డ్వాక్రా నిధులు స్వాహా

ABN , First Publish Date - 2021-11-25T06:35:15+05:30 IST

బందరు మండలం ఎస్‌ ఎన్‌ గొల్లపాలెంలో డ్వాక్రా సంఘాలను అడ్డుపెట్టుకుని లక్షలాది రూపాయల నిధులను స్వాహా చేశారు.

డ్వాక్రా నిధులు స్వాహా

బుక్‌కీపర్‌పై ఎస్‌ ఎన్‌ గొల్లపాలెం గ్రామస్థుల ఫిర్యాదు

విచారణ జరిపించాలని అధికారులకు మంత్రి లేఖ

అక్రమాలను కప్పిపుచ్చేందుకు అధికారపార్టీ నేత ప్రయత్నం


ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : బందరు మండలం ఎస్‌ ఎన్‌ గొల్లపాలెంలో డ్వాక్రా సంఘాలను అడ్డుపెట్టుకుని లక్షలాది  రూపాయల నిధులను స్వాహా చేశారు. ఇక్కడ గ్రామైక్య సంఘం పరిధిలో ఉన్న 27 డ్వాక్రా సంఘాలకు చెందిన రికార్డులు రాసే బుక్‌కీపర్‌ కనుసన్నల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మండల పరిధిలోని సీసీలు, ఏపీఎంల సహకారంతో ఈ బుక్‌కీపర్‌  లక్షలాది రూపాయలు కాజేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల డ్వాక్రా మహిళలకు రుణమాఫీ నగదు జమయింది. వీటిని బ్యాంకు నుంచి డ్రా చేసుకుని పంపకాలు చేసుకునే సమయంలో సభ్యుల మధ్య తేడాలు రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో గ్రామైక్య సంఘం ద్వారా జరిగిన మొక్కల పంపకం, నకిలీ డ్వాక్రా గ్రూపుల పేరుతో రుణాల మంజూరు, గతంలో ఽధాన్యం కొనుగోలు ద్వారా వచ్చిన కమిషన్‌ సభ్యులకు తెలియకుండా డ్రా చేయడం.. తదితర అంశాలపై డ్వాక్రా మహిళలు, గ్రామపెద్దలు అధికారులకు, మంత్రి పేర్నినానికి ఇటీవల ఫిర్యాదు చేశారు. 


విచారణకు ఆదేశించిన మంత్రి పేర్ని

ఎస్‌ ఎన్‌ గొల్లపాలెం గ్రామైక్య సంఘంలో జరిగిన అవకతవకలపై డ్వాక్రా సంఘాల సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డీఆర్డీయే పీడీ కి మంత్రి పేర్ని నాని లేఖ రాశారు. నిధుల దుర్వినియోగం, ఆసరా నగదును పక్కదారి పట్టించడం, స్త్రీనిధి రుణాల మంజూరు, లబ్ధిదారులకు తెలియకుండా నగదు అన్యాక్రాంతం చేయడం, నగదు డ్రా చేసే సమయంలో అధికారుల సంతకాల ఫోర్జరీ తదితర  అంశాలపై  విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు.


కొనసాగుతున్న విచారణ 

మంత్రి ఆదేశాల మేరకు మూడు రోజుల క్రితం  విజయవాడ నుంచి వచ్చిన డీఆర్డీయే అధికారులు గ్రామంలో విచారణ ప్రారంభించారు. గ్రామైక్య సంఘానికి సంబంధించిన  రికార్డులను తమతో తీసుకువెళ్లారు. ఈ రికార్డులు చూసే సీసీ సుధను బుధవారం విజయవాడకు పిలిపించి విచారించారు. గురువారం కూడా విచారణ కొనసాగుతుందని సుధ తెలిపారు. 


రూ. 50 లక్షలకు పైనే గోల్‌మాల్‌? 

ఈ గ్రామైక్య సంఘం ద్వారా రూ.50 లక్షలకు పైగానే గోల్‌మాల్‌ జరిగిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలో ఈ సంఘం ద్వారా ధాన్యం కొనుగోలు చేయగా, కమీషన్‌ రూపంలో వచ్చిన నగదును బుక్‌కీపర్‌ విడతలవారీగా డ్రాచేసుకున్నట్టు గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకే మహిళను రెండు, మూడు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేర్చడం, వారి పేరిట రుణాలు ఇప్పించినట్టు చూపి, అసలు సభ్యులకు నగదు ఇవ్వకపోవడం వంటి చర్యలతో బుక్‌కీపర్‌ అక్రమాలకు పాల్పడిందంటూ ఫిర్యాదులందాయి. ఈ వ్యవహారంపై ఒకపక్క విచారణ జరుగుతుండగా, మరోపక్క  మండలస్థాయి వైసీపీ నాయకుడు ఒకరు బుక్‌కీపర్‌ను కాపాడేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేయడం కొసమెరుపు.  

Updated Date - 2021-11-25T06:35:15+05:30 IST