పునర్నవంగా ఆర్థిక సంస్కరణలు

ABN , First Publish Date - 2022-05-21T05:41:52+05:30 IST

ఆర్థిక విధానం మార్పుపై తొలి సూచన వెలువడి అప్పుడే 31 సంవత్సరాలు గడిచిపోయాయా? నమ్మలేకున్నాను సుమా! 1991 జూలై 1న రూపాయి విలువను తగ్గిస్తున్నట్టు ప్రకటించాం.

పునర్నవంగా ఆర్థిక సంస్కరణలు

ఆర్థిక విధానం మార్పుపై తొలి సూచన వెలువడి అప్పుడే 31 సంవత్సరాలు గడిచిపోయాయా? నమ్మలేకున్నాను సుమా! 1991 జూలై 1న రూపాయి విలువను తగ్గిస్తున్నట్టు ప్రకటించాం. అదొక ఆకస్మిక చర్య. ప్రతిపక్షాలు తీవ్రంగా నిరసించాయి. పార్లమెంటు దద్దరిల్లిపోయింది. తరువాయి చర్యను నిలిపివేయాలని పీవీ నరసింహారావు సూచించారు. ప్రధానమంత్రి సూచనను పాటిస్తున్నట్టుగా డాక్టర్ మన్మోహన్ సింగ్ వ్యవహరించారు. రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ‘అందుబాటులో లేరు’. కేవలం 48 గంటలలోనే రూపాయి విలువను మరింతగా తగ్గిస్తున్నట్టు మళ్లీ ప్రకటించాం! అది రెండడుగుల నృత్యం. చాలా పకడ్బందీగా దాన్ని రూపొందించాం. మహానేర్పుతో దాన్ని నిర్వహించాం. తదనంతర పరిణామాలేమిటి? ఒక మాటలో వాటిని సంక్షేపించవచ్చు : అపూర్వ సాహసం. రెండోసారి రూపాయి విలువ తగ్గింపు నిర్ణయాన్ని ప్రకటించిన వెన్వెంటనే వరుసగా వాణిజ్య విధాన సంస్కరణలను, కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాం. నవ పథ నిర్దేశక బడ్జెట్‌నూ ప్రవేశపెట్టామని మరి చెప్పాలా? ఇదేమా అని ప్రపంచం తన చూపులను మనపై సారించింది. ఆ చూపులు మనపైనే కేంద్రీకృతమయ్యాయి. పీవీ ప్రభుత్వ సాహసం, స్పష్టత, వేగం అందరినీ అబ్బురపరిచింది. ఆర్థిక విజయాల బాటలో భారత్ కొత్త ప్రస్థానం ప్రారంభమయింది.


మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ నేతృత్వంలోని ఆర్థికసరళీకృత విధానాలను ప్రవేశపెట్టిన తరువాత భారతదేశం అన్ని రంగాలలోనూ ఇతోధికంగా పురోగమించింది. సంపద సృష్టి, కొత్త వాణిజ్యాలు, నూతన అధునాతన పరిశ్రమలు, సంపద్వంతమైన మధ్యతరగతి, లక్షలాది కొత్త ఉద్యోగాలు, ఎగుమతులు... 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. నిజమే, ఇంకా అనేక కోట్ల మంది కటిక పేదరికంలో కునారిల్లుతున్నారు. ఆకలి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 116 దేశాలలో మన దేశం 101వ స్థానంలో ఉంది. పోషకాహారం అందరికీ లభ్యమవుతుందా? ఈ ప్రశ్నకు, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 చాలా నిరుత్సాహకరమైన సమాధానాన్ని ఇచ్చింది. విద్యాభారతం వెలిగిపోతుందా? లేదు లేదు. నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతోంది. నియతకాలికంగా ద్రవ్యోల్బణం తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఆదాయం, సంపదలో అసమానతలు పెరిగిపోతున్నాయి. జెండర్ అసమానతల గురించి మరి చెప్పేదేముంది? ప్రాంతీయ అసమానతలూ పెరిగిపోతున్నాయి. రాజ్యాంగం హమీ ఇచ్చిన సమాన అవకాశాలు లభించనివారు అసంఖ్యాకంగా ఉన్నారు.


అయినా మనం స్వేచ్ఛా వాణిజ్య, సరళీకృత ఆర్థిక విధానాలు, మార్కెట్–ఆధారిత ఆర్థికాభివృద్ధి మార్గాన్ని వీడలేము. అలా చేయడం ఆత్మహత్యాసదృశమే అవుతుంది. ప్రపంచ, దేశీయ పరిణామాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని మన ఆర్థిక విధానాలను సరికొత్తగా అమలుపరచుకోవాలి. ఇది జరగాలంటే 1991 నాటి సాహసం, స్పష్టత, శీఘ్రత ఎంతైనా అవసరం. ప్రపంచ పరిణామాలను పరిశీలిద్దాం. ధనిక దేశాలు మరింత సంపన్నమయ్యాయి. చైనా, భారత్‌ల మధ్య అంతరాలే ఇందుకొక ఉదాహరణ. 2022లో చైనా జీడీపీ 16.7 ట్రిలియన్ డాలర్లు కాగా భారత్ జీడీపీ 3 ట్రిలియన్ డాలర్లు మాత్రమే. మానవ జీవితంలోని ప్రతి అంశాన్నీ డిజిటల్ టెక్నాలజీ ఆక్రమించింది. డేటా కొత్త సంపదగా ప్రభవిస్తోంది. ఆటోమేషన్, రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్, కృత్రిమ మేధ ప్రపంచాన్ని ఏలనున్నాయి. మానవుల పాత్రను పునర్ నిర్వచించనున్నాయి. 5జి, ఇంటర్నెట్ 3.0, బ్లాక్ చెయిన్, మెటావెర్స్ కొత్త ప్రపంచంలో స్పేసెస్‌ను నిర్వచిస్తాయి. వాతావరణ మార్పుల పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. వాటి నుంచి కాపాడుకునేందుకు మానవాళి బ్రహ్మప్రయత్నమే చేయాల్సి ఉంది.


దేశీయ పరిణామాలను చూద్దాం. మొత్తం కాన్పుల రేటు 2.0కి తగ్గిపోయింది. 15 ఏళ్ల వయసులోపు జనాభా శాతం 2015–16లో 28.6 నుంచి 2019–21లో 26.5 శాతానికి తగ్గిపోయింది. మనకు జనాభా లబ్ధి ప్రయోజనాలు ముగిసినట్టేనని చెప్పవచ్చు. సగటు రైతు గతంలో కంటే ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నాడు. అయినప్పటికీ అతడి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడమే లేదు. పట్టణీకరణ వేగంగా పెరిగిపోతోంది. పట్టణ నిరుద్యోగమూ అంతకంటే వేగంగా పెరిగిపోతోంది. డిజిటైజేషన్ విస్తరిస్తోంది. దాంతో పాటే పేదలు, మధ్యతరగతి/ సంపన్నుల మధ్య డిజిటల్ వ్యత్యాసాలూ ఇతోధికమవుతున్నాయి. ప్రజా చర్చలపై మెజారిటీ వాదం ప్రభావం పెరిగిపోతోంది. విభజన, విద్వేష రాజకీయాలు పెచ్చరిల్లుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పురోగతిని ఈ పరిణామాలు ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. దేశ జనాభాలో 20 శాతంగా ఉన్నవారిని రాజకీయాలు, ఆర్థిక కార్యకలాపాల నుంచి మినహాయించి ఏ దేశమైనా కించిత్ అభివృద్ధి సాధించగలదా?


గత కొద్ది సంత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థలో మనం చూస్తున్నదేమిటి? ఉద్యోగ రహిత అభివృద్ధి, లేదంటే ఉద్యోగాలను నష్టపరుస్తున్న అభివృద్ధి మాత్రమే కాదూ? ఇది ఇంకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదు, కాకూడదు. ‘ఉద్యోగాలే’ పునాదిగా మన అభివృద్ధి నిర్మాణం జరగాలి. ఉద్యోగాల సృష్టి నుంచి మాత్రమే ప్రతిదీ పురోగమన పథంలో ముందుకుసాగుతుంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని నరేంద్ర మోదీ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చాక పకోడీలు అమ్మడం కూడా ఒక ఉద్యోగం కాదా అని వాదిస్తున్నారు! మోదీ ప్రభుత్వంపై ప్రజలు త్రినేత్రం తెరవడం ప్రారంభించారు. హిందుత్వ భావోద్వేగాలతో ప్రజాగ్రహాన్ని మోదీ ప్రభుత్వం ప్రస్తుతానికి తప్పించుకోవచ్చుగానీ అది ఇంక ఎంతోకాలం సాగదు. విభజన, విద్వేష రాజకీయాలు ఉద్యోగాలను ఎలా తీసుకురాగలుగుతాయి? ఏ మతస్థుడికైనా ముందు ఉద్యోగం, ఉపాధి ముఖ్యం. ఈ వాస్తవాన్ని మన పాలకులు విస్మరించకూడదు.


ఈ చర్చ అనివార్యంగా మనలను కేంద్ర–రాష్ట్ర సంబంధాల వద్దకు తీసుకువెళుతుంది. ఎందుకంటే ఇప్పుడవి సజావుగా, సహేతుకరీతిలో లేవు. సమతుల్యత అంతకంతకూ తగ్గిపోతోంది. ఇంతకు ముందెన్నడూ కేంద్ర–రాష్ట్ర సంబంధాలు ప్రస్తుతమున్నంత బలహీనంగా లేవు. రాష్ట్రాల సొంత ఆర్థిక వనరులు తగ్గి పోతున్నాయి. జీఎస్టీ వ్యవస్థపై అసంతృప్తి ప్రబలిపోతోంది. ఆ కొత్త పన్నుల విధానాన్ని అమలుపరుస్తున్న తీరు చాలా లోపభూయిష్టంగా ఉంది. ఫలితంగా కేంద్రం, రాష్ట్రాల మధ్య పరస్పర నమ్మకం అనేది పూర్తిగా లేకుండా పోయింది. రాష్ట్రాల ఆర్థికాధికారాలనే కాదు, శాసన నిర్మాణాధికారాలనూ కేంద్రం దురాక్రమించుకుంటోంది. కేంద్రం తన కార్యనిర్వాహక, ఆర్థికాధికారాలను వినియోగించి రాష్ట్రాలు తనకు లోబడిపోయేలా చేస్తోంది. మోదీ ప్రభుత్వ విధానాలేకాదు, అది ఎంచుకున్న పాలనా మార్గం కూడా అంతిమంగా ఈ దేశ సమాఖ్య పాలనా పద్ధతి వినాశనానికే దారితీయనున్నది.


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-05-21T05:41:52+05:30 IST