ఏకనాయకత్వంపై పైచేయి ఎవరిదో?

Published: Mon, 20 Jun 2022 11:20:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏకనాయకత్వంపై పైచేయి ఎవరిదో?

 అన్నాడీఎంకే నేతల మధ్య కుదరని సయోధ్య

 అధ్యక్ష పదవి వైపే ఎడప్పాడి మొగ్గు


చెన్నై: ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. పార్టీ నేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం మధ్య రాజీ కుదిర్చేందుకు పార్టీ సీనియర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఏకనాయకత్వంపై ఏర్పడిన విబేధాలు ఏమాత్రం తొలగిపోలేదు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పార్టీ సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి అధ్యక్షపదవి కోసంపావులు కదుపుతున్నట్లు తెలియడంతో పన్నీర్‌సెల్వం వర్గం దిగ్ర్భాంతి చెందుతోంది. అదే సమయంలో ఆదివారం తమిళ దినపత్రికల్లో ఓపీఎస్‌ విశ్వాసుల పేరుతో వెలువడిన రెండు పేజీల ప్రకటన ఎడప్పాడి వర్గానికి ఆగ్రహం తెప్పించింది. మొదటి పేజీలో పన్నీర్‌సెల్వం సాధించిన విజయాలు, మాజీ ముఖ్యమంత్రి జయలలితతో సన్నిహిత సంబంధాలు గురించిన విశేషాలుండగా, రెండోపేజీలో శాసనసభ ఎన్నికల నుంచి, స్థానిక సంస్థల ఎన్నికల వరకూ పార్టీ ఓటమికి ఎడప్పాడి తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమంటూ విమర్శలున్నాయి.


ఈ నేపథ్యంలో గత ఆరురోజులుగా పట్టువిడుపు లేకుండా సాగుతున్న రాజీ ప్రయత్నాలు ఇక ఏ మాత్రం ఫలించవని రెండు వర్గాలూ భావిస్తున్నాయి. ఈ క్రమం లో ఈ నెల 23న సర్వసభ్య మండలి సమావేశం సజావుగా సాగుతుందో లేదో అనే అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. ఆదివారం ఉదయం నుంచి గ్రీన్‌వే్‌స రోడ్డులోని అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి నివాసాలు వద్ద పార్టీ సీనియర్‌నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. అదే సమయంలో వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు మాజీ మంత్రి సెంగోటయ్యన్‌, మాజీ ఎంపీ తంబిదురై తీవ్రంగా ప్రయత్నించారు. శుక్రవారం రాత్రి సేలం నుంచి నగరానికి చేరుకున్న ఎడప్పాడి పళనిస్వామి తన నివాసానికి చేరువలోనే ఉన్న పన్నీర్‌సెల్వంను కలుసుకోకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగించింది.

పార్టీలో ఎప్పటిమాదిరిగానే ద్వంద్వ నాయకత్వమే కొనసాగాలని పన్నీర్‌సెల్వం ప్రకటించినా, ఎడప్పాడి దానికి స్పందించకుండా తన మద్దతుదారులతో నిర్విరామంగా రహస్య మంతనాలు చేయడంలోనే తలమునకలయ్యా రు. మాజీ మంత్రులు వేలుమణి, తంగమణి, ఎంసీ సంపత్‌, ఉదయకుమార్‌, శాసనసభ్యుడు నత్తం విశ్వనాధన్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గయ్యన్‌ ఎడప్పాడిని కలుసుకుని చర్చలు జరిపారు. ఆ సందర్భంగా ఏకనాయకత్వం తప్పనిసరని ఆ దిశగానే తాను చర్యలు చేపడతానని ఎడప్పాడి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక పన్నీర్‌సెల్వం నివాసం వద్ద పార్టీ కార్యకర్తల సందడి అధికంగా ఉంటోంది. పార్టీ సీనియర్‌ నేతలు వైద్యలింగం, వెల్లమండలి నటరాజన్‌, మైత్రేయేన్‌ తదితరులు మాత్రమే ఆయన నివాసంలో చర్చలు జరిపారు.


ఎడప్పాడి కొత్త ప్రతిపాదన..

పార్టీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా ఎడప్పాడి పళనిస్వామి ఓ ప్రతిపాదనను తన మద్దతుదారుల ద్వారా పార్టీ సమన్వయకర్త పన్నీర్‌సెల్వంకు పంపించారు. ఆ మేరకు పన్నీర్‌సెల్వం ఎప్పటిలాగే పార్టీ సమన్వయకర్తగా కొనసాగుతారని, అదే సమయంలో ప్రిసీడియం చైర్మన్‌ పదవిని తొలగించి పార్టీ అధ్యక్షపదవి తాను స్వీకరిస్తానని ఎడప్పాడి ప్రతిపాదించారు. మాజీ మంత్రి సెల్లూర్‌ కే రాజు, మాజీ ఎంపీ తంబిదురై ఈ విషయాన్ని పన్నీర్‌సెల్వంకు తెలిపి ప్రతిపాదన అంగీకరించాలంటూ ఒత్తిడి చేశారు. దాని పట్ల పన్నీర్‌సెల్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ పార్టీలో అధ్యక్షుడు ఉండకూడదని, దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నాదురైని పార్టీ అధ్యక్షుడిగానే భావించాలంటూ పార్టీ నియమావళిలో స్పష్టంగా పేర్కొన్నారని, జయలలిత కూడా అదే బాటలో ప్రధాన కార్యదర్శిగానే కొనసాగారే తప్ప అధ్యక్షురాలి పదవి చేపట్టలేదని పన్నీర్‌సెల్వం తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎడప్పాడిని పార్టీ అధ్యక్షుడిగా అంగీకరించే ప్రసక్తేలేదని పన్నీర్‌సెల్వం స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

ప్రత్యేక తీర్మానం...

ఇదిలా ఉండగా ఈ నెల 23న జరుగనున్న సర్వసభ్యమండలి సమావేశం లో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేసి ఏకనాయకత్వానికి మద్దతుగా ప్రత్యేక తీర్మానం చేయాలని ఎడప్పాడి నిర్ణయించినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి పార్టీ సమన్వయకర్త పన్నీర్‌సెల్వం అంగీకారం గానీ, సంతకం గానీ అవసరం లేదని ఎడప్పాడి మద్దతు దారులు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆదివారం   ఎడప్పాడిని కలుసుకున్న మాజీమంత్రి ఓఎస్‌ మణియన్‌ కూడా స్పష్టం చేశారు. పార్టీకి ప్రస్తుతం ఏకనాయకత్వం తప్పనిసరి అని, ఈ విషయమై సర్వసభ్యమండలిలో నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు. దీనిపై ఎడప్పాడి నివాసం బయట మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది ఇన్బదురై మీడియాతో మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌, జయలలిత హాయంలో ఏకనాయకత్వంపై సర్వసభ్యమండలి సమావేశాల్లో అప్పటికప్పుడు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారని, ఆ బాటలోనే ప్రస్తుతం ఏకనాయకత్వంపై మండలిలో తీర్మానం చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవని వివరించారు.


ఎడప్పాడికి తేని జిల్లా నేతల మద్దతు..

పార్టీ సమన్వయకర్త పన్నీర్‌సెల్వం సొంత జిల్లా తేనికి చెందిన పలువురు నేతలు ఆదివారం ఉదయం ఎడప్పాడిని కలుసుకుని మద్దతు ప్రకటించి పార్టీకి ఏకనాయకత్వం అవసరమని ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జగ్గయ్యన్‌ మాట్లాడుతూ తేని జిల్లాకు చెందిన పార్టీ సభ్యులంతా ఎడప్పాడికి గట్టి మద్దతునిస్తున్నారని తెలిపారు. ఎడప్పాడి పార్టీ అధ్యక్షపదవి స్వీకరించాలని కూడా కోరుకుంటున్నారన్నారు. ఇక మాజీ మంత్రి శివపతి కూడా ఏకనాయకత్వానికి పన్నీర్‌సెల్వం మద్దతివ్వాల్సిందేనని తెలిపారు. పార్టీ యువజన విభాగం కూడా ఎడప్పాడికి మద్దతిస్తున్నారని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఏకనాయకత్వ వివాదం తలెత్తినప్పటి నుంచి ఇప్పటివరకూ పార్టీ ఉపసమన్వయకర్త ఎడప్పాడికే మాజీ మంత్రులు, సీనియర్‌ నేతలు, జిల్లా కార్యదర్శుల్లో తొంభైశాతం వరకూ మద్దతిస్తున్నారు. ఆదివారం ఎడప్పాడిని మాజీ మంత్రులు వేలుమణి, తంగమణి, నత్తవిశ్వనాధన్‌, కేపీ మునుసామి, కామరాజ్‌, సీవీ షణ్ముగం, ఉదయకుమార్‌, ఓఎస్‌ మణియన్‌, ఎంసీ సంపత్‌, శివపతి కలుసుకున్నారు. పార్టీలో ఉన్న 75 జిల్లా కార్యదర్శుల్లో 64 మంది ఎడప్పాడికే మద్దతు ప్రకటిస్తుండటంతో సర్వసభ్యమండలిలో ఆయన తన సత్తాను నిరూపించుకుంటారని తెలుస్తోంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.