మళ్లీ భూప్రకంపనలు

ABN , First Publish Date - 2021-11-27T05:41:46+05:30 IST

రామకుప్పం మండలంలో వరుసగా భూప్రకంపనలు కొనసాగుతున్నాయి.

మళ్లీ భూప్రకంపనలు
పంద్యాలమడుగులో ఇళ్లనుంచి బయటికొచ్చిన ప్రజలు

భయాందోళనతో రోడ్లపైకి వచ్చిన జనం

ఆయా గ్రామాల్లో పర్యటించిన అధికారులు 

రామకుప్పం ఉన్నత పాఠశాలలో షెల్టరు ఏర్పాటు


రామకుప్పం, నవంబరు26: రామకుప్పం మండలంలో వరుసగా భూప్రకంపనలు కొనసాగుతున్నాయి. మళ్లీ శుక్రవారం తెల్లవారుజామున బందార్లపల్లె పంచాయతీ పరిధిలోని గడ్డూరు, యానాదికాలనీల్లో, రాత్రి 8 గంటల ప్రాంతంలో పంద్యాలమడుగు, గొరివిమాకులపల్లె పంచాయతీల్లో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనచెంది ఇళ్లనుంచి బయటికొచ్చారు.  భూప్రకంపనల భయంతో పలువురు బంధువుల ఊర్లకు, పొలాల వద్దకు వెళుతుండగా మరికొందరు ఇళ్లు వదలి రోడ్లపైకి వచ్చేస్తున్నారు. క్వారీల వల్లే భూప్రకంపనలు వస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. అధికారులు మాత్రం క్వారీలు ఎక్కడా పని చేయడం లేదని, ఇటీవల కురిసిన వర్షాలతో జలాలు భూమిలోకి ఇంకే క్రమంలో భూమి కంపించినట్టు తెలుస్తుందన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కుప్పం గ్రామీణ సీఐ యతీంద్ర,  ఎస్‌ఐ వెంకటశివకుమార్‌, జడ్పీటీసీ నితిన్‌రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ విజలాపురం బాబు, కో-కన్వీనర్‌ చంద్రారెడ్డి, వైస్‌ ఎంపీపీ సుబ్రహ్మణ్యం, సర్పంచులు రాజగోపాల్‌, కేశవరెడ్డి ఆ గ్రామాల్లో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారు. అయినా కొందరు భయాందోళన చెందుతుండడంతో తహసీల్దారు దైవరాజన్‌, ఎంపీడీవో వెంకటరత్నం ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల వారికి రామకుప్పంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో షెల్టరు ఏర్పాటు చేశారు. 



Updated Date - 2021-11-27T05:41:46+05:30 IST