మరో అనిశ్చితికి సిద్ధం కావాల్సిందే..!

ABN , First Publish Date - 2021-04-19T05:52:04+05:30 IST

దేశంలో కొనసాగుతున్న కరోనా రెండో విడత ఉధృతి నేపథ్యంలో వినియోగదారులు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ విషయంలో మరో ‘‘పెద్ద అనిశ్చితి’’కి సిద్ధం కావాల్సిందేనని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ హెచ్చరించారు...

మరో అనిశ్చితికి సిద్ధం కావాల్సిందే..!

  • కరోనాను ఓడించే దశలో అనూహ్యంగా దాడి
  • నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ హెచ్చరిక
  • అవసరమైతే ఆర్థికపరమైన చర్యలు 

న్యూఢిల్లీ: దేశంలో కొనసాగుతున్న కరోనా రెండో విడత ఉధృతి నేపథ్యంలో వినియోగదారులు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ విషయంలో మరో ‘‘పెద్ద అనిశ్చితి’’కి సిద్ధం కావాల్సిందేనని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ హెచ్చరించారు. పరిస్థితి గతంలో కన్నా సంక్లిష్టంగా మారిందన్నారు. అయినప్పటికీ ఈ ఏడాది భారత వృద్ధి రేటు 11 శాతం ఉండగలదన్న ఆశాభావం ఆయన ప్రకటించారు. వివిధ సంస్థల అంచనాలు కూడా ఇదే విషయం చెబుతున్నాయన్నారు. అలాగే భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కూడా 10.5 శాతం వృద్ధి రేటును అంచనా వేసిందని తెలిపారు. భారత్‌.. కొవిడ్‌-19ని ఓడించే దశలో ఉన్న దశలో యూకే సహా ఇతర దేశాల నుంచి వచ్చిన కొత్త వైరస్‌ వేరియెంట్లు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయని ఆయన చెప్పారు.

‘ఆర్థికం’పై పరోక్ష ప్రభావం: సేవల రంగం ప్రత్యక్షంగా ప్రభావితం కావడంతో పాటు ఇతర ఆర్థిక కార్యకలాపాలపై పరోక్ష ప్రభావం చూపవచ్చని రాజీవ్‌ కుమార్‌ అన్నారు. ఈ పరిస్థితిలో కొత్త ఉద్దీపనకు ఆస్కారం ఉన్నదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ తాజా పరిస్థితికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలను విశ్లేషించిన అనంతరం ఆర్థిక మంత్రిత్వ శాఖ దానికి సమాధానం చెబుతుందని ఆయన స్పష్టం చేశారు. మనం ప్రస్తుత పరిస్థితుల్లో విధానపరమైన చర్యలు కొనసాగించనున్నట్టు ఆర్‌బీఐ ఇప్పటికే ప్రకటించిందని, అవసరం ఏర్పడినప్పుడు ప్రభుత్వం కూడా ఆర్థికపరమైన చర్యలను ప్రకటిస్తుందని కుమార్‌ అన్నారు.



రికవరీకి విఘాతమే

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి కారణంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రమాదంలో పడిందని హెచ్చరిస్తూ పలు సంస్థలు రేటింగ్‌ను కుదిస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను నోమురా 12.6 శాతానికి (గతంలో 13.5 శాతం), జేపీ మోర్గాన్‌ 11 శాతానికి (13 శాతం), యూబీఎస్‌ 10 శాతానికి (11.5 శాతం), సిటీ గ్రూప్‌ 12 శాతానికి కుదించాయి. వాస్తవానికి కరోనా ప్రవేశించడం కన్నా ముందే జీడీపీ క్షీణత ప్రారంభమై కొవిడ్‌-19 దెబ్బతో మైనస్‌ 8 శాతానికి తగ్గే పరిస్థితికి చేరింది. ఇప్పుడు కరోనా అత్యంత తీవ్ర స్థాయికి చేరిందని, రోజువారీ కేసుల సంఖ్య తగ్గిస్తున్న ప్రయత్నాలు ఫలించినట్టయితే వృద్ధి రేటు తిరిగి పుంజుకునే అవకాశం ఉన్నదని యూబీఎస్‌ తెలిపింది. రాష్ర్టాల వారీగా ప్రస్తుతం విధించిన ఆంక్షలు మే చివరి వరకు కొనసాగవచ్చంటూ జూన్‌ చివరి నాటికి ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరవచ్చని అంచనా వేసింది. 


Updated Date - 2021-04-19T05:52:04+05:30 IST