ప్రచారంపై డేగ కన్ను!

ABN , First Publish Date - 2021-03-02T05:34:56+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏర్పాట్లలో యంత్రాంగం తలమునకలై ఉంది. మరో వైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అప్రమత్తమైంది. అభ్యర్థుల ప్రచారంపై ఆంక్షలు విధించింది. నిబంధనలు కచ్చితంగా అ

ప్రచారంపై డేగ కన్ను!




ఐదుగురికి మించి ఉండరాదు

కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందే

డబ్బు, మద్యం ప్రవాహంపై ప్రత్యేక నిఘా

మునిసిపల్‌ ఎన్నికలపై ఎస్‌ఈసీ ఆదేశాలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

మునిసిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏర్పాట్లలో యంత్రాంగం తలమునకలై ఉంది. మరో వైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అప్రమత్తమైంది. అభ్యర్థుల ప్రచారంపై ఆంక్షలు విధించింది.  నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌కు, ఎస్పీ అమిత్‌ బర్దర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాల్టీలతో పాటు పాలకొండ నగర పంచాయతీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 10న పోలింగ్‌ నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ అభ్యర్థులు బరిలో దిగారు. అభ్యర్థులకు మద్దతుగా అన్ని పార్టీల నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఈనెల 3వ తేదీతో నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఏ పార్టీ తరుఫున ఎవరు అభ్యర్థులు అనేది బుధవారం తేలిపోనుంది. అన్ని పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఎస్‌ఈసీ ఎన్నికల ప్రచారంపై గట్టి నిఘా పెట్టేందుకు సిద్ధమవుతోంది. 


నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ప్రచారంలో అభ్యర్థులు కోవిడ్‌ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఆంక్షలు విధించింది. ఒకవేళ అభ్యర్థి ఎస్‌ఈసీ విధించిన నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. కోవిడ్‌ నిబంధనల ప్రకారం ప్రచారానికి అభ్యర్థి తనతో మరో ఐదుగురిని మాత్రమే వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతకు మించి కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటే, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్లే పరిగణించనున్నారు. ఇప్పటికే పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, పాలకొండ నగర పంచాయతీల పరిధిలో పార్టీల నేతలు ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. ఎస్‌ఈసీ కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చిన నేపథ్యంలో కలెక్టర్‌ జె.నివాస్‌ ఆ మూడు చోట్ల అభ్యర్థుల ఎన్నికల ప్రచార శైలిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఎన్నికల ఖర్చు, మద్యం ప్రవాహంపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా కొనసాగించనున్నారు. 

 


Updated Date - 2021-03-02T05:34:56+05:30 IST