Advertisement

ఏది వచన కావ్యం?

Jan 25 2021 @ 00:52AM

ఇపుడు వచన కావ్యంగా మనం చెప్పుకుంటున్నదానికి, దాదాపు నాలుగు వందల ఏళ్ల కిందట వచ్చిన వచన కావ్యాలకి ఏ సంబంధమూ లేదు. కుదురులోనే చాలా తేడాలు ఉన్నాయి. అనేక ప్రాచీన వచన గ్రంథాలను కలగలిపి చూసే అలవాటుని వదిలి కొద్ది భేదాలతోనైనా సొంత ఉనికితో నిలబడిన ‘ప్రాచీన వచన కావ్యాల’ వంటి ప్రక్రియల స్వతంత్రతని గుర్తించాల్సి ఉంది.


ప్రపంచంలోని ఏ భాషా సాహిత్యాల్లోనయినా సాధారణంగా పద్యం, గద్యం అని రెండు రూపాలు ఉంటాయి. ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రలో పురాణేతిహాసాలు, మహా కావ్యం, ప్రబంధం వంటి పద్యరూప రచనలే ఆధిపత్య స్థానాల్లో నిలిచాయి. 


ఈ రచనలు రాయడం, చదవడం, వినడం-- కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం అయింది. ఏ కాలంలోనయినా ఒక చట్రం ఉన్నతమైనదిగా గుర్తించబడి, తర్వాతి కాలాల్లోనూ కొనసాగుతూ ఉందంటే, దానికి దిగువన రెండవ శ్రేణిగా విస్మరించబడిన రచనలు కొద్దో గొప్పో ఉండి తీరతాయి. అవి నిరాదరించబడిన వర్గాలలో కొందరి కళాతృష్ణనయినా తనివి తీర్చి ఉంటాయి. ప్రాచీన సాహిత్యంలోని గద్య రచనలు ఇటువంటి కోవకి చెందుతాయి. ముఖ్యంగా ‘భారత సావిత్రి’ లాంటి వచన కావ్యాలు - విని, వల్లె వేసుకునేవారి కోసం రాసినట్లుగా కొన్ని చారిత్రిక ఆధారాలు కూడా ఉన్నాయి. అవి అప్పటి పాఠక సమూహం పట్ల మన నిలవ ఆలోచనలని కదిలిస్తాయి.


తెలుగులో గద్యం అనేక పాయలుగా విస్తరించి ఉంది. శాసనాల్లో ఉండేది తొలిదశ వచనం. పద్య గద్య మిశ్రితమైనవి చంపూ కావ్యాలు. పాల్కురుకి సోమనాధుని పంచగద్యలు దేవుడికి చేసే స్తోత్రాల వంటివి. బిరుదగద్యలు రాజాస్థానాలను ఆశ్రయించి, వచన రూపంలో చేసే భట్రాజు పొగడ్తలు. సింహగిరి నరహరి వచనములు, శఠకోప విన్నపములు వంటివి, కథతో నిమిత్తం లేని విడి విడి స్తోత్రాలు. ఇవి వచన శతకాల వంటివి. స్తుతి వచనాలు - ఇష్ట దైవ సంబోధనతో మొదలయ్యి, నమోవాకంతో అంతమవుతాయి, ఇవి శతక లక్షణాలని పోలి ఉంటాయి. చిన్నచిన్న కథలతో కూడినవి - వచన కథారచనలు. దినచర్యని తెలిపే వచనాలు, కొద్దిపాటి కథనంతో నడిచే యాత్రా చరిత్రలు, కావ్య సంబంధం లేని ఇతర అంశాలతో కూడిన వచన గ్రంథాలు మరికొన్ని ఉన్నాయి. వచనైక రచనల్లో భాగంగా ‘వచన కావ్యం’ అనే ప్రక్రియ కూడా ఉంది. దాని ప్రత్యేక లక్షణాలను గుర్తించి విడిగా నిర్వచనం ఇచ్చుకోవాలి.


ఆధునిక సాహిత్యంలో ‘వచన కావ్యం’ అనగానే సాధారణంగా, ‘నగరంలో వాన’, ‘తెలంగాణ’, ‘నా దేశం నా ప్రజలు’, ‘ఆసుపత్రి గీతం’ లాంటి రచనలు గుర్తుకు వస్తాయి. వచన కవిత, దీర్ఘ కవిత, దీర్ఘ కథా కావ్యం, వచన కావ్యం కొద్ది తేడాలతో ఇవన్నీ ‘కవిత్వ’ నిర్మాణ పరిధిలోకి వస్తాయి. వచన కవిత్వం అనేది అప్పటివరకూ ఉన్న పద్య కవిత్వానికి కొనసాగింపు రూపం తప్ప గద్యానికి కాదని చేకూరి రామారావులాంటి భాషా సాహిత్యకారులు చెప్పారు. కథ, నవల, వ్యాసం, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర వంటి ప్రక్రియలకి నిర్దిష్టమైన లక్షణాలు కనపడతాయి. కానీ ‘వచనం -- కవిత్వం, వచనం -- కావ్యం’ కలగలిసిన రచనలకి ప్రాచీన కాలం నుంచీ సూటిగా నిరూపించగలిగిన లక్షణాలు లేవు (చంపూ కావ్యాలు కొంత మినహాయింపు). అట్లాంటి అనిర్దిష్టమైన ప్రక్రియల్లో ‘వచన కావ్యం’ ఒకటి. ఇపుడు వచన కావ్యంగా మనం చెప్పుకుంటున్నదానికి, దాదాపు నాలుగు వందల ఏళ్ల కిందట వచ్చిన వచన కావ్యాలకి ఏ సంబంధమూ లేదు. కుదురులోనే చాలా తేడాలు ఉన్నాయి. 


మాత్రాఛందస్సుతో ఉన్న పద్య కావ్య రచనలను, వచన కావ్య రచనలను కూడా కొందరు వచన కావ్యాలుగానే చెప్పారు. హరిభట్టు వరాహ పురాణంలో ‘‘నవ రసాలంకార బంధురంబుగా నొక్క ప్రబంధంబాంధ్ర భాషా భవ్యంబగు వచన కావ్యంబుగా రచింప బూనిన సమయంబున నారసింహ పురాణోత్తర భాగమప్పుడాంధ్ర భాషను వచన కావ్యంబొనర్చె’’ అని చెప్పాడు. లోకేరావు సోమన అనే కవి కూడా ‘శివరాత్రి మాహాత్మ్యం’ అనే పద్య ప్రబంధాన్ని, వచన కావ్యం అన్నాడు. 1911లో చెన్నపురిలో ఒక గ్రామ్య దేశ నిరసన సభకి అధ్యక్షత వహించిన కందుకూరి వీరేశలింగం పంతులు వచనకావ్యాల గురించి మాట్లాడుతూ ‘‘సుమారు నలువది సంవత్సరముల క్రిందట తెలుగులో గద్యకావ్యములు లేకుండెను. అపుడు చిన్నయసూరి తన వ్యాకరణం రచించి, యందుకు లక్ష్యముగా నీతిచంద్రిక వచనముగా వ్రాసెను. దీని శైలి మిక్కిలి కఠినము. మొట్టమొదట నేనునూ చిన్నయసూరి గారి త్రోవనే త్రొక్కి కొన్ని గద్యకావ్యములు రచియించితిని’’ అన్నారు. అప్పటికి దాదాపు మూడు వందల ఏళ్ళకి పూర్వమే అనేక గద్య రచనలు ఉన్నాయి. అవి వీరేశలింగం దృష్టికి చేరకపోయే ఆస్కారం లేదు, ఎందుకంటే ఆంధ్ర కవుల చరిత్ర రాసే క్రమంలో పూర్వ సాహిత్యం మీద విస్తృత పరిశోధన చేసారు. అయితే పైన చెప్పిన గద్యకావ్యాలను ఆయన నిర్దిష్ట అర్థంలో వాడి ఉండొచ్చు. తన నవలను ‘గద్య ప్రబంధం’ అని అన్నారు. ప్రాచీన ఆధునిక సంధిదశలో జన సామాన్యంలోకి గద్యం/వచనం చొచ్చుకుని రావడాన్ని అర్థం చేసుకోవడానికి, ఏవి వచన రచనలు అన్నది నిర్ధారించుకోవడానికి అప్పటికి ఉన్న ప్రమాణాలు వీరేశలింగానికి చాలకపోయి ఉండొచ్చు. 


అనేక వచన రచనా భేదాల్లోనుంచి ‘వచన కావ్య’ లక్షణాలను వేరు చేసి ఈ నిర్వచనం ఇచ్చుకోవచ్చు. ‘‘పౌరాణిక, చారిత్రిక, క్షేత్రమాహాత్మ్య ఇతివృత్తాలతో కూడి, కొంత కాల్పనికత చేరి, కథాగమనంలో చెప్పుకోదగిన స్థాయిలో వస్తైక్యం ఉండి, గ్రాంథిక/సరళ గ్రాంథిక వచనంలో ఉన్న రచనలను స్థూలంగా వచన కావ్యాలు’’ అనొచ్చు. ఈ నిర్వచనానికి, ఇపుడు ఉనికిలో ఉన్న ఆధునిక వచన కావ్యాలకి ఏ మాత్రం పోలిక లేదు. రెండు భిన్నమైన ప్రక్రియలు ఒకే పేరుతో చెలామణీ కావడం విశేషం.


నన్నయకి పూర్వకాలం నుంచీ వచనం వాడుకలో ఉందని శాసనాలు నిరూపిస్తే, కృష్ణ దేవరాయల కాలంలో లేఖకులు వీధుల్లో కూర్చుని రోజు వారీ పరిణామాలను వచనంలో అక్షరబద్ధం చేసేవారని భారతదేశాన్ని సందర్శించిన విదేశీ చరిత్రకారులు రుజువు చేసారు. ఏకామ్రనాథుని ‘ప్రతాప చరిత్రము’, విశ్వనాథ నాయకుని స్థానాపతి ‘రాయవాచకం’, సముఖం వేంకట కృష్ణప్ప నాయకుని ‘సారంగధర చరిత్ర’, ఎల్లకర నృసింహకవి ‘భారత సావిత్రి’, కళువె వీర్రాజు ‘భారత సంగ్రహం’, కుందుర్తి వేంకటాచల కవి ‘పట్టుగొడుగుల వచనం’ ఆర్‌.సి. మిషన్‌ వారి ‘క్రైస్తవ పురాణ కథాసంక్షేపం’, విజయరంగ చొక్కనాథ నాయకుని ‘శ్రీరంగ మాహాత్మ్యం’, లింగనమఖి కామేశ్వరకవి ‘ధేను మాహాత్మ్యం’ వంటి వచన కావ్యాలు వందకి పైగా ఉన్నట్లు వచన వాఙ్మయ వికాస పరిశోధనలను బట్టి తెలుస్తుంది. చరిత్రలో నమోదు కానివి ఇంకా మరికొన్ని ఉండొచ్చు. 


అప్పటికాలంలో వచన కావ్యాలకి ఉన్న కొద్దిపాటి ఆదరణని కూడా కొన్ని గ్రంథాలు నమోదు చేసాయి. అందులో ప్రాచీన చరిత్ర వచన గ్రంథమైన ‘కాకతీయ రాజ వంశావళి’ ఒకటి. ఇందులోని 62వ పేజీలో-- ‘‘కృష్ణాచార్యులు తన మనంబున వాసుదేవు నారాధించి ఒక వచనం రచియించిన మెచ్చి, యేకశిలా నగరంబున గనకవృష్టి గురియుటయు, యిది గని ప్రతాపరుద్రుండును, ఆ పరిజనంబులున్నూ కృష్ణమాచార్యులం బూజించిన వారిని వీడ్కొని కృష్ణమాచార్యులు శ్రీరంగంబున కరిగె’’ అని ఉన్నది. ఒక్క వచన రచనకే దేవుడు కనక వర్షం కురిపించాడని చెప్పడాన్నిబట్టి ఈ రచనలకి సాహిత్య గౌరవం దొరికిందని అర్థమవుతుంది. 17వ శతాబ్ది నాటికి ఆంధ్రేతర ప్రాంతాల్లో నివసించే తెలుగువారికి వచన కావ్యాలు ఇష్టమయ్యాయి. మాతృభాషా ప్రాంతంలో కాక వేరే భాషాప్రాంతంలో ఉండడం వలన ప్రౌఢశైలిలో ఉండే ప్రబంధాల కన్నా సరళంగా ఉండే వచన కావ్యాలంటే ప్రజలకి ఆసక్తి పెరిగింది. మధుర, తంజావూరు, మైసూరు రాజ్యాలను పాలించినవారు కూడా వచన రచనలకి ప్రోత్సాహం ఇచ్చారు. తమిళ, కన్నడ భాషా ప్రాంతాలకి వలస వెళ్ళిన ఆంధ్రులకు సులభశైలిలో పద్య కావ్యాలు, వచన కావ్యాలు అందుబాటులోకి రావడం వల్ల కూడా వారు తమ మాతృభాషా మూలాలను గుర్తు పెట్టుకోగలిగారు.


వచన కావ్యాల్లోని వచనపు తోవలు, ఆయా రచయితలు వాడిన పలుకుబళ్ళు, నుడికారాలు, శైలీవిన్యాసాలు, ఆసక్తికరంగా ఉంటాయి. ‘వేప చెట్టునకు పాలు పోసి చక్కెర ఎరువు వేసి పెంచినను చేదు గాక మాధుర్యము గలుగ నేర్చునా!’, ‘పుడిసెడు నీళ్ళు చల్లిన యడగిపోయెడి ధూళికి కాలమేఘము వర్షింప వలెనే?’ వంటి వాక్యాలు ఆయా కాలాల ప్రజల లాజిక్‌కి సృజన తోడయితే ఎలా ఉంటుందో నిరూపిస్తాయి. వచన కావ్యాల్లో ఒకచోట వచనం ‘‘కాల రుద్ర ఢక్కా ఢమాఢమాత్కారంబుల ధిక్కరించు వాద్యఘోషములు’’ అంటూ పరుగుపెడుతుంది. మరో చోట పార్వతీదేవి పరమేశ్వరునితో పరిహాసం ఆడుతూ-- ‘‘మీకు అత్యంత వికారంబులైన యంగంబులం గనుపట్టు భృంగి పరమ భృత్యుండు, పిశాచంబులు సఖులు, మంచంబుకోడు కైదువు, ఇంటింట బిచ్చంబె కూడు, పునుకలే పేరు హారంబు, ముదియెద్దు పడి వాగె తేజి. ఇన్ని మంగళంబులు గల మీకు సంగర జయంబబ్బుట కేమి యాశ్చర్యంబు?’’ అంటుంది. జన వ్యావహారమైన హాస్య కళకి వచన కావ్యగౌరవాన్ని కల్పించే సందర్భంలో వ్యావహారిక భాషనే కాకుండా వ్యావహారిక ఉచ్చారణా శైలి, పదాల ఎంపిక, పోహళింపు అన్నీ స్థానీయమైన సొగసుని కలిగి ఉన్నాయి. అనేక ప్రాచీన వచన గ్రంథాలను కలగలిపి చూసే అలవాటుని వదిలి కొద్ది భేదాలతోనైనా సొంత ఉనికితో నిలబడిన ‘ప్రాచీన వచన కావ్యాల’ వంటి ప్రక్రియల స్వతంత్రతని గుర్తించాల్సి ఉంది.

కె.ఎన్‌.మల్లీశ్వరి 

[email protected]


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.