అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఈడీ ఛార్జిషీట్

ABN , First Publish Date - 2021-12-29T23:34:59+05:30 IST

మనీలాండరింగ్, అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఈడీ ఛార్జిషీట్

ముంబై: మనీలాండరింగ్, అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ కంప్లయింట్ (ఛార్జిషీటు)ను నమోదు చేసింది. 7,000 పేజీల ఛార్జిషీటును మనీ లాండరింగ్ నిరోధక ప్రత్యేక కోర్టు (పీఎంఎల్ఏ)కు సమర్పించింది. ఛార్జిషీటులో అనిల్ దేశ్‌ముఖ్ ఇద్దరి కుమారుల పేర్లను కూడా ఈడీ చేర్చింది.


మనీలాండరింగ్ కేసులో 12 గంటల సేపు ప్రశ్నించిన దర్యాప్తు సంస్థ గత నవంబర్ 1న ఆయనను అరెస్టు చేసింది. నవంబర్ 6 వరకూ ఈడీ కస్టడీలో ఉన్న ఆయన ప్రస్తుతం ఆర్ధర్ రోడ్డు  జైలులో ఉన్నారు. దేశ్‌ముఖ్ కుంటుంబం ఢిల్లీ కేంద్రంగా 27 డమ్మీ కంపెనీల కార్యకలాపాలను నిర్వహించేదని, ఆ సొమ్మును డొనేషన్ రూపంలో రూ.4.18 కోట్ల వరకూ దేశ్‌ముఖ్ సొంత ట్రస్ట్ 'సాయి శిక్షణ్ సంస్థ'కు మళ్లించిందని ఈడీ అభియోగం. అనిల్  దేశ్‌ముఖ్ తమ నుంచి డబ్బులు వసూలు చేసేవారని, వసూళ్ల కోసం పోలీసు అధికారి సచిన్ వాజేను ఉపయోగించుకునే వారని బార్ ఓనర్లు, మేనేజర్లు ఇచ్చిన స్టేట్‌మెంట్లును కూడా ఈడీ ఉదహరించింది. ఈ కేసులో సస్పెండ్ అయిన సచిన్ వాజే ప్రస్తుతం తలోజి సెంట్రల్ జైలులో ఉన్నారు. వసూళ్ల కోసం దేశ్‌ముఖ్ తనకు నేరుగా ఆదేశాలిచ్చినట్టు వాజే ఇప్పటికే స్టేట్‌మెంట్ ఇచ్చారు. బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.3 లక్షకు చొప్పున వసూలు చేయాలని దేశ్‌ముఖ్ ఆదేశాలిచ్చారని, ఆ ప్రకారం డిసెంబర్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకూ వసూలు చేసిన రూ.4.70 కోట్లను దేశ్‌ముఖ్ తరఫున ఆయన పర్సనల్ అసిస్టెంట్ కుందన్ షిండేకు ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. దీనిపై షిండే, దేశ్‌ముఖ్‌లపై 2021 ఆగస్టు 23న ఈడీ ఒక ఛార్జిషీటు దాఖలు చేసింది. దీనికి ముందు, హైకోర్టు ఆదేశాల మేరకు దేశ్‌ముఖ్‌ వ్యవహారంపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు జరిపింది. ఆ వెంటనే ఈడీ రంగంలోకి దిగి దేశ్‌ముఖ్‌పై ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. 2021 ఏప్రిల్ 2న దేశ్‌ముఖ్‌పై ఐపీసీలోని సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 (లంచం తీసుకోవడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Updated Date - 2021-12-29T23:34:59+05:30 IST