అశాంతి అంచున ఆర్థికం!

ABN , First Publish Date - 2022-03-08T06:18:30+05:30 IST

ప్రస్తుతం మనం ‘జనాభా లాభం’ (డెమోగ్రాఫిక్ డివిడెండ్- ఒక దేశంలో పని చేసే వయసున్న జనాభా పెరగడం వల్ల జరిగే ఆర్థిక వృద్ధి) ప్రయోజనాలను పొందుతున్నాం....

అశాంతి అంచున ఆర్థికం!

ప్రస్తుతం మనం ‘జనాభా లాభం’ (డెమోగ్రాఫిక్ డివిడెండ్- ఒక దేశంలో పని చేసే వయసున్న జనాభా పెరగడం వల్ల జరిగే ఆర్థిక వృద్ధి) ప్రయోజనాలను పొందుతున్నాం. ఆహారోత్పత్తిలో సమృద్ధి, వైద్య విజ్ఞాన శాస్త్రాలలో పురోగతి ఫలితంగా ప్రజల సగటు జీవిత కాలం గణనీయంగా పెరిగింది. తత్ఫలితంగా 12 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల వారు ఏటా భారీ సంఖ్యలో కార్మిక విపణిలోకి ప్రవేశిస్తున్నారు. స్థూల దేశియోత్పత్తి (జీడీపీ)లో 1 శాతం పెరుగుదల ఉద్యోగితలో 0.2 శాతం పెరుగుదలకు దారి తీస్తుందని అపీ జే స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అధ్యయనం ఒకటి అంచనా వేసింది. ప్రపంచ స్థాయిలో జీడీపీ 1 శాతం పెరుగుదల ఉద్యోగాల సృష్టిలో 0.3 శాతం పెరుగుదలకు దారి తీస్తుందని మరో అధ్యయనం నిర్ధారించింది. మనం శీఘ్రగతిన 10 శాతం వృద్ధి రేటును సాధించినప్పటికీ ఉద్యోగితలో పెరుగుదల కేవలం 2 శాతం మాత్రమే ఉంటుంది. కార్మిక విపణిలోకి ప్రవేశిస్తున్న యువజనులు అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించడం ఈ పరిమిత అభివృద్ధితో అసాధ్యం. 


2022–23 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌లో మూలధన వ్యయాలను గణనీయంగా పెంచారు. ఇవి సంపూర్ణంగా స్వాగతించాల్సిన కేటాయింపులు. అయితే మన యువజనులకు అవసరమైన ఉద్యోగాలు అన్నిటినీ సృష్టించడానికి ఈ సానుకూల చర్య దోహదం చేయదు. ఈ పరిస్థితులలో కొత్త ఉద్యోగాలను సమృద్ధిగా సృష్టించేందుకు నిర్దిష్ట చర్యలు చేపట్టవలసివుంది. వస్తూత్పత్తి, మేధోరంగ ఉద్యోగాల నిర్వహణకు రోబో, కృత్రిమ మేధ సాంకేతికతల వినియోగం అంతకంతకూ ఇతోధికమవుతున్నప్పటికీ మన యువజనులకు అధునాతన ఉద్యోగ నైపుణ్యాలను సంపూర్ణ స్థాయిలో సమకూర్చాలి. ఉదాహరణకు విద్యాబోధన విషయంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య పరస్పర ప్రత్యక్ష సంబంధాలు తప్పనిసరి. అలాగే ఆరోగ్యభద్రత విషయంలో రోగులు, డాక్టర్ల మధ్య కూడా అటువంటిది అనివార్యం. పర్యాటకరంగం విలసిల్లాలంటే హోటళ్ల నిర్వాహకులు, పర్యాటకుల మధ్య పరస్పర ప్రత్యక్ష సంబంధాలకు అమిత ప్రాధాన్యముంది. రోబోలు, కృత్రిమమేధ మూలంగా విద్యా, వైద్య, పర్యాటక రంగాలలో సంప్రదాయ ఉద్యోగాలు అంతరించిపోయే ప్రమాదం లేదు. సమస్యేమిటంటే సదరు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చుకునేందుకు చాలా ప్రయత్నం చేయవలసి ఉంది. అయితే మన యువజనులు ప్రభుత్వోద్యోగాలు పొందేందుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు! కారణమేమిటి? ప్రభుత్వోద్యోగాలు పొందినవారు మంచి సంపాదనపరులు కావడాన్ని వారు గమనిస్తున్నారు. ప్రభుత్వేతర ఉద్యోగాలలోని వారికి ఆదాయం అంతగా లేకపోవడమనేది కూడా వారిని ప్రభుత్వోద్యోగాల వైపే మొగ్గు చూపేలా చేస్తోంది. ఈ కారణంగా విద్యా, ఆరోగ్య భద్రతా, పర్యాటక రంగాల ఉద్యోగాలకు సంబంధించిన నైపుణ్యాలను సంతరించుకునేందుకు వారు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు.


ఉత్పత్తి కార్యకలాపాలలో కార్మికులను భారీ సంఖ్యలో నియమించుకునేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం. ఇది ప్రభుత్వం చేపట్టవలసిన రెండో చర్య. ఒక నిర్దిష్ట పనిని కార్మికులచేత చేయించుకోవాలో లేక యంత్రాలచేత చేయించుకోవాలో పారిశ్రామికవేత్తలు నిర్ణయించుకోవల్సివుంది. ఉదాహరణకు సరుకుల రవాణా ట్రక్కులను లోడ్ చేయడమనేది యంత్రాలతో చేయించాలా లేక కార్మికులతో చేయించడమా? అనే విషయాన్ని తీసుకుందాం. సమర్థంగా, త్వరితగతిన పని పూర్తిచేసే కార్మికులు, అందునా తక్కువ కూలీకి లభ్యమైతే వారితో చేయించుకోవడం లాభదాయకమని పారిశ్రామికవేత్తలు భావిస్తారు. అయితే మన దేశంలో సంఘటిత కార్మికులకు కార్మిక చట్టాలు అనేక రక్షణలు కల్పిస్తున్నాయి. దీంతో వారిని సమర్థంగా పని చేయించుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరో సమస్య కూడా ఉంది. కార్మిక సంఘాలు ఉత్పత్తి ప్రక్రియలకు తీవ్ర అవరోధాలు సృష్టిస్తున్నాయి. ఈ కారణంగా పారిశ్రామికవేత్తలు కార్మికుల కంటే యంత్రాలనే ఎక్కువగా ఉపయోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. మార్గాంతరమేమిటి? కార్మిక చట్టాలను సరళీకరించడమే. ఒక యజమాని నిర్భయంగా గణనీయమైన సంఖ్యలో కార్మికులను నియమించుకోగల పరిస్థితిని కల్పించడం. అప్పుడు మాత్రమే పారిశ్రామికవేత్తలు మరిన్ని ఉద్యోగాలను సృష్టించగలుగుతారు.


యంత్రాలను తక్కువగాను, కార్మికులను ఎక్కువగాను ఉపయోగించుకునే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరింతగా పన్ను మినహాయింపు కల్పించాలి. ఇది ప్రభుత్వం చేపట్టవలసిన మూడో చర్య. ఇక్కడ సమస్యేమిటంటే వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థలో అన్ని పరిశ్రమలకు ఒకే పన్ను రేటు ఉండడం. చిన్న పరిశ్రమలు పెద్ద పరిశ్రమలతో పోటీ పడలేవు. చిన్న పరిశ్రమల మార్కెట్లు అన్నీ అంతకంతకూ కార్పొరేట్ కంపెనీలకు బదిలీ అవుతున్నాయి. మరి ఉత్పత్తి కార్యకలాపాలలో రోబోలు, స్వయం చాలక యంత్రాలు, కృత్రిమ మేధను ఉపయోగించుకునేవి కార్పొరేట్ కంపెనీలే కాదూ? దీనివల్ల ఉద్యోగాల సృష్టిలో పెరుగుదల అసాధ్యమవుతుంది. తత్కారణంగానే మన స్థూల దేశియోత్పత్తిలో 1 శాతం పెరుగుదల ఉద్యోగితలో 0.2 శాతం పెరుగుదలకు మాత్రమే కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వృద్ధి (0.3 శాతం) మన దేశంలో కంటే అధికంగా ఉందనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని చిన్న పరిశ్రమలకు, పెద్ద పరిశ్రమలకు రెండు వేర్వేరు జీఎస్టీ రేట్లను ప్రవేశపెట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కెనడా, అమెరికాలలో అనేక జీఎస్టీ రేట్లు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ వివిధ వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా రవాణా చేయడం సాధ్యమవుతుంది. చిన్న పరిశ్రమలకు పన్ను రేటును తక్కువ స్థాయిలో నిర్ణయిస్తే అపుడు అవి పెద్ద పరిశ్రమలతో సమర్థంగా పోటీపడగలుగుతాయి. మరిన్ని ఉద్యోగాలను సృష్టించగలుగుతాయి. 


మూలధన వ్యయాలను గణనీయంగా పెంచి 10 శాతం వృద్ధిరేటును సాధించినప్పటికీ, ఉద్యోగాల సృష్టిలో పెరుగుదల 2 శాతానికి మించి ఉండదు. ఇది, కొత్తగా కార్మిక విపణిలోకి ప్రవేశిస్తున్న మన యువజనుల ఉద్యోగ అవసరాలను ఏమాత్రం తీర్చలేదు. కనుక ఉద్యోగాలను సమృద్ధంగా సృష్టించేందుకు మనం ప్రత్యేక ప్రయత్నాలు చేయవలసిన అవసరముంది. ఇది జరగని పక్షంలో నిరుద్యోగం మరింతగా పెచ్చరిల్లిపోతుంది. అది సమాజంలో అంతులేని అశాంతికి దారితీస్తుంది.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2022-03-08T06:18:30+05:30 IST