Symbol row: ఉద్ధవ్ సమాధానం కోరిన ఈసీఐ

ABN , First Publish Date - 2022-10-08T00:36:36+05:30 IST

శివసేన పార్టీ గుర్తు వ్యవహారంపై తుది నిర్ణయానికి ఈసీఐ కసరత్తు చేస్తోంది. శివసేన గుర్తు తమదంటే తమదని ఇప్పటికే..

Symbol row: ఉద్ధవ్ సమాధానం కోరిన ఈసీఐ

న్యూఢిల్లీ: శివసేన పార్టీ గుర్తు వ్యవహారంపై తుది నిర్ణయానికి ఈసీఐ కసరత్తు చేస్తోంది. శివసేన గుర్తు తమదంటే తమదని ఇప్పటికే ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండే వర్గాలు సుప్రీంకోర్టులో సవాలు చేయడం, నిర్ణయం తీసుకోకుండా ఈసీఐని అడ్డుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తీర్పుచెప్పడంతో ఈసీఐ కసరత్తు  ముమ్మరం చేసింది. తాజాగా శివసేన గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గం క్లెయిమ్ చేయడంతో దీనిపై సమాధానం ఇవ్వాలని ఉద్ధవ్ థాకరే వర్గాన్ని ఈసీఐ శుక్రవారంనాడు ఆదేశించింది. ఈ మేరకు ఒక లేఖ రాసింది. తగిన డాక్యుమెంట్లతో అవసరమైన సమాచారాన్ని శనివారం మధ్యాహ్నం 2 గంటల లోపు తమకు సమర్పించాలని ఉద్ధవ్ థాకరే వర్గానికి ఆ లేఖలో ఈసీఐ తెలియజేసింది. ఉద్ధవ్ వర్గం నుంచి ఎలాంటి సమాచారం అందని పక్షంలో అందుకు అనుగుణంగా తాము తగిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని కూడా ఈసీఐ స్పష్టం చేసింది.


ఈ ఏడాది జూలైలో ఏక్‌నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేయడంతో మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలింది. షిండే వర్గం 39 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ మద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఎమ్మెల్యేలపై పడిన అనర్హత వేటు వ్యవహారం తేల్చాలని సుప్రీంకోర్టును ఉద్ధవ్ థాకరే వర్గం ఆశ్రయించగా, సొంత పార్టీ విశ్వాసం కోల్పోయిన నేతకు ఫిరాయింపుల చట్టం ఎంత ఆయుధం కాబోదని షిండే వర్గం వాదించింది. పార్టీ గుర్తుపై సైతం ఇరువర్గాలు క్లెయిమ్ చేయడంతో, దీనిపై ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఈసీని నిలువరించాలని సుప్రీంకోర్టును థాకరే వర్గం కోరింది. అయితే, ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబర్ 27న తోసిపుచ్చింది. నిజమైన శివసేన ఎవరిదో తేల్చేందుకు ఈసీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

Updated Date - 2022-10-08T00:36:36+05:30 IST