బాప్‌రే 290 కి.మీ!?

ABN , First Publish Date - 2021-06-21T08:48:31+05:30 IST

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మొదటి విడతగా 350 ఎలక్ర్టిక్‌ బస్సులు నడిపేందుకు ఏపీఎ్‌సఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది.

బాప్‌రే 290 కి.మీ!?

ఈ-బస్సు టెండర్లలో 

బ్యాటరీ మైలేజ్‌పై రసవత్తర ఘట్టం

ఈ-బస్సులు తిరగాల్సింది మన రాష్ట్రంలో

కానీ హైదరాబాద్‌, చెన్నైల్లో టెస్ట్‌ రన్‌

చెన్నై పరీక్షలో పాల్గొన్నది

సదరు కంపెనీ, ఆర్టీసీ అధికారులే!

290 కి.మీ. మైలేజీ ఇస్తోందని నిర్ధారణ

అందులో ఆటోమొబైల్‌ నిపుణులు లేరు

రెండో కంపెనీ ప్రతినిధులకూ చోటు లేదు

తిరుమల ఘాట్‌లో పరీక్షించకుండానే

తతంగం ముగించేందుకు కసరత్తు?


దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఓ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్‌ బస్సు బ్యాటరీ 290 కి.మీ. మైలేజీ ఇస్తోందని అధికారులు తేల్చడం విస్తుగొల్పుతోంది. నిపుణుల అభిప్రాయం తీసుకోకుండా.. మన రాష్ట్రంలోని రోడ్లపై టెస్ట్‌ రన్‌ చేయకుండా ఓ కంపెనీకి టెండర్‌ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మొదటి విడతగా 350 ఎలక్ర్టిక్‌ బస్సులు నడిపేందుకు ఏపీఎ్‌సఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. అందులో పెట్టిన నిబంధనలు ఒక కంపెనీకి అనుకూలంగా ఉన్నాయని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తమ్మీద రెండు కంపెనీలే బిడ్లు దాఖలు చేశాయి. మొదట్లో ఒక కంపెనీ కోసం నిబంధనలు రూపొందించారన్న ప్రచారం జరుగగా.. ఇప్పుడు అనూహ్యంగా మరో కంపెనీ విషయంలో జరుగుతున్న తతంగం ఆసక్తికరంగా మారింది.


ఒక్కసారి బ్యాటరీని చార్జింగ్‌ చేస్తే బస్సు 250 కి.మీ. దూరం ప్రయాణం చేయాలన్న నిబంధన పెట్టారు. అయితే దేశంలో తయారయ్యే ఏ ఎలక్ట్రిక్‌ బస్సు బ్యాటరీ కూడా అంత సామర్థ్యాన్ని కలిగి ఉండదని.. ఎవరి కోసమో ఈ నిబంధన పెట్టారని పలు దేశీయ కంపెనీలు ధ్వజమెత్తాయి. టెండర్‌ కమిషన్‌ ముందు అభ్యంతరాలు కూడా దాఖలు చేశాయి. తాజాగా పరీక్షా సమయంలో కొత్త కొత్త విషయాలు కనిపిస్తున్నాయి. ఒక కంపెనీ తమ బస్సు బ్యాటరీ 250 కి.మీ. మైలేజీ ఇస్తుందని పరీక్షించి చూపగా.. మరో కంపెనీ ఇంకో అడుగు ముందుకేసి 290 కి.మీ. మైలేజీ వస్తుందని చెప్పింది. దానిని ఆర్టీసీ అధికారులు కూడా నిర్ధారించడం విశేషం.


ఇక్కడకు తీసుకురాకుండా..

సాధారణంగా బిడ్డర్లు కోట్‌ చేసిన వాహనాలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి ఆ బస్సుల సామర్థ్యాన్ని పరిశీలించాలి. కానీ ఏం జరిగిందో ఏమో.. ఒక కంపెనీ బస్సును హైదరాబాద్‌లో, మరో కంపెనీ బస్సును చెన్నైలో పరీక్షించారు. చెన్నై టెస్ట్‌ రన్‌పైనే ఆర్టీసీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండు రోజుల కింద ఆ కంపెనీ ఎలక్ర్టిక్‌ బస్సును చెన్నైలో టెస్ట్‌ రన్‌కు తీసుకెళ్లారు. ఉదయం 11 గంటలకు మొదలుపెట్టారు. మధ్యాహ్న విరామం తర్వాత మరోసారి నడిపారు. ఆ బస్సులో కేవలం ఆ సంస్థ సిబ్బంది, కొందరు ఆర్టీసీ అధికారులు మాత్రమే ఉన్నారు. ఆ బస్సు బ్యాటరీ 290 కి.మీ.కు పైగా మైలేజీ ఇస్తోందని వారు తేల్చేశారు. భారత దేశంలో తయారయ్యే ఏ బ్యాటరీకీ లేని సామర్థ్యం ఈ బస్సు బ్యాటరీకి మాత్రమే ఎలా వచ్చింది? ఇది సరైన పద్ధతిలో జరిగిన పరీక్షేనా? ఇంకేమైనా జరిగిందా అన్న చర్చ బయల్దేరింది.


టెస్ట్‌ రన్‌లో కేవలం ఆ కంపెనీ సిబ్బంది, ఆర్టీసీ ప్రతినిధులే ఎందుకున్నారు? ఆటోమొబైల్‌ నిపుణులు ఎందుకు లేరు? ప్రజల భద్రత, ప్రజాధనం రక్షణకు సంబంధించిన విషయాల్లో కేవలం కంపెనీ, ఆర్టీసీ ప్రతినిధుల ధ్రువీకరణ సరిపోతుందా..? ఇలా పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇద్దరు బిడ్డర్లు ఉన్నప్పుడు రెండు కంపెనీల బస్సుల టెస్ట్‌ రన్‌ సమయంలో రెండు కంపెనీల ప్రతినిధులూ ఉంటే ఎవరికీ అపోహలు ఉండవు. కానీ అనూహ్యంగా 290 కి.మీ. మైలేజీ లెక్క బయటకు రావడంతో ఏదో జరుగుతుందన్న అనుమానాలకు ఆస్కారం ఇస్తోందని ఆర్టీసీ వర్గాలే చెబుతున్నాయి. చెన్నై, హైదరాబాద్‌లో సాధారణ రోడ్లపై టెస్ట్‌ రన్‌ తర్వాత తిరుమల ఘాట్‌ రోడ్డుపై కూడా నిర్వహించాలి. కానీ ఇది లేకుండానే వ్యవహారాన్ని ముగించేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2021-06-21T08:48:31+05:30 IST