గ్రహణం వీడని ఆర్థికం

ABN , First Publish Date - 2021-03-30T06:06:19+05:30 IST

కరోనా విషక్రిమి తగ్గినట్టే తగ్గి మళ్ళీ భీకరంగా విజృంభిస్తోంది. ఆ మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థకు ఏర్పడిన ముప్పు మరింతగా తీవ్రమవుతోంది....

గ్రహణం వీడని ఆర్థికం

కరోనా విషక్రిమి తగ్గినట్టే తగ్గి మళ్ళీ భీకరంగా విజృంభిస్తోంది. ఆ మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థకు ఏర్పడిన ముప్పు మరింతగా తీవ్రమవుతోంది. శీఘ్ర ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన చక్రీయ ప్రక్రియను పునః ప్రారంభించడం ఎలా అన్నదే ఇప్పుడు మన ముందున్న సవాల్. నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను, లాక్‌డౌన్‌ల మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కుదేలయిపోయాయి. ఉద్యోగ కల్పన, కొత్త ఉద్యోగాల సృష్టిలో హెచ్చు భాగం చిన్న పరిశ్రమల ద్వారానే జరుగుతున్నందున కొవిడ్ విలయంలో వాటికి సంభవించిన నష్టాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం అనివార్యమయింది. కొత్త ఉద్యోగాల సృష్టి జరగడమే లేదు. మన తయారీరంగంలో ఉద్యోగిత అంతకంతకూ తగ్గిపోతోంది. కార్మికుల వేతన భత్యాలను భారీగా తగ్గించారు. మార్కెట్‌లో డిమాండ్ తగ్గిపోయింది. కొత్త మదుపులు చేసేందుకు వ్యాపార సంస్థలు సుముఖంగా లేవు. 


మౌలిక సదుపయాల రంగంలో భారీ పెట్టుబడులతో శీఘ్ర ఆర్థికాభివృద్ధి, కొత్త ఉద్యోగాల సృష్టి చక్రీయ ప్రక్రియను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే హైవేలు, విమానాశ్రయాలు, సరుకుల రైలు మార్గాల నిర్మాణాన్ని చాలవరకు పెట్టుబడి -సాంద్ర యంత్రాలతో చేస్తున్నారు. నేలను యంత్రాలతో తవ్వుతున్నారు. సిమెంట్‌ను సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి కొనుగోలు చేస్తారు. సున్నపు రాళ్ళ గనుల తవ్వకానికి సిమెంట్ ఫ్యాక్టరీలు యంత్రాలను ఉపయోగిస్తాయి. సిమెంట్‌ను భారీ ట్రక్కులలో హై వేల నిర్మాణ ప్రదేశాలకు రవాణా చేస్తారు. ఆటోమెటిక్ యంత్రాల ద్వారా సిమెంట్‌ను పరచడం ద్వారా హై వేల నిర్మాణం జరుగుతుంది. నా అంచనా ప్రకారం హై వేల నిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న వ్యయంలో కేవలం 15 శాతం మాత్రమే శ్రామికుల చేతుల్లోకి వెళుతోంది. మిగతా 85 శాతం బడా బాబుల చేతుల్లోనే ఉంటోంది. ఈ 85 శాతం డబ్బుకు ఆర్థిక వ్యవస్థ అట్టడుగు స్థాయి కార్యకలాపాలతో సంబంధముండదు. ఈ కారణంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు తగ్గిపోతోంది. మౌలిక సదుపాయాల రంగంలో పెడుతున్న పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు పెరుగుదలకు దోహదం చేసేవి కావు. ఒక మురికి వాడ మధ్యలో ఒక షాపింగ్ మాల్‌ను నిర్మించినంత మాత్రాన మురికివాడ వాసుల ఆదాయం పెరగదు కాక పెరగదు. 


మౌలిక సదుపాయాల రంగంలో ప్రభుత్వం ప్రస్తుతం భారీగా చేస్తోన్న మదుపులు ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు తోడ్పడేవి కావనేది స్పష్టం. ఇందుకు పైన ప్రస్తావించిన కారణంతో పాటు మరో కారణం కూడా ఉంది. ట్రక్‌లు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించే పరిస్థితి ఉంటే హై వేల నిర్మాణం ప్రయోజనకరమవుతుంది. మరి గత ఆరు సంవత్సరాలుగా మన ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు తగ్గిపోతోంది. కొత్తగా నిర్మిస్తోన్న మౌలిక సదుపాయాలకు డిమాండ్ అంతగా ఉండడం లేదు. ట్రక్కులు పెద్ద సంఖ్యలో హై వేలపై రాకపోకలు సాగించని పక్షంలో టోల్‌వే సంస్థలు తమ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోలేవు. 2020–-21 ఆర్థిక సంవత్సరంలో టోల్ వసూళ్ళు 2019–-20లో కంటే ఎక్కువగా ఉన్నాయని ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. టోల్ ఫీ పరిధిలో లేని రోడ్లను టోల్ కిందకు తీసుకురావడం వల్లే ఆ వసూళ్ళు పెరిగాయన్నది స్పష్టం. ఈ పెట్టుబడులు దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు విశేష లబ్ధి ని సమకూరుస్తాయనడంలో సందేహం లేదు. అయితే సుప్రసిద్ధ ఆర్థిక వేత్త జాన్ మే నార్డ్ కీన్స్ అన్నట్టు ‘దీర్ఘకాలంలో మనమందరమూ చనిపోతాం ’కదా. దేశ ఆర్థిక వ్యవస్థలో తక్షణమే డిమాండ్‌ను ఇతోధికంగా పెంపొందించడమే నేటి అవసరం. ఇది ఎంత జరూరుగా జరిగితే అంత మంచిది. నిజానికి హై వేల నిర్మాణంలో ఉక్కు, సిమెంట్‌లకు డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ అది శీఘ్ర ఆర్థికాభివృద్ధి, కొత్త ఉద్యోగాల సృష్టి అనే చక్రాన్ని పునః ప్రారంభించదు. ఎందుకని? చాలా తక్కువ మంది కార్మికులు మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు; కొత్త ఉద్యోగాల సృష్టి స్వల్పస్థాయిలో మాత్రమే ఉంది; పెట్టుబడులకు, ఆర్థిక వ్యవవ్థ అట్టడుగు స్థాయి కార్యకలాపాలకు సంబంధముండడం లేదు. మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులను నేను వ్యతిరేకించడం లేదు. ఆ రంగంలో భారీ మదుపులు అత్యవసరమే. ఆటోమెటిక్ యంత్రాల ద్వారా నిర్మిస్తున్న హై వేలలో నిర్దిష్ట పెట్టుబడులను మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను. శ్రమ -సాంద్ర పద్ధతులతో చిన్న పట్టణాలు, పెద్ద గ్రామాలలో రహదారుల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్ట వలసిన అవసరం విశేషంగా ఉంది. 


అంతేకాదు కార్మికులను పెద్ద సంఖ్యలో నియోగించుకునే చిన్న పరిశ్రమలకు అన్ని విధాల మద్దతు సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్త్రాలు, రబ్బర్ చెప్పులు మొదలైన సరుకులను మనం దిగుమతి చేసుకోనవసరం లేదు. అలాంటి సరుకుల దిగుమతులపై సుంకాలను భారీగా పెంచితీరాలి. ఇటువంటి చర్య మన చిన్న పరిశ్రమల మనుగడకు విశేషంగా దోహదం చేస్తుంది. అలాగే వస్త్రాలు, పాదరక్షలు మొదలైన వాటిని ఉత్పత్తి చేసే కార్పొరేట్ కంపెనీల నుంచి వస్తు సేవల పన్నును భారీ స్థాయిలో వసూలు చేయాలి. దీనివల్ల చిన్న పరిశ్రమలు తమ ఉత్పత్తులను మార్కెట్లో సులభంగా విక్రయించుకోగలుగుతాయి. ఇది, మార్కెట్‌లో ఈ సరుకుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఫలితంగా చిన్న పరిశ్రమలు అందుబాటులో ఉంచే సరుకులను కొనుగోలు చేయడం వినియోగదారులకు అనివార్యమవుతుంది. వినియోగదారులపై ఈ అదనపు భారాన్ని ‘ఉద్యోగితా పన్ను’గా భావించవచ్చు. చిన్న పరిశ్రమలకు కల్పించే రక్షణ కొత్త ఉద్యోగాల సృష్టికి దారితీస్తుంది. ఉద్యోగాల పెరుగుదల మార్కెట్‌లో అధిక డిమాండ్‌ను సృష్టిస్తుంది. తీవ్ర అనారోగ్యం నుంచి బయటపడిన వ్యక్తిలో పనిచేయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అతడికి టానిక్ (బలవర్ధక ఔషధం) ఇవ్వవలసివుంటుంది. అదే విధంగా నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను, లాక్‌డౌన్ సమస్యలతో కుదేలయిపోయిన చిన్న పరిశ్రమలకు రక్షణ కల్పించినప్పుడు మాత్రమే అవి పూర్తి స్థాయిలో కోలుకుని దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయి.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-03-30T06:06:19+05:30 IST