‘ఇ–డి’ సర్కార్!

ABN , First Publish Date - 2022-07-05T06:49:23+05:30 IST

ఈ ప్రభుత్వం ఎక్కువకాలం నిలవదు, మధ్యంతరం వస్తే మనదే విజయం అని మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీచ్యుతుడైన ఉద్ధవ్ ఠాక్రే సోమవారం తన అనుచరులతో...

‘ఇ–డి’ సర్కార్!

ఈ ప్రభుత్వం ఎక్కువకాలం నిలవదు, మధ్యంతరం వస్తే మనదే విజయం అని మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీచ్యుతుడైన ఉద్ధవ్ ఠాక్రే సోమవారం తన అనుచరులతో ధైర్యవచనాలు పలికారు. మధ్యంతరానికి సిద్ధంగా ఉండాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన పార్టీ నాయకులను  ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఇడి) సాయంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అని విపక్షాలు ఆడిపోసుకుంటున్న నేపథ్యంలో, సోమవారం విశ్వాసతీర్మానంలో బలంగా నెగ్గుకొచ్చిన తరువాత కొత్త ఉపముఖ్యమంత్రి దానికి ఓ సరికొత్త నిర్వచనం ఇచ్చారు. మహారాష్ట్రలో ఇప్పుడున్నది ఏక్‌నాథ్– దేవేంద్ర (ఇ–డి) ప్రభుత్వమేనని అన్నారాయన. అంతేకాదు, ఈ ప్రభుత్వంలో అధికారంకోసం కుమ్ములాటలు ఉండవనీ, అద్భుతమైన సహకారంతో, అవగాహనతో నడుస్తుందనీ, అత్యధికశాతం ప్రజలు కోరుకున్నది ఈ ప్రభుత్వాన్నేనని స్పష్టంచేశారాయన.


ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినందుకు దేవేంద్ర ఫడణవీస్ విచారంగా ఉన్నారని అందరూ అనుకున్నదే. ప్రమాణస్వీకారోత్సవానికి రెండుగంటల ముందు సాగిన మంతనాలూ తెలిసినవే. తన దగ్గర మంత్రిగా పనిచేసిన షిండేకు ఇకపై తాను డిప్యూటీగా ఉండాల్సిరావడం దేవేంద్రకు నచ్చకపోవడంలో విశేషమేమీ లేదు. అధిష్ఠానం తన హోదా నిర్ణయించిన తరువాత కూడా ఆయన లొంగిరాలేదనీ, చివరకు అమిత్ షా, మోదీ స్వయంగా ఫోన్ చేసి నయానోభయానో ఒప్పించాల్సి వచ్చిందని అంటారు. ఈ కారణంగానే కాబోలు, తమ ప్రభుత్వం మనుగడపై విశ్వాసం పెంచే క్రమంలో సోమవారం ఫడణవీస్ చాలా చెప్పుకొచ్చారు. అప్పుడూ ఇప్పుడూ కూడా తనకు అధికారదాహం లేదనీ, అధినాయకత్వం తనను ఇంట్లో కూచోమన్నా అదేపనిచేసేవాడినని అన్నారు. 2019లో ప్రజలు గెలిపించింది బీజేపీ–శివసేన కూటమినేననీ, ఇప్పుడు అదే కూటమి, అసలుసిసలు శివసైనికుడి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిందన్నారు. నేను సముద్రాన్ని, వెనక్కు వెళ్ళేది మరింత బలంగా ముందుకు రావడానికేనని ఇటీవలే సవాలు చేసిన ఫడణవీస్ ఇప్పుడు తాను రావడమే కాక, షిండేను కూడా తీసుకువచ్చానని గర్వంగా చెప్పుకున్నారు.


ఎందరు శపించినా తమ ఇ–డి ప్రభుత్వానికి ఢోకాలేదన్నది ఫడణవీస్ ప్రసంగ సారాంశం. ఆదివారం స్పీకర్ ఎన్నికలోనే ఈ కూటమి బలం తేలిపోయినా, సోమవారం అది ఇంకొంత బలపడింది. షిండే ప్రభుత్వానికి అవసరానికి మించి ఓ ఇరవైమంది బలం ఉండగా, విపక్షం బలం ఇప్పుడు మరో ఎనిమిది తగ్గింది. స్పీకర్ ఎన్నిక సందర్భంగా విపక్షానికి 107 ఓట్లుపడితే ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ నేతలతో సహా కొందరు ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉండిపోయారు. ఫడణవీస్ దీనిని కనిపించని స్నేహహస్తాల ఆశీర్వాదమన్నారు. రెండువారాల క్రితం శివసేన అధినేత హోదాలో ఉద్ధవ్ ఠాక్రే షిండేవర్గానికి అనర్హత నోటీసులు జారీ చేయించారు. ఇప్పుడు షిండేవర్గం ఎన్నుకున్న కొత్త స్పీకర్ వెనువెంటనే  తమవర్గం ప్రతిపాదించిన కొత్త చీఫ్ విప్‌ను గుర్తించడం, ఆ చీఫ్ విప్ శివసేన ఎమ్మెల్యేలంతా షిండే పక్షాన ఓటుచేయాలని ఆదేశించడం, దానిని ధిక్కరించినవారిలో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య కూడా ఉండటంతో– బాలాసాహెబ్ మీద గౌరవంతో ఆదిత్యను మాత్రం వదిలేసి మిగతావారందరికీ నోటీసులు జారీ చేసినట్టు షిండే వర్గం చీఫ్ విప్ ప్రకటించారు. వీరిపై అనర్హత వేటుపడితే మహారాష్ట్ర కథ మరో మలుపు తిరుగుతుంది. ఇక, ఉద్ధవ్ ఠాక్రే పక్షాన మిగిలిన పదమూడు మందిలోనూ ఇద్దరు ఆఖరునిముషంలో గోడదూకేయడం ఆయనకు జరిగిన మరో అవమానం. ముందురోజు బహిరంగంగా ప్రజలందరి ముందూ ఠాక్రేలకోసం కన్నీళ్ళు పెట్టుకున్న ఓ ఎమ్మెల్యే కూడా షిండేపక్షాన చేరిపోవడం ఠాక్రేలకు భవిష్యత్తు ఎంత కఠినమైనదో తెలియచెబుతోంది.


వచ్చే సోమవారం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలతో ఈ పరిణామాలన్నీ ముడిపడి ఉన్నాయి. షిండే వర్గం పదిహేనుమంది ఎమ్మెల్యేల అనర్హతనూ సుప్రీంకోర్టు ఇంకా తేల్చవలసి ఉండగా, ఇంతలోగా చోటుచేసుకున్న ఈ మొత్తం పరిణామాలకూ, ఆదేశాలకూ విలువలేదన్నది ఠాక్రే వర్గం వాదన. షిండే ఆయన అనుచరుల అనర్హతను సుప్రీంకోర్టు ఎత్తిపడితే, కొత్త స్పీకర్, చీఫ్ విప్ ఎంపిక ప్రక్రియను తప్పుబడితే పాలకపక్షానికి ప్రమాదం తప్పదు. రాజకీయంగా అయితే, విపక్షంలో ఉన్న పార్టీలేవీ ఈ ఇ–డి ప్రభుత్వంపై కక్షగట్టి వెంటనే గద్దెదింపే స్థితిలో లేవు. ఫడణవీస్ హామీ ఇచ్చినట్టుగా అది చిరకాలం మనగలుగుతుందా లేదా అన్నది వేరే విషయం.

Updated Date - 2022-07-05T06:49:23+05:30 IST