ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయ ఈవో అత్యుత్సాహం

ABN , First Publish Date - 2021-07-01T03:14:17+05:30 IST

జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ఈవో సుబ్బారెడ్డి అత్యుత్సాహం

ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయ ఈవో అత్యుత్సాహం

పశ్చిమ గోదావరి:  జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ఈవో సుబ్బారెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలవరం పర్యటన ముగించుకున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఇతర ప్రజాప్రతినిధులు మార్గమధ్యంలో దేవరపల్లిలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఇంటి వద్ద టీ బ్రేక్ కోసం ఆగారు. అయితే  ద్వారకా తిరుమల దేవస్థానం ఆలయ ఈవో జీ వి సుబ్బారెడ్డి వైసీపీ ప్రజా ప్రతినిధులు కలిసేందుకు అక్కడికి వెళ్లారు. ఆయనతోపాటు ఆలయ వేద పండితులను వైసీపీ ప్రజాప్రతినిధుల వద్దకు తీసుకు వెళ్లారు. అక్కడ సోఫాలో కూర్చుని ఉన్న ప్రజాప్రతినిధులకు వేద పండితులచే వేద ఆశీర్వచనం పలికించారు. అంతేకాక స్వామివారి శాలువాలు, మెమెంటోలు, ప్రసాదాలు  అందజేశారు. 


సాధారణంగా ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించిన ప్రజాప్రతినిధులు  లేదా వీఐపీలకు ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి శాలువా కప్పి, మెమెంటోలు, ప్రసాదాలు అందజేయడం పరిపాటి. అంతేకాక వేద ఆశీర్వచనం కూడా నేల మీద కూర్చోబెట్టి మాత్రమే ఆశీర్వచనం పలుకుతారు. కానీ ఇక్కడ  సోఫాలో కూర్చో బెట్టి మరి ఆలయ వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించారు ఆలయ ఈవో సుబ్బారెడ్డి. ఆలయ నియమాలకు వ్యతిరేకంగా ప్రజా ప్రతినిధుల ఇంటికి వెళ్లి మరీ  వేద ఆశీర్వచనం పలికి,  ప్రసాదాలు, మెమొంటోలు ఇవ్వడంపై ఈవో తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే  ఈవో సుబ్బారెడ్డి గతంలో కూడా విమర్శల పాలయ్యారు. గతనెల  వైశాఖమాస బ్రహ్మోత్సవాల చివరిరోజు స్వామివారి పవళింపు సేవలో గర్భాలయంలో వైసీపీ రంగులు పోలిన  దండలను అలంకరించడంపై అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈవో  తీరుపై పెద్ద దుమారం రేగింది.


Updated Date - 2021-07-01T03:14:17+05:30 IST