విద్యావోచర్లతో ఆర్థికాభ్యుదయం

Nov 30 2021 @ 00:50AM

దేశ ఆర్థికవ్యవస్థ రెండంకెల వృద్ధిరేటును సాధించడంలో ప్రధాన అవరోధం మన విద్యావ్యవస్థే. ప్రజలందరికీ ఉద్యోగాలు లభించి, ఉత్పత్తి కార్యకలాపాలలో భాగస్వాములు అయినప్పుడు మాత్రమే రెండంకెల వృద్ధిరేటుతో మన ఆర్థికవ్యవస్థ పురోగమించగలుగుతుంది. అయితే యంత్రాలు, కంప్యూటర్ల మూలంగా ఉద్యోగాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. మన విద్యారంగాన్ని మౌలికంగా మెరుగుపరచినప్పుడు మాత్రమే యంత్రాలతో పోటీపడగల నైపుణ్యాలను మన కార్మికశ్రేణులు సమకూర్చుకోగలుగుతాయి. ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సర్కారీ పాఠశాల విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలను అమలుపరిచింది. అయినప్పటికీ వార్షిక పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత 72 శాతం కాగా ప్రైవేట్ పాఠశాలల్లో 93 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇతర రాష్ట్రాలలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలలోని పరిస్థితిని విశ్లేషిస్తాను. 


ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2016–17 విద్యాసంవత్సరంలో ప్రతి ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థి చదువుకు సగటున రూ.25,000 ఖర్చు చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ వ్యయం రూ.30,000కి పెరిగి ఉంటుంది. పాఠశాల బాలలకు ప్రభుత్వం వివిధ ఉచిత సదుపాయాలు సమకూరుస్తున్నందున వాటి లబ్ధిని తామే సొంతం చేసుకునేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారు. 


ఈ అవినీతిలో భాగమే నకిలీ అడ్మిషన్లు. బిహార్‌లోని తొమ్మిది జిల్లాలలో ఈ నకిలీ అడ్మిషన్ల సంఖ్య 4.3 లక్షల మేరకు ఉన్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడయింది. నకిలీ విద్యార్థులకు సంబంధించిన అంచనాలు అందుబాటులో లేవు. అయితే వారు 20 శాతం మేరకు ఉన్నారని భావిద్దాం. వీరిని లెక్కలోకి తీసుకోకపోతే ప్రభుత్వం నిజ విద్యార్థులకు తలసరిన రూ.37,000 ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులపైనే ఖర్చు చేస్తోంది. 2014లో ప్రభుత్వ పాఠశాలల్లో 64 శాతం మంది బాలలు విద్యాభ్యాసం చేస్తున్నారని ‘జాతీయ నమూనా సర్వే సంస్థ’ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. ఇప్పుడు అంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 55శాతం మేరకు ఉండవచ్చు. తల్లిదండ్రుల ఆదాయం పెరిగినందున వారు తమ పిల్లలను ప్రైవేట్ విద్యాలయాల్లోనే చేర్పించేందుకు సహజంగానే మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న మొత్తం విద్యార్థులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తలసరిన రూ.20,000 ఖర్చు చేస్తుంది. ఇందుకు వెచ్చిస్తున్న మొత్తంలో సగాన్ని రాష్ట్రంలోని విద్యార్థులు అందరికీ పంపిణీ చేయవచ్చు. ఈ ప్రకారం ప్రతి విద్యార్థికీ రూ.10,000 చొప్పున విద్యా వోచర్ రూపేణా పంపిణీ చేయవచ్చు. విద్యావోచర్‌తో ప్రతి విద్యార్థి తాను ఎంపిక చేసుకున్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలో విద్యాభ్యాసం చేయవచ్చు. ఇందుకు ప్రతి ఒక్కరూ నెలకు రూ.800 ఫీజును ఎటువంటి సమస్య లేకుండా చెల్లించగలుగుతారు. 2014లో ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు చెల్లిస్తున్న సగటు ఫీజు రూ. 417 మేరకు ఉంటుందని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేలో వెల్లడయింది. ఈ సగటు మొత్తం ప్రస్తు విద్యా సంవత్సరంలో రూ.700గా ఉండగలదు. ఈ మొత్తాన్ని విద్యావోచర్‌తో ఎటువంటి సమస్య లేకుండా చెల్లించడం సాధ్యపడుతుంది.


విద్యావోచర్ల విధానంలో విద్యార్థులను అత్యధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షించాలంటే ఉపాధ్యాయులు తమ బోధనా సామర్థ్యంలో, ఇతర విధ్యుక్తధర్మాల నిర్వహణలో ప్రైవేట్ విద్యాసంస్థలలో పని చేసే ఉపాధ్యాయులతో పోటీపడవలసి ఉంటుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు తగ్గిపోయిన తమ వేతన భత్యాలను, విద్యార్థులను అత్యధిక సంఖ్యలో తమ విద్యాలయాలలో చేరేలా ఆకట్టుకోవడం ద్వారా, మరల పెంపొందించుకునేందుకు అవకాశముంది. విద్యావోచర్లను ఎంత ఎక్కువ సంఖ్యలో సేకరించుకోగలిగితే అంత ఎక్కువగా వేతనభత్యాలను పొందే అవకాశముంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ ప్రస్తుత వేతనభత్యాలు యథావిధిగా కొనసాగాలంటే, వారు తమ బోధనా ప్రమాణాలను మెరుగుపరచుకోవలసిన అవసరముంది. ఉత్తమ ఉపాధ్యాయులుగా తమను తాము రుజువు చేసుకుంటే తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పక ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తారు. ప్రైవేట్ పాఠశాలలు సైతం విద్యావోచర్ల నుంచి ఫీజులో కొంత భాగాన్ని వసూలు చేసుకోవడం ద్వారా విశేషంగా లబ్ధి పొందగలుగుతాయి. ఫీజుల రూపేణా లభించే రాబడి పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని మరింత మెరుగైన విద్యను అందించేందుకు ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రయోజనాల దృష్ట్యా విద్యావోచర్ల విధానాన్ని తక్షణమే అమలుపరిచేందుకు ప్రభుత్వాలు పూనుకోవాలి. ఇది జరిగినప్పుడు మాత్రమే మన ఆర్థికవ్యవస్థ సర్వతోముఖంగా శీఘ్రగతిని అభివృద్ధి చెందుతుంది. 

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.