ఆగని భూ ప్రకంపనలు

ABN , First Publish Date - 2021-11-28T04:43:17+05:30 IST

రామకుప్పం మండలం గడ్డూరు తదితర గ్రామాల్లో భూప్రకంపనలు ఆగడం లేదు.

ఆగని భూ ప్రకంపనలు
గడ్డూరులో గ్రామస్థులకు భోజన పొట్లాలు అందజేస్తున్న టీడీపీ నేతలు

రామకుప్పం మండలం గడ్డూరు తదితర గ్రామాల్లో భూప్రకంపనలు ఆగడం లేదు. అయితే తీవ్రత తగ్గినట్టు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఒకసారి మాత్రం స్వల్ప భూప్రకంనం చోటు చేసుకున్నట్లు పలువురు గ్రామస్థులు తెలిపారు. భూప్రకంపనలు సంభవించిన గ్రామాల్లో శనివారం జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి పర్యటించారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుండటం వల్ల ప్రకంపనలు వచ్చి ఉండవచ్చన్నారు. ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఆయన వెంట తహసీల్దారు దైవరాజన్‌, ఎంపీడీవో వెంకటరత్నం పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఆయన పీఏ మనోహర్‌, స్థానిక టీడీపీ నేతలతో కలిసి భూప్రకంపనలు చోటుచేసుకున్న గడ్డూరు, చిన్నగెరిగెపల్లె, పెద్దగెరిలెపల్లె, గోరివిమాకులపల్లెల్లో పర్యటించారు. ఎవరూ ఆందోళన చెందరాదని, అన్ని వేళలా అండగా ఉంటామన్నారు. ప్రజలకు భోజనపొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార యంత్రాంగం భూప్రకంపనలకు కారణాలు వెలికి తీసి, ప్రజల్లో భరోసా కల్పించాలన్నారు.టీడీపీ నేతలు ఆంజినేయరెడ్డి, మునస్వామి, ఆనందరెడ్డి, గంట్లప్పగౌడు, విశ్వనాథ్‌, వెంకటరమణ, వెంకటాచలం, రెడ్డెప్పరెడ్డి, రామలింగారెడ్డి, శ్రీనివాసులుగౌడు, చంద్రశేఖర్‌, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- రామకుప్పం



 కలెక్టరుకు చంద్రబాబు లేఖ


రామకుప్పం మండలంలో చోటుచేసుకున్న భూప్రకంపనలపై ప్రతిపక్షనేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు శనివారం  కలెక్టరుకు లేఖ రాశారు. బందార్లపల్లె, గొరివిమాకులపల్లె, పంద్యాలమడుగు పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో మూడు రోజులుగా భూప్రకంపనలు వస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆ లేఖలో  పేర్కొన్నారు. భూప్రకంపనల వల్ల పలు ఇళ్ల గోడలకు నెర్రెలు ఏర్పడ్డాయని, ఈ పరిస్థితుల్లో ప్రజలు గ్రామాలను వదిలి బంధువుల ఊళ్లకు వెళుతున్నారన్నారు. ఈ విషయమై తక్షణం విచారణ జరిపాలని, ప్రజలకు భరోసా కల్పించాలని, ఇళ్ళ గోడలు నెర్రెలు వచ్చిన వారికి ప్రభుత్వ సాయం అందించి ఆదుకోవాలన్నారు. అదేవిధంగా ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్ళకుండా మండల కేంద్రంలోనే పునరావాసం కల్పించాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు.

Updated Date - 2021-11-28T04:43:17+05:30 IST