పొటాష్‌కు కటకట

ABN , First Publish Date - 2021-10-26T06:50:06+05:30 IST

రైతుకు అనుకోని సమస్య ఎదురైంది. ఇది ఎవరి వైఫల్యమో గానీ వరి పంటకు ఎంతో అవసరమైన ఎరువు పొటాష్‌కు కొరత ఏర్పడింది. పైరు పాలుపోసుకుని, గింజ గట్టిపడడానికి పొటాష్‌ చాలా అవసరం. సెప్టెంబరు నెల తర్వాత పొటాష్‌ సరఫరా లేదు. దీంతో కొంతమంది వ్యాపారులు తమ వద్ద ఉ

పొటాష్‌కు కటకట

వరి గింజ పాలుపోసుకుని గట్టిపడడానికి పొటాష్‌  కీలకం

జిల్లాలో వివిధ దశల్లో  పంట 

కోనసీమలో పాలుపోసుకునే దశ


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

రైతుకు అనుకోని సమస్య ఎదురైంది. ఇది ఎవరి వైఫల్యమో గానీ వరి పంటకు ఎంతో అవసరమైన ఎరువు పొటాష్‌కు కొరత ఏర్పడింది. పైరు పాలుపోసుకుని, గింజ గట్టిపడడానికి పొటాష్‌ చాలా అవసరం. సెప్టెంబరు నెల తర్వాత పొటాష్‌ సరఫరా లేదు. దీంతో కొంతమంది వ్యాపారులు తమ వద్ద ఉన్న కొద్దిపాటి సరుకును బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. సాధారణంగా మన జిల్లా రైతాంగానికి ఏటా ఏదొక సమస్య ఏర్పడుతుంది. వరదలు, భారీ వర్షాలు, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో విధంగా నష్టపోతూనే ఉంటాడు. ఆరుగాలం కష్టించి పండించిన తర్వాత మార్కెట్‌లో అయినకాడకు కొంటారు. ఇదో వ్యథ.


కొన్న తర్వాత నెలల తరబడి సొమ్ములు ఇవ్వరు. మొదట నీటి సమస్య నుంచే రైతుల కష్టాలు మొదలవుతాయి. నారుమళ్లు, దమ్ముల నుంచి ఎరువుల వాడకం మొదలవుతుంది. కానీ ఎరువులు, పురుగుమందుల వ్యాపారుల మీద నిఘా లేనేలేదు. ఇటీవల గోకవరం ప్రాంతంలో ఓ రైతు పురుగుమందు బాటిళ్లు రెండు తీసుకుని వెళ్లి పంటకు కొట్టారు. అది పనిచేయలేదు. దీంతో బాటిల్‌ పరిశీలిస్తే ఆ మందు కాలపరిమితి దాటిపోయింది. ఇలా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేశారే కానీ, అక్కడ పూర్తి సదుపాయా లేవీ లేవు. విత్తనాల నుంచి ఎరువులు, పురుగుమందుల వరకూ వ్యాపారులు, దళారులదే పైచేయి. ఇన్ని సమస్యలతో రైతు పంట సాగు చేస్తుంటే, ఈసారి పొటాష్‌ కొరత ఏర్పడింది. జిల్లాలో 2 లక్షల 27 వేల హెక్టార్లలో వరి సాగవుతోంది. ఇది అధికారిక లెక్క మాత్రమే. కానీ జిల్లాలోని ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో కూడా వరి ఎక్కువ సాగు చేస్తున్నారు. వీటికి సరపడా ఎరువులు సకాలంలో దొరకవు. ఈసారి ఏమైందో కానీ రాష్ట్రవ్యాప్తంగా పొటాష్‌ కొరత ఏర్పడింది.


ఇటీవల తెలుగు రైతులు దీనిపై ఆందోళన చేశారు. ప్రస్తుతం జిల్లాలో వరి పంట వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉంది. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక దశలో ఉంటే, తూర్పు డెల్టాలో ఒకవిధంగానూ, సెంట్రల్‌ డెల్టా కోనసీమలో మరోవిధంగానూ ఉంది. కొన్నిచోట్ల గింజ ముదురుతోంది. కోనసీమలో 80 శాతం వరి పొట్టపోసుకునే దశలో ఉంది. మరో 20 శాతం ఇంకా లేత దశలో ఉంది. తూర్పుడెల్టాలో కూడా పొట్టపోసుకునే దశ కొన్నిచోట్ల, గింజ ముదురుతున్న స్థితి కొన్ని చోట్ల కనిపిస్తోంది. కానీ సెప్టెంబరు నెల నుంచే పొటాష్‌ కొరత ఏర్పడడంతో రైతులు గిజగిజలాడిపోయారు. దీనిపై జిల్లా వ్యవసాయాధికారులను కనీసం అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2,406 టన్నుల పొటాష్‌ ఉందని అధికారులు చెబుతున్నారు.కానీ ఎకరానికి సుమారు 30 కేజీల వరకూ కావాలి. కొన్నిచోట్ల బస్తా రూ.800కు పైగా అమ్ముతున్నారు. అంతకు కొనుగోలు చేద్దామన్నా చాలాచోట్ల లభ్యం కావడంలేదు. ఈ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో పొటాష్‌ లేకపోతే గింజగట్టిపడదని, పొల్లుతో దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు.


గింజలు చచ్చుబడిపోయాయి

పొటాష్‌ ఎక్కడా దొరకడం లేదు. నా చేలో సరైన సమయంలో పొటాష్‌ వేయకపోవడం వల్ల గింజలు చచ్చుబడిపోయాయి. ఈసారి దిగుబడి దారుణంగా పడిపోయే పరిస్థితి వచ్చింది.

చవ్వాకుల సుబ్బారావు, కడియం ఆవ

Updated Date - 2021-10-26T06:50:06+05:30 IST