తింటే పులికాట్‌ చేప తినాలి!

ABN , First Publish Date - 2022-05-22T07:19:04+05:30 IST

పెంచిన చేపలకీ, పెరిగిన చేపలకీ రుచిలో చాలా తేడా ఉంటుంది. అందునా పులికాట్‌ సరస్సులో సహజంగా పెరిగే చేపలైతేనా.. అదుర్స్‌! ఇక రొయ్యలంటారా.. పులికాట్‌లో దొరికే రొయ్యలు ఒక్కసారి తింటే, ఇంకే రొయ్యలూ నచ్చవు.

తింటే పులికాట్‌ చేప తినాలి!

- మత్స్య సంపదకు ఖజానా 

- ఏడాది పొడవునా రొయ్యలూ, చేపలూ

తడ, మే 20 : పెంచిన చేపలకీ, పెరిగిన చేపలకీ రుచిలో చాలా తేడా ఉంటుంది. అందునా పులికాట్‌ సరస్సులో సహజంగా పెరిగే చేపలైతేనా.. అదుర్స్‌! ఇక రొయ్యలంటారా.. పులికాట్‌లో దొరికే రొయ్యలు ఒక్కసారి తింటే, ఇంకే రొయ్యలూ నచ్చవు. ఏడాదికి దాదాపు 1200 టన్నుల మత్యసంపద పులికాట్‌లో లభిస్తే, ఇందులో 60 శాతం వాటా రొయ్యలదే. ఉప్పునీరూ, మంచినీరూ కలిసే ప్రదేశం కావడంతో పులికాట్‌ రొయ్యలకు ఈ రుచి వచ్చిందంటారు. దాదాపు 12వేల మంది మత్స్యకారులకు పులికాట్‌ ఉపాధి చూపుతోంది. పులికాట్‌ చేపలూ, రొయ్యల రుచి ఎంత గొప్పదంటే.. వేల కిలోమీటర్ల దూరం నుంచీ కొన్ని వేల పక్షులు ఏటా ఈ సరస్సుకి వేటకు వస్తాయి. 


పులికాట్‌ సరస్సు

ఎంత పెద్దది: 759 చ.కి.మీ. విస్తీర్ణం.

ఎక్కడుంది: ఆంధ్రప్రదేశ్‌,  తమిళనాడు రాష్ట్రాల్లో 

లోతెంత: సగటున ఒక మీటరు మాత్రమే

ప్రత్యేకత: భారతదేశంలోనే రెండో పెద్ద ఉప్పునీటి సరస్సు

మత్స్య సంపద: 168 రకాల చేపలు, రొయ్యలు

ఆధారపడ్డ మత్స్యకారులు: 12,500 మంది.

ఆధారపడ్డ పక్షిజాతులు: 115


పులికాట్‌లో వందలాది రకాల రొయ్యలూ చేపలూ దొరికినా.. కొన్ని రకాలకు ప్రత్యేక డిమాండ్‌ ఉంది. ఇక్కడి మత్స్య సంపదలో రొయ్యలు తమిళనాడు, కేరళకు ఎగుమతి అవుతున్నా, చేపలు ఎక్కువగా స్థానిక అవసరాలకే సరిపోతాయి. చెన్నయ్‌ నుంచి నాయుడుపేట దాకా ప్రజలు పులికాట్‌ చేపలనే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. సరస్సులోపలా, తీరంలోనూ ఉండే పట్టపు పాళేల్లోని మత్స్యకారులు సరస్సులో వేటాడి తెచ్చిన చేపలను, ఆడవాళ్లు ఊళ్లలో తిరిగి అమ్ముతారు. 

అమావాస్య, పౌర్ణమికి  చేపలే చేపలు

పులికాట్‌లో అమాస్యకి, పౌర్ణమికి ఐదు రోజుల ముందు, తరువాత ఆటుపోట్లు ఎక్కుగా ఉంటాయి. ఆ సమయంలో  చేపలు, రొయ్యలు ఎక్కువగా దొరుకుతాయి.  నవంబర్‌ నుండి పిబ్రవరి నెల వరకు మత్చ్య సంపద రెట్టింపు దొరుకుతుంది. సరాసరి రోజుకు ఒక వ్యక్తికి 100 నుండి 1500 రూపాయల వరకు ఈ మత్చ్య సంపద ద్వార ఆదాయం ఉంటుంది.

నోరూరించే చేపల పులుసు

 తింటే మొయ్య పులుసు తినాల

పులికాట్‌ అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది మొయ్య చేప. అరకిలో నుంచి రెండు కిలోల దాకా బరువుంటుంది. ముల్లు తక్కువ, మాంసం ఎక్కువ. కిలో రూ.250లు నుంచి రూ.350లు దాకా పలుకుతుంది. మొయ్య చేపల పులుసు మధురంగా ఉంటుంది. పులుసులో ఉడికిన చేప ముక్కలను వేపుడు కూడా చేస్తారు. పులుపు, కారం పట్టిన చేప ముక్క రుచి అద్భుతంగా ఉంటుంది.   


పులికాట్‌ స్పెషల్‌-ముక్కోలాసులు

సాధారణంగా అక్టోబరులో ఇక్కడ వానలు మొదలవుతాయి. నదుల నుంచి మంచినీరు వచ్చి సరస్సులో కలుస్తుంది. ఈ సమయంలో కొన్ని రకాల చేపలు వృద్ధి అవుతాయి. వాటిలో ప్రత్యేకమైనవి ముక్కోలాసులు. వెండిలా తెల్లగా మెరుస్తూ, గుండ్రంగా రెండు వేళ్ల లావున ఉండే ఈ చేపల ముక్కు జానెడు పొడవుతో కూసుగా ఉంటుంది. డిసెంబరు, జనవరి నెలల్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. ఈ చేపలను పులుసుకన్నా ఎక్కువగా కుర్మాలా చేస్తారు. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. కొరమేను రకం చేపలు కూడా ఇదే సీజన్‌లో దొరుకుతాయి. ఇక జల్ల, ములుగు, ఆల్వార్‌గడ్డ, ముళ్లవర్‌, తెలగా, తుల్లు, కుడువ, మదుకండై, కాలా, కానంగంతలు, అల్లాతీ చేపలు   కూడా సరస్సులో దొరుకుతుంటాయి. దాదాపుగా ఏ చేప ధర కూడా కిలో 350 దాటదు. 


తస్సాదియ్యా... పులికాట్‌ రొయ్య 

 తింటే పులికాట్‌ రొయ్యే తినాలి. ఆ రుచికి కారణం విశాలమైన సరస్సులో సహజంగా పెరగడమే. ఒకవైపు బంగాళాఖాతం నుంచి ఉప్పునీరు సరస్సులోకి వచ్చి కలుస్తుంది. వానా కాలంలో స్వర్ణముఖి, కాళంగి, అరుణ నదులు, పలు కాలువలూ సరస్సులో సంగమిస్తాయి. మంచినీరూ, ఉప్పునీరూ కలిసే ఈ సమయంలో రొయ్యలు వృద్ధిచెందుతాయి. రెండు రకాల నీటి కలయికలో పెరిగిన రొయ్య రుచి చాలా బావుంటుంది. పైగా ఏ రకమైన ఫీడ్‌ వేయరు గనుక ఆరోగ్యపరంగా కూడా ఇవి మంచిది. పెంచిన రొయ్యల్లా నీచువాసన ఉండవు. పులికాట్‌ సరస్సులో   తెల్లరొయ్య, టైగర్‌ (కోటర), వడుంబరా, కదంబరా, పాచీర, తెల్లి, పెరియవెల్లర, గాజు రొయ్య, చిన్న వెల్లర వంటి 15 రకాల రొయ్యలు దొరుకుతాయి. వాటిలో సంక్రా, కోటరా, వెల్లేరు, బూసరా  రకాలు ప్రసిద్ధి. సంక్రా రొయ్యలు డిసెంబరులోనే లభ్యమవుతాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కువసేపు బతికే ఉంటాయి. సంక్రా రకం ధర కిలో 150 నుంచి 200 రూపాయలు ఉంటుంది. కోటర రొయ్యలు 600 నుంచి 700 రూపాయలు పలుకుతాయి. మిగతావి కిలో 300 నుంచి 400 ఉంటాయి. 


పీతల వేపుడు అమోఘం 

పులికాట్‌లో దొరికే పీతలు రుచి కూడా అద్భుతం. చిలకనండు, గట్టినండు అనే రెండు రకాల పీతలు ఎక్కువగా దొరుకుతాయి. గట్టినండు పీతలను కయ్య ఎంట్రకాయలు అని అంటారు. ఇవి ఒక్కోక్కటి అరకేజీ బరువు ఉంటాయి. కిలో. రూ.300లు నుంచి రూ.500లు దాకా పలుకుతాయి. కాల్షియం ఎక్కువగా ఉండే పులికాట్‌ పీతల కోసం జనం ఎగబడతారు.  పులికాట్‌ పీతల వేపుడు రుచి చాలా బావుంటుంది.

Updated Date - 2022-05-22T07:19:04+05:30 IST