ఊరు దాటేదెలా?

ABN , First Publish Date - 2021-11-07T05:25:20+05:30 IST

ఊరు దాటేదెలా?

ఊరు దాటేదెలా?
కృష్ణానదిపై ఏర్పాటుచేసిన తాత్కాలిక తాటి వంతెనను దాటి బడికి వెళ్తున్న విద్యార్థులు

ఎడ్లంక గ్రామస్తుల అష్టకష్టాలు

ఇసుక, బుసక అక్రమ తవ్వకాలతో అవస్థలు

కొట్టుకుపోయిన కాజ్‌వే

దారిలేక తాటి వంతెన నిర్మించుకుని ప్రమాదకర ప్రయాణం

అటువైపు చూడని అధికారులు

పట్టించుకోని ప్రజాప్రతినిధులు


ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన చిన్నారులు అక్కడ అష్టకష్టంగా అడుగులేస్తుంటారు. బతుకుదెరువు కోసం పక్క ప్రాంతాలకు వెళ్లాల్సిన యువకులు సైకిళ్లు భుజాన మోసుకుని భయంభయంగా కదులుతుంటారు. ఆరోగ్యం బాగాలేని వారు, బాలింతలు, నిండుచూలాళ్లకైతే ప్రత్యక్ష నరకమే. దీనికి కారణం ఆ గ్రామానికి వెళ్లే కాజ్‌వే కొట్టుపోవటం వల్ల ఏర్పాటు చేసుకున్న తాటి పట్టెల వంతెనే అని చెబుతున్నా... అమాయక జనం             ఆ మాటలు నమ్మేసినా.. దాని వెనుక ఉన్న అధికారుల నిర్లక్ష్యాన్ని మాత్రం ఎవరూ పెదవి విప్పరు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి అధికారపక్ష ప్రాపకం కోసం చేయించిన పర్యావరణ విధ్వంసంపై నోరెత్తి మాట్లాడరు. మూడేళ్లుగా కన్నీటితో నిండిపోయిన అవనిగడ్డ మండలంలోని ఎడ్లంక గ్రామంలో శనివారం ‘ఆంధ్రజ్యోతి’ బృందం పర్యటించింది. స్థానికుల కష్టాలను కళ్లారా చూసింది. 

అవనిగడ్డ టౌన్‌, నవంబరు 6 : వైసీపీ అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి ఇసుక విధానంపై స్పష్టత లేకపోవటంతో అవనిగడ్డ మండలంలోని ఎడ్లంకలోని కృష్ణానది రేవు నుంచి ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున ప్రారంభమైంది. గతంలో గ్రామంలోని ఓ పది, పదిహేను మంది తమ ఎడ్లబళ్లతో అక్కడకక్కడ తవ్వి ఇసుక తరలిస్తే, అనంతరం అభివృద్ధి కార్యక్రమాల కోసమంటూ పెద్ద ఎత్తున ఇసుక, బుసక తవ్వకాలకు అధికారులే అనుమతులిచ్చి అనధికారికంగా తరలించారు. ఈ ప్రాంతం సీఆర్‌జెడ్‌ పరిధిలో ఉందని, పర్యావరణ సమతుల్యతకు ఏమాత్రం విఘాతం కలిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని గ్రామస్తులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. ఇళ్ల స్థలాల మెరక కోసమంటూ, రైతు భరోసా కేంద్రాలకంటూ అనుమతులిచ్చి ఇసుకను తరలించారు. 

ఉనికి కోల్పోతున్న గ్రామాలు

ఇలా ఇసుక, బుసక అక్రమంగా తవ్వేయడం వల్ల ఎడ్లంక గ్రామం దాదాపు ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. గత ఏడాది వచ్చిన వరదల కారణంగా సినీ నటుడు శర్వానంద్‌ కుటుంబానికి చెందిన ఇల్లు మొత్తం నదిలో కొట్టుకుపోయింది. ఆ ఇల్లు కృష్ణానదికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉండగా, ఎడ్లంక దీవిలో పడిన కోత కారణంగానే చాలా ఇళ్లు నదిలో కలిసిపోయాయి. కృష్ణానదిపై కాజ్‌వే కొట్టుకుపోవడంతో గ్రామస్తులు తాటిపట్టెల వంతెన నిర్మించుకుని రోజూ ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఈ విధ్వంసం కేవలం ఒక్క ఎడ్లంకకు మాత్రమే కాకుండా అవనిగడ్డ, నాగాయలంక మండలాల పరిధిలోని నదీతీర గ్రామాలపైనా పడుతోంది. వేకనూరు, తుంగలవారిపాలెం పరిధిలోని నదీగర్భంలోని పలు లంకలు కోతకు గురికావటంతో పాటు నది దాదాపు కరకట్ట వరకు కోసుకొచ్చింది. నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం దగ్గర దాదాపు ఒడ్డునే 15 అడుగుల లోతు పడిపోగా, ఎదురుమొండి దీవుల్లోని బ్రహ్మయ్యగారి మూల - జింకపాలెం గ్రామాల నడుమ నది కోత తీవ్రమై రహదారిని కూడా కబళించే పరిస్థితి ఏర్పడింది. అధికారులే ఇలా యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తూ ఇసుక, బుసుక అక్రమ రవాణాదారులకు కొమ్ముకాయటం కారణంగా తమకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అవనిగడ్డలో జరిగిన  సమావేశంలో సాక్షాత్తూ కలెక్టరే.. ఇసుక, బుసక కావాలంటే నదిలో నుంచి తవ్వుకోనివ్వాలని, అఽధికారులు అడ్డు చెప్పొద్దన్నారంటే అధికార యంత్రాంగానికి పర్యావరణ చట్టాలపై ఎంత బాధ్యత ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. 

అంకుల్‌.. బడికి ఎలా పోవాలె..

అంకుల్‌... బడికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. బడి సమయానికి పోటు వచ్చిందంటే ఈ తాటిపట్టెల పైనుంచి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే కాజ్‌ వే నిర్మిస్తే బాగుంటుందంటూ పలువురు పాఠశాల విద్యార్థులు తమ గోడును ‘ఆంధ్రజ్యోతి’ ఎదుట వెళ్లబోసుకోగా, కళాశాల విద్యార్థులు మాత్రం అధికారులు, ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. తెలంగాణలోని ఓ ప్రాంతంలో బడికి వెళ్లేందుకు సౌకర్యంగా లేదని ఓ బాలిక రాష్ట్రపతికి లేఖ రాస్తే మారుమూల గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాయని, మూడేళ్లుగా తాము నదిని దాటేందుకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పర్యావరణ చట్టాలను గౌరవించి ఇసుక, బుసుక అక్రమ తవ్వకాలను ఆపివేయాలని, వెంటనే తమ గ్రామానికి కాజ్‌వే నిర్మించాలని కోరుతున్నారు. 



Updated Date - 2021-11-07T05:25:20+05:30 IST