‘ముందస్తు’ సిగ్నల్స్‌..!?

ABN , First Publish Date - 2022-03-20T08:22:26+05:30 IST

రాష్ట్రంలో ‘ముందస్తు’ మేఘాలు కమ్ముకుంటున్నాయా? వరసగా రెండో సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లి..

‘ముందస్తు’ సిగ్నల్స్‌..!?

  • ఇప్పటికే భారీ బడ్జెట్‌, కొలువుల ప్రకటన
  • వివిధ వర్గాలపై సీఎం కేసీఆర్‌ వరాలు
  • వరి రైతుల వ్యతిరేకత నుంచి బయటపడే వ్యూహం
  • పీకే బృందం సర్వేలు వేగిరం
  • పార్టీ పరిస్థితిపై స్పష్టమైన అంచనాకు టీఆర్‌ఎస్‌ చీఫ్‌
  • కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై  టీఆర్‌ఎస్‌ గురి


హైదరాబాద్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘ముందస్తు’ మేఘాలు కమ్ముకుంటున్నాయా? వరసగా రెండో సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. ముచ్చటగా మూడోసారి అధికార పీఠం దక్కించుకోవాలని కేసీఆర్‌ పావులు కదుపుతున్నారా? రాజకీయంగా ఆయన వేస్తున్న అడుగులు అటువైపేనా? సీఎం దూకుడుకు కారణం అదేనా? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పాటుతోపాటు అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్‌, పదవీ కాలం పూర్తి కాకుండానే 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించింది. అదే తరహాలో ఈసారీ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దీన్ని సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో ఖండిస్తూ వస్తున్నారు. కానీ, షెడ్యూల్‌ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నరకు పైగా గడువు మిగిలి ఉండగానే ఆయన రాజకీయంగా వేస్తున్న అడుగుల వల్ల ‘ముందస్తు’ ప్రచారానికి మాత్రం తెర పడడంలేదు. సీఎం కేసీఆర్‌ దూకుడు చూస్తున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ‘ముందస్తు’ అంచనాలను తోసిపుచ్చడం లేదు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి, ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని నియోజకవర్గ పార్టీ సమావేశాల్లో చెబుతున్నారు. 


ఇక విపక్ష నేతలు కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తమ కేడర్‌కు చెబుతూనే, ఆ మేరకు కసరత్తులు మొదలుపెట్టారు. ఈ ఏడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలతోపాటు లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కర్ణాటకతోపాటు తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయనే అంచనాలతోనే రాష్ట్రంలో వివిధ పార్టీలు రాజకీయ ఎత్తుగడలను అమలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ ఇటీవలి కాలంలో అనుసరిస్తున్న వ్యూహాలు ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సంకేతాలేనని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఆదాయంతో సంబంధం లేకుండా భారీగా ప్రతిపాదించారు. ఏకంగా 80 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విఽధుల్లోకి తీసుకుంటామని, సెర్ప్‌, మెప్మా, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని చెప్పారు. ఇలా వివిధ వర్గాలకు అసెంబ్లీ వేదికగా వరాలు ఇచ్చారు. మరోవైపు దేశాన్ని బాగు చేయడం కోసం జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం కేసీఆర్‌ పదేపదే చెబుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీయేతర కూటమి ఏర్పాటు ప్రయత్నాలూ చేస్తున్నారు. అంతేగాక అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి మళ్లీ అధికారంలోకి రావాలంటే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉండాలని ఆయన కోరుకుంటున్నారని అంటున్నారు. 


చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్‌ మరింత పుంజుకోకుండా చేసి, బీజేపీ పరిస్థితిని మెరుగుపర్చితే తన లక్ష్యం సులువుగా నెరవేరుతుందనేది కేసీఆర్‌ ఉద్దేశం కావచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలోనే పలు అంశాలపై కేంద్రంలోని బీజేపీని లక్ష్యంగా చేసుకుంటున్నారని అంటున్నారు. ఇక రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ తరఫున పేరొందిన రాజకీయ వ్యూహకర్త పీకేను రంగంలోకి దించారు. ఆయన బృందం నియోజకవర్గాలను సర్వేలతో వడపోస్తోంది. స్థానికంగా టీఆర్‌ఎస్‌ రాజకీయ పరిస్థితి ఏమిటి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? సిటింగ్‌కే మళ్లీ టికెట్‌ ఇస్తే గెలుస్తారా? ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?.. వంటి ప్రశ్నలతో పీకే బృందం స్మూక్ష స్థాయిలో సర్వేలు చేసి, ఎప్పటికప్పుడు నివేదికలను సీఎం కేసీఆర్‌కు అందజేస్తోంది. వాటితోపాటు రాష్ట్ర నిఘా విభాగం, ఇతర సర్వే సంస్థలు, వేర్వేరు మార్గాల ద్వారా అందుతున్న ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా ఆయన నియోజకవర్గాల రాజకీయ స్థితిగతులపై ఒక అంచనాకు వస్తున్నారు. 


రైతుల్లో వ్యతిరేకతను అధిగమించడానికే..

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలి నుంచి రైతు వర్గాల్లో తమకు అనుకూలత ఉన్న ట్లు భావిస్తోంది. రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ వంటి పథకాలు అందుకు దోహదపడుతున్నాయని అంచనా వేస్తోంది. అయితే ఇటీవల కాలంలో రైతుల్లో టీఆర్‌ఎ్‌సపై వ్యతిరేకత మొదలైనట్లుగా వివిధ సర్వేల్లో తేలినట్లు సమాచారం. అందుకు యాసంగి సీజన్‌లో ప్రభుత్వం వ్యవహరించిన తీరును కారణంగా చెబుతున్నారు. ఈసారి యాసంగి సీజన్‌ ప్రారంభానికి ముందే.. ఎవరూ వరి సాగు చేయొద్దని ప్రభుత్వం స్పష్టంచేసింది. వరి సాగు చేస్తే రైతు బంధును నిలిపివేస్తామని పరోక్షంగా హె చ్చరికలు పంపింది. అయినా రైతులు పట్టించుకోలేదు. యాసంగిలో సాధారణ విస్తీర్ణాన్ని మించి వరి పంట సాగుచేశారు. దీంతో ధాన్యం కొనుగోలు సమస్యను సరిగా పరిష్కరించకపోతే ఆ ప్రభావం టీఆర్‌ఎస్‌పై పడనుంది. ఈ రకంగా క్షేత్రస్థాయి నుంచి వ చ్చిన నివేదికల నేపథ్యంలోనే కేసీఆర్‌ అప్రమత్తమై, ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ కార్యాచరణకు పూనుకున్నట్లు తెలుస్తోంది. యాసంగి ధాన్యం మొత్తాన్ని కేం ద్రం కొనుగోలు చేయాల్సిందేనన్న డిమాండ్‌తో ఆందోళనలకు దిగాలని నిర్ణయించినట్లు శనివారం ప్రకటించారు. 


ఇంకా ఏదైనా కారణం ఉందా..?

ముందస్తు ఎన్నికలు కాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ దూకుడుకు ఇతర కారణం ఏదైనా ఉందా? అనే కోణంలోనూ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ ఒకటి జరుగుతోంది. రాష్ట్రంలో అవినీతి పేట్రేగిపోయిందని, సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని బీజేపీ నేతలు గడిచిన రెండేళ్ల నుంచి చెబుతున్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ముప్పు ఉందనే సమాచారంతోనే సీఎం కేసీఆర్‌ బీజేపీపై కాలు దువ్వుతున్నారనేది ఆ చర్చల సారంశం. 

Updated Date - 2022-03-20T08:22:26+05:30 IST