
ఆ కుర్రాడు పీజీ చదివాడు.. ఎలాగైనా ప్రభుత్వోద్యోగం సంపాదించాలనే లక్ష్యం పెట్టుకున్నాడు.. యూపీఎస్సీ కోచింగ్ కోసం 2015లో ఢిల్లీ వెళ్లాడు.. మూడేళ్లు కష్టపడినా అతనికి కొలువు దొరకలేదు.. దాంతో ఉద్యోగం ఆశలు వదులుకుని ఇంటి దారి పట్టాడు.. తనకున్న పొలంలో పుట్టగొడుగుల సాగు ప్రారంభించి లక్షలు సంపాదిస్తున్నాడు.. ప్రస్తుతం అతను ఈ వ్యాపారం ద్వారా ఏడాదికి రూ.10 లక్షలు ఆర్జిస్తున్నాడు.. బీహార్లోని జెహానాబాద్కు చెందిన సూర్యప్రకాశ్ 2014లో ఎమ్ఏ పొలిటికల్ సైన్స్ పట్టా అందుకున్నాడు.
సివిల్స్ రాసి ఉద్యోగం సంపాదించాలనేది అతని లక్ష్యం. అందుకోసం 2015లో ఢిల్లీ వెళ్లి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు. మూడేళ్లు కష్టపడినా అతనికి ఫలితం కనబడలేదు. దీంతో 2019లో చదువు మానేసి ఇంటి దారి పట్టాడు. తనకున్న కొద్ది పాటు భూమిలోనే పుట్టగొడుగుల సాగు ప్రారంభించాడు. దానికి సంబంధించిన సమస్త వివరాలు తెలుసుకున్నాడు. స్వంత ఫార్ములాతో కంపోస్ట్ ఎరువు తయారు చేశాడు. కొన్ని మెషిన్లను కొని పుట్టుగొడుగులకు కావాల్సిన వాతావరణాన్ని కృత్రిమంగా తయారు చేశాడు.
సాధారణంగా పుట్టుగొడుగులు చలికాలంలోనే అందుబాటులో ఉంటాయి. అయితే సూర్య ప్రకాశ్ సంవత్సరం మొత్తం పుట్టగొడుగులను పండిస్తున్నాడు. చలి కాలంలో పుట్టగొడుగులు కేజీ ధర రూ.160 ఉంటే.. మిగిలిన కాలాల్లో కేజీ రూ. 250 వరకు పలుకుతుంది. సగటున రోజుకు సూర్యప్రకాశ్ రూ.2 వేలు వరకు సంపాదిస్తున్నాడు. ఖర్చులన్నీ తీసివేయగా ఏడాదికి అతని సంపాదన రూ.10 లక్షలు.