భూంఫట్‌!

Published: Fri, 24 Jun 2022 00:07:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భూంఫట్‌! పెదారికట్ల గ్రామం కొండ ప్రాంతంలో ఆక్రమణలకు గురయిన భూములు

కనుమరుగవుతున్న కొండపోరంబోకు

ఆక్రమణలకు గురైన 1,300 ఎకరాలు 

ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు అందినా 

ఉలుకు పలుకులేని రెవెన్యూ యంత్రాంగం 

కాసుల మత్తులో కాలయాపన 

కొనకనమిట్ల, జూన్‌ 23 :

- కొనకనమిట్ల మండలం పెద్దారికట్లలో ఇటీవల జాతీయ రహదారి పక్కనే ఉన్న దేవాలయ నిర్మాణం పేరుతో కొండ పోరంబోకు భూమి కబ్జాకు పాల్పడ్డారు. ఈ విషయం బయటకు తెలియడంతో అధికారులు అప్రమత్తమై ఆక్రమణను తాత్కాలికంగా ఆపారు.

- వద్దిమడుగులో 600 ఎకరాల కొండ పోరంబోకు భూములు అక్రమార్కుల చేతిలోకి వెళ్లాయి. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు.

జిల్లాలో అధిక విస్తీర్ణం గల మండలాల్లో ఒకటి. పుష్కలంగా ప్రభుత్వ భూములున్న ప్రాంతం. అధికంగా కొండలు, గుట్టలు. అయితే మండలం మధ్య నుంచి రైల్వేలైన్‌ వస్తుండడం, ఇతర నీటి వనరులు వచ్చే అవకాశం ఉందని ప్రచారం వెరసి కబ్జాదారుల కన్ను మండలంపై పడింది. దానికి రెవెన్యూ అధికారుల అవినీతి కలిసొచ్చింది. ఇక చేప్పేదేముంది.. వందల ఎకరాలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. అదే కొనకనమిట్ల మండలం.. చివరకు నిరుపేదలు భూముల కోసం, ఇంటిస్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఏ గ్రామంలోనూ సెంటు భూమి దొరకని పరిస్థితి. వేల ఎకరాల ప్రభుత్వభూమి ఉన్న మండలంలో ఇదేంది విడ్డూరంగా ఉందని అధికారుల తీరును చూసి పలువురు ఎద్దేవా చేస్తున్నారు. మండలంలో రెవెన్యూ సిబ్బంది మామూళ్ల మత్తులో ముసుగుతన్ని పడుకున్నారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

 మండలంలో కోట్ల విలువ చేసే వందల, వేల ఎకరాల కొండ పోరంబోకు భూములు కనుమరుగువుతున్నాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు అందినా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని వద్దిమడుగు, పెదారికట్ల, చినారికట్ల గ్రామాల్లో వందల ఎకరాల కొండ పోరంబోకు భూములు ఆక్రమణలకు గురయ్యాయి. మరికొన్ని చోట్ల కబ్జాకు రంగం సిద్ధమైంది. అన్నిచోట్లా అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల అండదండలతో ప్రభుత్వ, వాగు, కొండ పోరంబోకు భూములను కొంతమంది అక్రమార్కులు ఆక్రమించుకొని గత కొంతకాలంగా సాగు కూడా చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో పశువుల మేతకు భూములు లేకపోవడంతో పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇందుకు కాట్రగుంట పంచాయతీ పేరారెడ్డిపల్లిలో 65 ఎకరాల పశువుల బీడు ఆక్రమణే ఉదాహరణ. అయితే పశువుల బీడులు, చెరువులు, ఇతర ప్రభుత్వ భూములను వరుసగా కాజేస్తూ వస్తున్న అక్రమార్కుల కన్ను ఇప్పుడు కొండపోరంబోకు భూములపై పడింది. వందల ఎకరాలను చదును చేసి గప్‌చుప్‌గా కబ్జా చేస్తున్నారు. పైకి మాత్రం దేవుని మందిరాల కోసమనో, ఇంకేదో ప్రజోపయోగ నిర్మాణాల కోసమని చెబుతుండటం గమనార్హం.


రైల్వేలైన్‌ రాకతో రెక్కలు

చినారికట్లలో ఎర్రకొండ, పొదిలికొండ ప్రాంతాల గుండా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను పనులు మొదలైనప్పటి నుంచి ఆ భూములపై అక్రమార్కుల కన్నుపడింది. ఆలోచన వచ్చిందే మొదలు అధికారపార్టీకి చెందిన కొందరు అక్రమార్కులు సర్వే నెంబర్‌ 501లో 461 ఎకరాల మేత పోరంబోకు భూములు ఉండగా అందులో ఇప్పటివరకు 350 ఎకరాలు ఆక్రమించుకొని సాగు చేస్తున్నారు. పెదారికట్లలో 686 సర్వే నెంబర్‌లో 350 ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైనట్లు గ్రామస్థుల ద్వారా తెలుస్తోంది. వేల ఎకరాల ప్రభుత్వ భూములు రికార్డుల్లో ఉన్నా ప్రభుత్వానికి సంబంధించిన అవసరాలకు సెంటు భూమి కూడా గ్రామాల్లో దొరక్కపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం. గ్రామంలో ఆక్రమణలపై అధికారులకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు అందాయి. ఉత్తుత్తి హడావుడి తప్ప ఆక్రమణకు గురవుతున్న భూముల విషయంలో రెవెన్యూ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు.  


ఏకంగా 600 ఎకరాలు కబ్జా

ఇదిలాఉండగా ముఖ్యంగా పెదారికట్లలో జాతీయరహదారి వెంబడి ఉన్న కొండపోరంబోకు భూములకు రెక్కలు రావడంతో అక్రమార్కులకు ఆశపుట్టింది. అంతేకాకుండా పెదారికట్లలో పెద్దకొండ ప్రాంతంలో రైల్వేట్రాక్‌ వెంట ఉన్న కొండ పోరంబోకు భూములు ఆక్రమణలకు గురైనట్లు గ్రామస్థులు చెప్తున్నారు. వద్దిమడుగులో సర్వే నెంబర్‌ 1, 2లో 600 ఎకరాల కొండ పోరంబోకు భూములు అక్రమార్కుల చేతిలోకి వెళ్లాయి. ఈ విషయంపై ఎమ్మెల్యేకు, జిల్లా ఉన్నతాధికారులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దానిపై సర్వే నిర్వహించి సమగ్ర సమాచారం అందించాలని జిల్లా అధికారులు మండల అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల గురించి అందరికీ తెలిసినా అధికారుల్లో మాత్రం కూసింతైనా చలనం లేదు. గ్రామాల్లో ఎవరైనా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తే నీకెందుకు.. అది పెద్దలకు సంబంధించిన విషయం..అంటూ అధికారులు ఫిర్యాదుదారులను బెదిరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. తాజాగా ఇటీవల కాలంలో పెదారికట్లలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న కొండ వద్ద దేవాలయ నిర్మాణం పేరుతో కొండ పోరంబోకు భూమి కబ్జాకు పాల్పడ్డ విషయం తెలిసిందే. 


పరిశీలించి చర్యలు తీసుకుంటాం 

వద్దిమడుగు గ్రామంలో ప్రభుత్వ భూమి ఎలాంటి ఆక్రమణకు గురికాలేదు. పెదారికట్ల, చినారికట్ల గ్రామాలలో ఆ భూములను పరిశీలించి చర్యలు తీసుకొంటాం. నిజమని తేలితే అక్రమార్కుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. 

- భాగ్యలక్ష్మి, తహసీల్దార్‌, కొనకనమిట్ల


భూంఫట్‌!చినారికట్ల గ్రామంలో రెల్వే ట్రాక్‌ వెంట ఆక్రమించుకొని సాగుచేస్తున్న భూములు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.