చిక్కుల్లో సంజయ్ రౌత్..ఆస్తులు జప్తు చేసిన ఈడీ

ABN , First Publish Date - 2022-04-05T22:08:01+05:30 IST

వసేన ఎంపీ సంజయ్ రౌత్ చిక్కుల్లో పడ్డారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద రౌత్..

చిక్కుల్లో సంజయ్ రౌత్..ఆస్తులు జప్తు చేసిన ఈడీ

ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చిక్కుల్లో పడ్డారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో అలీబాగ్‌లో రూ.9 కోట్లు విలువచేసే ఎనిమిది ల్యాండ్ పార్సెల్స్ (ప్లాట్లు), ముంబైలోన దాదర్ శివార్లలో ఉన్న రూ.2 కోట్లు విలువచేసే ఒక ఫ్లాట్ ఉన్నాయి. పీఎంఎల్ఏ కింద ఈ ప్లాట్లు, ఫ్లాట్ జప్తు చేస్తూ ప్రొవిజనల్ ఆటాచ్‌మెంట్‌ను ఈడీ జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ముంబైలోని ఓ భారీ రెసిడిన్షియల్ బిల్డింగ్ రీ-డవలప్‌మెంట్‌కు సంబంధించి రూ.1,034 కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్‌లో మనీ ల్యాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ జప్తు జరిగినట్టు చెబుతున్నారు.


కాల్పులు జరిపినా, జైలుకు పంపినా భయపడేదే లేదు: రౌత్

పీఎంఎల్ఏ కేసులో కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన ఆస్తులు జప్తు చేయడంపై సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. ''నా ఆస్తులు జప్తు చేయండి, కాల్పులు జరపండి, జైలుకు పంపండి, ఏమాత్రం భయపడేది లేదు. సంజయ్ రౌత్ అనే వ్యక్తి బాలాసాహెబ్ థాకరే అనుచరుడు, శివసైనికుడు. అతను పోరాడతాడు, ప్రతి ఒక్కరి వ్యవహారం బయటపెడతాడు. చూస్తూ కూర్చునే రకం కాదు. వాళ్లను డాన్స్ చేయనీయండి. నిజం వెలుగుచూస్తుంది'' అని రౌత్ అన్నారు.


కాగా, ఈ కేసులో మహారాష్ట్ర వ్యాపారి ప్రవీణ్ రౌత్‌ను గత ఫిబ్రవరిలో ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఛార్జిషీటు కూడా నమోదు చేసింది. పీఎంసీ బ్యాంక్ మోసం కేసుకు సంబంధించిన మరో మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది. ప్రవీణ్ రౌత్ భార్య మాధురితో వర్షా రౌత్‌కు సంబంధాలున్నాయనే అనుమానంతో ఈడీ ఆమెను ప్రశ్నించింది.

Updated Date - 2022-04-05T22:08:01+05:30 IST