ltrScrptTheme3

భూంఫట్‌

Oct 17 2021 @ 00:05AM
తోళ్లమడుగు వాగును ఆక్రమించి నిర్మిస్తున్న భవనాలు

పొదిలిలో జోరుగా అక్రమణలు

రూ.200 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం

కలెక్టర్‌ ఆదేశించినా గుర్తింపు శూన్యం

వాగులు, వంకలు సైతం కబ్జా

అధికారులే కీలకం వ్యవహరిస్తున్న వైనం

కబ్జారాయుళ్లకు పూర్తి అండదండలు

పొదిలి రూరల్‌, అక్టోబరు 16 :

పొదిలి పట్టణంలో ప్రభుత్వ స్థలాలు మాయమవుతున్నాయి. ఇటీవల కలెక్టర్‌ ఆదేశాలతో ఒకవిశ్రాంత ఉద్యోగితోపాటు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు, ఆక్రమదారుడు వెళిశెట్టి వెంకటేశ్వర్లుపై పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ఈ నలుగురు అధికారులు నగరపంచాయతీకి చెందిన వారే. 

గతంలో మర్రిపూడి నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన పంచాయతీ కార్యదర్శి ఆక్రమణదారుల దగ్గర భారీఎత్తున ముడుపులు పుచ్చుకొని కట్టడాలకు, ఆక్రమణలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని అప్పట్లో భారీగా చర్చ జరిగింది. తర్వాత అతని స్థానంలో సంతమాగులూరు మండలం నుంచి వచ్చిన మరో అధికారి ఆక్రమదారులతో కుమ్మక్కై ఇష్టారాజ్యానికి వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి.  

పొదిలిలో అధికారులు అండగా ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. వాటిలో స్థలాలు, అసైన్డ్‌ భూములు, చెరువులు, వాగులు, వంకలు  ఉన్నాయి. ఆక్రమిత స్థలాల్లో కొందరు కట్టడాలు,  షాపింగ్‌ కాంప్లెక్స్‌లను సైతం నిర్మిస్తున్నారు. మరికొందరు దర్జాగా పంటలు సాగు చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన పంచాయతీ, ఇరిగేషన్‌ అధికారులు పైసలు తీసుకొని పచ్చజెండా ఊపుతున్నారు.  


 పొదిలిలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. రూ.కోట్ల విలువైన ఆస్తులు పరుపలపరమయ్యాయి. క్షేత్రస్థాయి అధికారులు, ఆక్రమణదారులు కుమ్మక్కై కబ్జాల పర్వం సాగిస్తున్నారు.  పట్టణంలో అనేకమార్లు జిల్లా ఉన్నతాధికారులు పర్యటించినప్పుడు ఆక్రమణలపై  స్థానికులు ఫిర్యాదులు చేయడం,  ఆతర్వాత కొద్దిరోజులు హడావుడి చేసి మిన్నకుండటం పరిపాటైంది. దీంతో ఆక్రమణలకు అంతులేకుండాపోయింది. 

ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం శూన్యం 

పొదిలిలో ఆక్రమణలపై అప్పటి కలెక్టర్‌ పోలా భాస్కర్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.  దాంతో ఓ మూడురోజులు ఆక్రమణలు గుర్తిస్తున్నట్లు హడావుడి చేశారు. తర్వాత కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌ అయ్యాయి. మళ్లీ ఆక్రమణల పర్వం మొదలైంది. అప్పటి కందుకూరు సబ్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ కూడా ఆక్రమణల ఫిర్యాదుపై చాలాసార్లు పొదిలిలో పర్యటించారు. ప్రభుత్వ ఆస్తులు సక్రమమా లేదా అక్రమమా తేల్చాలని ఆదేశాలిచ్చారు.  ఆయన బదిలీపై  వెళ్లడంతో ఆ ఆదేశాలు మరుగున పడ్డాయి. 

కుంచించుకుపోయిన చిన్నచెరువు, పెద్దచెరువు

పొదిలి చిన్న చెరువు 101.76 ఎకరాలు ఉండగా ఇప్పుడు అందులో 10 ఎకరాలు కూడా లేదు. అంతా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతోపాటు, పంటలు సాగు చేస్తున్నారు. ఉన్న 10 ఎకరాలు కూడా నడికుడి రైల్వేలైన్‌ కోసం పెద్ద గుంతలు తీయడంతో వీలుకాక వదిలేశారు. పెద్ద చెరువు 701.36 ఎకరాలకు గాను చుట్టూ ఆక్రమణలకు గురై ఇప్పుడు సుమారు 500 ఎకరాలు మిగిలింది. అందులో కూడా ఇటీవల కొంతమంది  అనుమతులు తీసుకున్నామని  భారీ మొత్తంలో తవ్వకాలు జరిపారు. అక్కడ కొంత పొలం కొనుగోలు చేసి వెంచర్లు వేస్తూ ఏకంగా నడి చెరువులో రోడ్లు వేశారు. ఆ కొనుగోలును చూపించి మరికొంత ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

వాగులను ఆక్రమంచి నిర్మాణాలు 

వందలాది ఎకరాలకు సాగు నీరు అందించే తోళ్లమడుగు, ముగ్గురాళ్ల వాగులను ఆక్రమించి ఏకంగా గృహాలు నిర్మించారు. రాకపోకలకు వీలుగా చప్టాలు కూడా ఏర్పాటు చేశారు. చెరువులకు సాగు నీరు సరఫరా అయ్యో ఇరిగేషన్‌ కాలువను, దర్శి - కనిగిరి సాగర్‌ ప్రధాన పైపులైన్‌ పూడ్చి, దానిపై ఏకంగా 20 రూముల కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు.  ఏబీఎం స్కూల్‌ ఎదురుగా ఉన్న 164 సర్వే నెంబరులో వెలసిన కాంప్లెక్స్‌ అదే.  840 సర్వేనెంబరులో 91 సెంట్ల భూమి ఉంది. అందులో దాదాపుగా ఆక్రమణకు గురై నిర్మాణాలు జరిగాయి. మరో సర్వే నెంబరు 833లో 87 సెంట్లు భూమి ఉండగా, అది కొంత మేర ఆక్రమణకు గురైంది. 480-1లో 1.58 సెంట్ల భూమిలో కొంత భాగం అన్యాక్రాంతమైంది. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఎదురుగా కాలువను ఆక్రమించి అతి పెద్ద బిల్డింగ్‌లను నిర్మించారు. దాన్ని ఆసరాగా తీసుకొని వాగు పొడవునా నిర్మాణాలు చేపట్టారు. మార్కాపురం అడ్డరోడ్డు సమీపంలో కంభాలపాడు పంచాయతీలో గల సర్వేనెంబరు 82-4లో 90 సెంట్లు పట్టా భూమి ఉంది. 82- 5లో 23 సెంట్లు ప్రభుత్వ భూమి ఉండగా 90 సెంట్లతోపాటు 23 సెంట్లను కూడా చదును చేశారు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతోపాటు, ఇప్పటికే అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకొని రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. 

సర్వే నిర్వహిస్తాం:

జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వారు ఇచ్చిన నెంబర్లలో కొన్ని చోట్ల సర్వే పూర్తి చేశాం. మరికొన్ని చోట్ల నిర్వహించాల్సి ఉంది. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. వెంకటేశ్వరస్వామి గుడి సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్రమించుకున్న 15 ఇళ్లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాం. ఇప్పటికే నగర పంచాయతీ కమిషనర్‌ ఆ ఇళ్లను సీజ్‌ చేశారు. మరో ఆరు గృహాలకు విద్యుత్‌, నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో బాధితులు కోర్టుకు వెళ్లగా స్టే ఇచ్చింది. ఆ కేసు తేలేవరకూ మేము ఏమీ చేయలేం.

- మహ్మద్‌ రఫీ, తహసీల్దార్‌, పొదిలి 


పెద్దబస్టాండ్‌ వద్ద ప్రధాన కాలువను ఆక్రమించి నిర్మించిన కాంప్లెక్సు


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.