ఆణిముత్యం లాంటి నిర్మాత ఏడిద

Apr 23 2021 @ 21:03PM

శంకరాభరణం, సాగరసంగమం, స్వయంకృషి, స్వాతిముత్యం, సితార, సీతాకోకచిలుక వంటి కళాత్మక చిత్రాలను అందించారు పూర్ణోదయా మూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. శనివారం ఆయన 87వ జయంతి. ఈ సందర్భంగా జ్ఞాపకాలు కొన్ని... 

కాలేజీ రోజుల్లో నాటక అనుభవం ఉన్నందున ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కారు. అక్కడ ఆయనకు నిరాశే మిగిలింది. చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ, నానా కష్టాలూ పడుతూ బతుకు కొనసాగించారు. 1976 లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో 'సిరి సిరి మువ్వ' చిత్రానికి నిర్వాహణ బాధ్యతలు అందుకొని విజయం సాధించారు . ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా 'తాయారమ్మ బంగారయ్య' చిత్రాన్ని నిర్మించారు. అది కూడా విజయం సాధించడంతో కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో ఆయన నిర్మించిన శంకరాభరణం తెలుగు చిత్ర ఖ్యాతని ఖండాంతరాలకు తీసుకు వెళ్లింది. ఈ చిత్రానికి జాతీయ - అంతర్జాతీయ - రాష్త్ర అవార్డులు ఏ చిత్రానికీ రాలేదంటే , అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్ట మొదటి చిత్రమిది. 


ఆ తర్వాత వచ్చిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కధా చిత్రాలకు సీతాకోకచిలుక చిత్రం ఓ స్ఫూర్తి. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఏడిద నిర్మించిన సాగర సంగమం చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్టై పలు అవార్డులుతో పాటు రివార్డులు సొంతం చేసుకుంది.  ఏడిద నుంచి వచ్చిన  చిత్రం మరో క్లాసిక్ - సితార. ఆయన దగ్గర పనిచేసిన వంశీ దర్శకత్వంలో సుమన్, భానుప్రియ జంటగా వచ్చిన ఈ సినిమాకు కూడా జాతీయ అవార్డుల్లో పెద్ద చోటే దక్కింది. ఇక స్వాతిముత్యం - కే.విశ్వనాథ్‌, కమలహాసన్ రాధికల కలయికలో వచ్చిన ఓ ఆణిముత్యం. 1986లో విడులైన ఈ చిత్రం అప్పటి బాక్సాఫీస్‌ రికార్డ్‌లను బద్దలుకొట్టింది. జాతీయ అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం బంగారు నంది పొందిన ఈ చిత్రం ప్రతిషాత్మక ఆస్కార్ అవార్డుకు భారత దేశం తరపున ఎన్నుకోబడిన మొట్ట మొదటి తెలుగు చిత్రం . 


మెగాస్టార్ చిరంజీవితో ఏ కమర్షియల్ చిత్రమో తియ్యకుండా, చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రతో సినిమా తియ్యడం పెద్ద సాహసమే. అది విజయవంతం చేసి అందరి మన్ననలూ పొందారు ఏడిద.  ఈ చిత్రంతో చిరంజీవికి మొట్ట మొదటి సారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు దక్కించింది. ఇక ఆయన రెండో కుమారుడు శ్రీరాం హీరోగా చేసిన 'స్వరకల్పన' ఆశించనంతగా ఆడలేదు. మళ్ళీ విశ్వనాధ్ - చిరంజీవిలతో తీసిన చిత్రం ఆపద్భాంధవుడు. చిరంజీవి నట విశ్వరూపానికి ఓ మంచి ఉదాహరణ ఈ సినిమా. ఇన్ని గొప్ప చిత్రాలు నిర్మించడానికి సాహసించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావుకి ప్రభుత్వం తరపున సరైన గుర్తింపు లభించలేదు అంటే సినీ అభిమానులకు చాలా నిరాశే. పద్మ అవార్డుల్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ రఘుపతి వెంకయ్య అవార్డుకి కానీ ఆయన అన్నివిధాలా అర్హులే. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.