మార్చి 7 వరకు ఎగ్జిట్ పోల్స్‌ బ్యాన్: ఈసీ

ABN , First Publish Date - 2022-01-30T14:03:40+05:30 IST

ఇదే ప్రకటనలో పోలింగ్ ప్రక్రియ గురించి ఈసీ కొన్ని సూచనలు చేసింది. ఎన్నికలు జరిగే ఆయా ప్రాంతాల్లో సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణీత సమయానికి మించి మరో అరగంట వరకు పోలింగ్ కొనసాగించవచ్చునని పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగే ఉప ఎన్నికలకు కూడా ఈ సూచనలు వర్తిస్తాయని పేర్కొంది..

మార్చి 7 వరకు ఎగ్జిట్ పోల్స్‌ బ్యాన్: ఈసీ

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ మధ్య ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రానిక్, ప్రింట్‌ మీడియాలతో పాటు మరే ఇతర వేదికలపైనైనా ఈ రెండు తేదీల మధ్య ఎగ్జిట్ పోల్స్ ప్రదర్శన నిషేదించినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈసీ పేర్కొంది. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మార్చి 7వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఈసీ తెలిపింది.


కాగా, ఇదే ప్రకటనలో పోలింగ్ ప్రక్రియ గురించి ఈసీ కొన్ని సూచనలు చేసింది. ఎన్నికలు జరిగే ఆయా ప్రాంతాల్లో సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణీత సమయానికి మించి మరో అరగంట వరకు పోలింగ్ కొనసాగించవచ్చునని పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగే ఉప ఎన్నికలకు కూడా ఈ సూచనలు వర్తిస్తాయని పేర్కొంది. ఇక ఒపీనియన్ పోల్స్‌పై కూడా ఈసీ స్పందించింది. పోలింగ్‌ ప్రారంభమయ్యే 48 గంటల ముందే ఒపీనియన్ పోల్స్‌ను నిలిపివేయాలని పేర్కొంది. ఈసీ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే రెండు నెలల జైలు శిక్ష లేదంటే జరిమానా లేదంటే ఈ రెండూ ఒకేసారి శిక్షగా అనుభవించాల్సి ఉంటుందని ఈసీ పేర్కొంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడు దశల్లో కొనసాగనుంది. ఇక మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27, మార్చి 3 రెండు దశల్లో కొనసాగనుంది. పంజాబ్ ఫిబ్రవరి 20, ఉత్తరాఖండ్, గోవాల్లో ఫిబ్రవరి 14న ఎన్నికల పోలింగ్ జరగనుంది.

Updated Date - 2022-01-30T14:03:40+05:30 IST