స్వతంత్ర దేశంగా తూర్పు ఉక్రెయిన్‌?

ABN , First Publish Date - 2022-02-22T08:46:10+05:30 IST

ఉక్రెయిన్‌ సంక్షోభం కొత్త మలుపు తీసుకుంది. రష్యా అనుకూల

స్వతంత్ర దేశంగా తూర్పు ఉక్రెయిన్‌?

 ఉక్రెయిన్‌ రెండు ముక్కలు

స్వతంత్ర దేశంగా తూర్పు ఉక్రెయిన్‌

గుర్తించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌

శత్రుత్వానికి స్వస్తి పలకాలని డిమాండ్‌

ఖండించిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌

ఉక్రెయిన్‌ సార్వభౌమాధికారంలో 

జోక్యమన్న బోరిస్‌ జాన్సన్‌

మరింత తీవ్రం కానున్న సంక్షోభం

కొత్త దేశంతో సైనిక ఒప్పందానికి ప్లాన్‌

తిరుగుబాటుదారులకు అండగా పుతిన్‌ 

గతంలో ఇదే పద్ధతుల్లో క్రిమియా విలీనం


మాస్కో, ఫిబ్రవరి 21: ఉక్రెయిన్‌ సంక్షోభం కొత్త మలుపు తీసుకుంది. రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న భూభాగాలను స్వతంత్ర దేశంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గుర్తించారు. ప్రజలను ఉద్దేశించి టీవీలో ఆయన మాట్లాడారు. తమతో శత్రుత్వానికి స్వస్తి పలకాలని, లేకపోతే, అందుకు వారే బాధ్యులవుతారని ఉక్రెయిన్‌ నేతలను డిమాండ్‌ చేశారు. పుతిన్‌ చర్యతో పాశ్చాత్య దేశాలతో సంక్షోభం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఖండించారు. ఇది సమర్థనీయం కాదని, ఉక్రెయిన్‌ సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడమేనని అన్నారు.


అంతకుముందు, ఇప్పటికే తమను స్వతంత్ర దేశంగా గుర్తించి, తమతో సైనిక రక్షణ ఒప్పందం చేసుకోవాలని తిరుగుబాటుదారులు పుతిన్‌ను కోరారు. పుతిన్‌ తాజా ప్రకటనతో, ఉక్రెయిన్‌ రెండు ముక్కలు కానుంది. రష్యన్‌ జాతీయులు అధికంగా ఉండే ఉక్రెయిన్‌ తూర్పు భాగం పూర్తిగా తిరుగుబాటుదారుల అధీనంలో ఉంది. అక్కడ ఉక్రెయిన్‌ ప్రభుత్వం ప్రభావం శూన్యం. స్వతంత్ర దేశంలాగే పాలన కొనసాగుతోంది. రష్యా దానిని లాంఛనంగా స్వతంత్రదేశంగా గుర్తించి, సైనిక ఒప్పందం చేసుకుంటే దాని రక్షణ బాధ్యత రష్యాది అవుతుంది. ఉక్రెయిన్‌ ప్రభుత్వం తిరుగుబాటుదారుల మీద దాడికి దిగితే రష్యా నేరుగా రంగంలోకి దిగి తిరుగుబాటుదారుల్ని కాపాడుకుంటుంది. ఉక్రెయిన్‌ దక్షిణభాగంలోని క్రిమియాను ఎనిమిదేళ్ల క్రితమే రష్యా కలిపేసుకుంది. 


 మొదట స్వతంత్ర దేశంగా ప్రకటించి, కొద్ది నెలల్లోనే రష్యాలో విలీనం చేసుకుంది. అదే పద్ధతుల్లో ఇప్పుడు తూర్పు భాగానికి ఎసరు పెట్టింది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సోమవారం రాత్రి దేశ భద్రతా మండలి భేటీ నిర్వహించారు. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా మద్దతు ఇస్తున్న వేర్పాటు వాద ప్రాంతాలను స్వతంత్ర రీజియన్లుగా గుర్తించే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సూచించారు. క్రిమియాకు తోడు ఉక్రెయిన్‌ తూర్పు భాగాలు రష్యా సొంతమైతే నల్లసముద్రం మీద, అక్కడి చమురు నిల్వలపై రష్యా పట్టు పెరుగుతుంది.


చర్చలకు బైడెన్‌ సిద్ధం

ఉక్రెయిన్‌ అంశానికి సంబంధించి అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య చర్చలు జరుగుతాయని ఫ్రాన్స్‌ అధ్యక్ష భవనం వెల్లడించింది. ఉక్రెయిన్‌ సంక్షోభంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపింది. చర్చలకు రంగం సిద్ధం చేయడం కోసం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌.. ఇరు ఆదేశాల అధ్యక్షులతో ఫోన్లో మాట్లాడారు. బైడెన్‌-పుతిన్‌ భేటీకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు గురువారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ సమావేశం కానున్నట్లు ఫ్రాన్స్‌ వెల్లడించింది. కొన్ని గంటలకే రష్యా నుంచి భిన్నమైన ప్రకటన వెలువడింది.


‘‘చర్చలకు ఇది తగిన సమయం కాదు. విదేశాంగ శాఖ మంత్రుల స్థాయి సమావేశం జరగడానికి మాత్రమే అవగాహన కుదిరింది’’ అని ప్రకటించింది. అధ్యక్షుల స్థాయిలో సమావేశం నిర్వహించే ప్రణాళికలేవీ లేవని తేల్చిచెప్పింది. దీన్ని తొందరపాటు చర్యగా అభివర్ణించింది. డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ సైన్యం దాడులను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. 


రష్యాపై ఆంక్షలు విధించాల్సిందే: ఉక్రెయిన్‌

యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యాపై ఆంక్షలు విధించాలంటూ యూరోపియన్‌ యూనియన్‌ను ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేసింది. యుద్ధాన్ని అడ్డుకోవాలంటే ఆంక్షలు తప్పవని పేర్కొంది. కయ్యానికి కాలు దువ్వుతున్న రష్యాకు గట్టి హెచ్చరికలు చేయాలని, అందులో భాగంగా ఈయూ చాలా నిర్ణయాలు తీసుకోవాలని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా అన్నారు. సోమవారం ఆయన బ్రసెల్స్‌లో ఈయూ నేతలతో సమావేశం అయ్యారు. ఆంక్షల డిమాండ్‌ను ఈయూ విదేశాంగ విధానం చీఫ్‌ జోసెప్‌ బోరెల్‌ తిరస్కరించారు. దౌత్య మార్గాల ద్వారానే పరిస్థితులను అదుపులోకి తెస్తామని చెప్పారు. 

Updated Date - 2022-02-22T08:46:10+05:30 IST