కాకినాడ తీరంలో రెడ్ అలర్ట్

ABN , First Publish Date - 2022-05-11T20:38:27+05:30 IST

కోస్తా తీరాన్ని అసాని తుఫాన్ భయపెడుతోంది. ఊహించని విధంగా దిశలు మార్చుకుంటుంది.

కాకినాడ తీరంలో రెడ్ అలర్ట్

తూ.గో. జిల్లా: కోస్తా తీరాన్ని అసాని తుఫాన్ భయపెడుతోంది. ఊహించని విధంగా దిశలు మార్చుకుంటోంది. కాసేపట్లో తీరాన్ని తాకనుండడంతో కాకినాడ తీరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉప్పాడ, తొండంగిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ, కోనపాపపేట తదితర గ్రామాల్లోని కొన్ని ఇళ్లులు ధ్వంసమయ్యాయి. భారీ కెరటాల తాకిడికి తొండంగిలో హేచరీల పైపులైన్లు ధ్వంసమయ్యాయి. ఈదురు గాలులకు మామిడి, జీడి తోటలు నేలమట్టమయ్యాయి. ఉత్తరకోస్తా.. ఒడిషా మద్యలో తీరం దాటుతుందని తొలుత అధికారులు అంచనా వేయగా.. మచిలీపట్నం వైపు అసాని తుఫాన్ దూసుకొస్తోంది. రాబోయే 24 గంటలు అత్యంత కీలకమని వాతావరణ శాఖ తెలిపింది.


మచిలీపట్నం నుంచి విశాఖ వరకు భూభాగంపైనే పయనించి మళ్లీ సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 10 జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు అరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే 48 గంటలు ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ రెండు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read more