హామీలు నెరవేర్చని Dmk

ABN , First Publish Date - 2022-06-18T15:29:24+05:30 IST

రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని, పైగా ముందు తమ పార్టీ ప్రభుత్వం

హామీలు నెరవేర్చని Dmk

                               - ఎడప్పాడి విమర్శ


చెన్నై, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని, పైగా ముందు తమ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు కొత్త పేర్లు పెట్టి అమలు చేస్తోందని ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణిలో శుక్రవారం ఉదయం జరిగిన పద్మావతి సమేత వెంకటేశ్వరాలయ కుంభాభిషేక వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వందరోజుల ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామని డీఎంకే ప్రకటించిన హామీ కార్యరూపం దాల్చలేదన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలోనే రైతు రుణాల మాఫీ జరిగిందని, అదంతా తామే చేసినట్లు డీఎంకే పాలకులు గొప్పలు చెప్పుకొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వైద్య  కోర్సుల్లో 7.5 శాతం రిజర్వేషన్లు కల్పించింది కూడా అన్నాడీఎంకే ప్రభుత్వమేనని చెప్పారు. విద్యార్థులందరి విద్యారుణాలను మాఫీ చేయనున్నట్లు డీఎంకే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, ఆ హామీ గురించి ఇప్పటివరకూ పట్టించుకోలేదని ఆరోపించారు. వృద్ధులకు ఇచ్చే పింఛనును కూడా క్రమంగా తగ్గిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-06-18T15:29:24+05:30 IST