ఈ-శ్రమ్‌పై.. నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-06-22T05:19:52+05:30 IST

అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-శ్రమ్‌ నమోదు జిల్లాలో నత్తనడకన సాగుతోంది.

ఈ-శ్రమ్‌పై.. నిర్లక్ష్యం

నత్తనడకన కార్మికుల గుర్తింపు ప్రక్రియ

ఎన్నో ఉపయోగాలున్నా.. స్పందన అంతంతే

అవగాహన కల్పించడంలో అధికారుల అలక్ష్యం

జిల్లాలో ఇప్పటికి  2,48,258 మంది మాత్రమే నమోదు

నిర్ధేశించిన లక్ష్యం చేరుకోవడంలో జిల్లా యంత్రాంగం విఫలం

 

ఈ-శ్రమ్‌.. అసంఘటిత రంగ కార్మికులకు ఎంతో ఉపయోగకరమైన పథకం. కార్మికుల భద్రత, సంక్షేమమే ధ్యేయంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనుకోని ఉపద్రవం సంభవించినప్పుడు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందవచ్చు. ఈ-శ్రమ్‌ కార్డు ఉంటే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, వివిధ సంక్షేమ పథకాల లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇంతటి ప్రాధాన్యమైన ఈ పథకంపై జిల్లాలో కార్మికులకు అవగాహన లేక అంతగా స్పందన లేదు. కార్మికులను చైతన్యపరచాల్సిన అధికారులు అలక్ష్యం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఈ పథకం నత్తనడకన సాగుతోంది. 


బాపట్ల, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-శ్రమ్‌ నమోదు జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఈ-శ్రమ్‌ నమోదు వల్ల కార్మికులకు కేంద్రం నుంచి గుర్తింపు కార్డు వస్తుంది. అసంఘటితరంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం గతేడాదే ఈ-శ్రమ్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2021 ఆగస్టు నుంచే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. 18 నుంచి 59 ఏళ్ల వయసుండి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న శ్రమజీవులందరూ దీనికి అర్హులు. జిల్లాలో 4,81,711 మంది కార్మికులను ఈ-శ్రమ్‌ గొడుగు కిందకు తీసుకురావాలనే లక్ష్యాన్ని యంత్రాంగం నిర్దేశించుకుంది. అయితే గతంలోనే నమోదు గడువు ముగిసినా లక్ష్యం మేరకు నమోదు జరగలేదు. దీంతో నిర్ణీత గడువు అంటూ లేకుండా ప్రస్తుతం పోర్టల్‌లో నమోదు ప్రక్రియ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఇప్పటి వరకు 2,48,258 మంది మాత్రమే నమోదయ్యారు. కార్మికులకు సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలు అందే కీలక ప్రక్రియ జిల్లాలో మొక్కుబడిగా సాగుతుంది. ఈ-శ్రమ్‌ కింద కార్మికుల పేరు నమోదు చేసిన కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ నిర్వాహకులకు ఒక్కో కార్డుకు రూ.13 ఇస్తామని తెలిపింది. కానీ చేసిన వాటికి నెలల తరబడి డబ్బులు జమ కాకపోవడంతో నమోదుకు వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. లేదంటే తమ దగ్గరకు వచ్చినవారి దగ్గర నుంచి నామమాత్రంగా డబ్బులు తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ-శ్రమ్‌ నమోదుకు సచివాలయాల్లో కూడా అవకాశం ఉంది. అయితే  కార్మికులకు అవగాహన కరువవడంతో నమోదు ప్రక్రియ వేగంగా సాగడం లేదు. 


కరోనా సమయంలో ఎన్నో వెతలు

అసంఘటిత రంగ కార్మికులు కరోనా సమయంలో అత్యంత దయనీయ పరిస్థితులు ఎదుర్కొన్నారు. వలస కూలీల అవస్థలైతే మరింత ఘోరం. ప్రభుత్వాలు ఏదైనా సాయం చేద్దామన్నా వారిని గుర్తించడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఈ-శ్రమ్‌ కార్డు అందిస్తే వారి సంక్షేమం కోసమే ఏదైనా కార్యక్రమం నిర్వహించడానికి వీలుంటుందనే ఉద్దేశంతో కేంద్రం ఈ-శ్రమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పోర్టల్‌లో వారి నమోదు కార్యక్రమం చేపడుతుంది. అయితే అధికారుల్లో చిత్తశుద్ధి లేక పోవడంతో కార్మికులు దీనిపై అవగాహన లేక భారీగా నష్టపోయే అవకాశం నెలకొంది.  


నగదు వసూలు చేస్తే చర్యలు

కార్మికుల పేర్లు నమోదుకు కామన్‌సర్వీస్‌ సెంటర్లలో, సచివాలయాల్లో నగదు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతిరోజు సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు సచివాలయాల్లో ఈ -శ్రమ్‌ నమోదు కార్యక్రమాన్ని సిబ్బంది విధిగా చేపడుతున్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా క్రమం తప్పకుండా నిర్వహస్తున్నాం. అర్హులైన ప్రతివారికి ఈ-శ్రమ్‌ కార్డులు అందించి త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటాం. 

- జి. ధనలక్ష్మి, లేబర్‌ ఆఫీసర్‌, బాపట్ల జిల్లా


వీరందరూ అర్హులే..

ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ సభ్యత్వం లేని చిరువ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు, వ్యవసాయ కూలీలు, చేనేత కార్మికులు, వీధి వ్యాపారులు, ఆశా వర్కర్లు, మత్స్యకారులు,  ఉపాధి కూలీలు, ఆటో డ్రైవర్లు, రిక్షా, రాడ్‌ బెండింగ్‌, ప్లంబింగ్‌, టైల్స్‌, కరెంటు, వెల్డింగ్‌, ఇటుక తదితర రంగాలలో పనిచేసే కార్మికులు ఈ-శ్రమ్‌ నమోదుకు అర్హులు. దీనిలో నమోదై ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం కల్పించే వివిధ పథకాలు, అవకాశాలతో పాటు సామాజిక భద్రత కోసం అందించే ఆర్థికసాయాన్ని నేరుగా నామినీల ఖాతాకు కేంద్రం జమ చేస్తుంది.


ఎన్నెన్నో ప్రయోజనాలు

ఈ-శ్రమ్‌లో చేరిన ప్రతీ అసంఘటిత రంగ కార్మికుడికి 12 అంకెలు గల ప్రత్యేక యూనివర్సల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరుతో(యూఏఎన్‌) గుర్తింపు కార్డును కేంద్రం ఇస్తుంది. ఈ కార్డు ఉంటే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత, సంక్షేమ పథకాలను కేంద్రం వర్తింపజేస్తుంది. ఈ - శ్రమ్‌లో నమోదు చేసుకున్న ప్రతీ కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్షబీమా యోజన(పీఎంఎస్‌బీవై) కింద రెండు లక్షల ప్రమాద మరణ, అంగవైకల్య బీమాను ఉచితంగా కేంద్రం అందిస్తుంది. భవిష్యత్‌లో ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులను ఉద్దేశించి చేపట్టబోయే వివిధ స్కీములకు ఆ కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్నాయి. కార్మికుల సామాజిక భద్రత కోసం అందించే సాయాన్ని ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆ మొత్తాన్ని నేరుగా నామినీ ఖాతాలో జమ చేసే విధంగా కేంద్రం ఏర్పాటు చేసింది.

Updated Date - 2022-06-22T05:19:52+05:30 IST