాక్రా గ్రూపులను తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కొందరైతే వీటిని అడ్డంపెట్టుకుని లక్షల్లో సంపాదించి ఆర్థికంగా భారీగానే స్థిరపడ్డారు. ఖరీదైన కార్లు, ఇళ్లు సమకూర్చుకున్నారు. గ్రూపులకు తరచుగా బ్యాంకుల నుంచి రుణాలు మంజూరవుతుంటాయి. ఒక్కో గ్రూపునకు వారి స్థాయి, పొదుపు, తిరిగి చెల్లించే స్తోమత ఆధారంగా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు వస్తాయి. వీటిని సభ్యులు పంచుకుని ఆర్థికంగా ఎదిగేందుకు వినియోగించుకోవాలి. అయితే ఇలా మంజూరైన రుణాల్లో కొందరు యానిమేటర్లు భారీగానే చేతివాటం చూపుతున్నారు.


రుణం మంజూరవగానే కాగితం ఖర్చులు, రికార్డులు, బ్యాంకు వాళ్లకు ఇవ్వాలనే సాకుతో ఒక్కో గ్రూపు నుంచి రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు మామూళ్లు వసూళ్లు చేస్తున్నారు. వచ్చిన రుణం డబ్బు ల్లో కోత వేసి చెల్లిస్తున్నారు. ముడుపులు ఇవ్వకపోతే తదుపరి తమకు రుణం రాదని, వచ్చినా ఇవ్వరని, లేదా గ్రూపులోంచి తీసేస్తారనే భయంతో చాలామంది మహిళలు మామూళ్లు ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రుణాల పేరుతో లక్షల్లో మామూళ్ల దందా నడుస్తోంది. గ్రూపులో మహిళలకు బీమా డబ్బులు మంజూరైతే అందులోను పది శాతం కమీషన్‌ పిండేస్తున్నారు. 


ఏదీ వదలరు..

ఇటీవల ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పథకం కింద జిల్లాలో డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ కింద రూ.780 కోట్లు జమ మహిళల ఖాతాల్లో వేసింది. ఒక్కో గ్రూపునకు లక్షల్లో డబ్బులు వచ్చాయి. ఇదంతా తమ ఘనతే అన్నట్లుగా పలువురు యానిమేటర్లు జిల్లావ్యాప్తంగా డబ్బులు భారీగా పిండేశారు. ఒక్కో మహిళ నుంచి వెయ్యి చొప్పున గ్రూపునకు రూ. పది వేలు సం పాదించారు. సున్నావడ్డీ కాపు మహిళలకు రూ.15 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రూ.18,500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమచేసింది. ఇది కూడా తమ ఘనతే అని చెప్పి పలువురు యానిమేటర్లు సభ్యుల ఇళ్లకు వెళ్లి రూ. వెయ్యి చొప్పున డబ్బులు పిండేశారు.


జిల్లావ్యాప్తంగా ఇలా లక్షల్లో మామూళ్లు వసూళ్లు జరిగాయి. కొవిడ్‌ రుణాల పేరుతో డ్వాక్రా గ్రూపులకు బ్యాంకులు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు రుణాలు మంజూరు చేశాయి. ఇందులోను పలువురు యానిమేటర్లు పది శాతం కమీషన్‌ లాగేశారు. స్త్రీనిధి రుణాల్లోను పదిశాతం చొప్పున పిండేశారు. డ్వాక్రా గ్రూపులకు సం బంధించి ఆర్థికంగా ఏప్రయోజనం వచ్చినా అందులో కమీషన్ల కోసం వాలిపోతున్నారు. ఇటీవల కమీషన్ల దందా పెరగడంతో కాకినాడ, రాజమహేంద్రవరం, కోనసీమలో పలుచోట్ల డ్వాక్రా గ్రూపు సభ్యులు ఆందోళనలు చేశారు. ఈ దందా డీఆర్‌డీఏ అధికారులకు తెలిసినా కిమ్మనడం లేదు. ఎందుకంటే యానిమేటర్ల వసూళ్ల నుంచి కొంత మండల, డివిజన్‌ స్థాయి అధికారులకూ అందుతోందని ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2020-09-23T07:23:56+05:30 IST