రెండో విడతపైనే.. ఆశలు

ABN , First Publish Date - 2021-01-17T05:33:05+05:30 IST

ఎంసెట్‌ రెండో విడత ఈ నెల 21 నుంచి 23 వరకు కౌన్సెలింగ్‌ జరగనుంది.

రెండో విడతపైనే.. ఆశలు

భర్తీ కావల్సిన ఇంజనీరింగ్‌ సీట్లు 5 వేలపైనే  

అర్హత సాధించిన వారికోసం యాజమాన్యాల జల్లెడ

ఈ నెల 21 నుంచి 23 తేదీల్లో ఎంసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ 

75 శాతం సీట్లు భర్తీ అయ్యేలా యాజమాన్యాల ప్రణాళికలు


కరోనా ఇతర కారణాలతో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో జాప్యంతో అనేక కళాశాలల్లో భారీగా సీట్లు మిగిలిపోయాయి. ఇటీవల జరిగిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో కొన్ని కళాశాలల్లోనే అత్యధిక సీట్లు భర్తీ అయ్యాయి.  దీంతో రెండో విడత కౌన్సెలిం గ్‌లో అయినా సీట్లు భర్తీ చేసుకోవాలని ఆయా కళాశాలల యాజ మాన్యాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. 


గుంటూరు(విద్య), జనవరి 16: ఎంసెట్‌ రెండో విడత ఈ నెల 21 నుంచి 23 వరకు కౌన్సెలింగ్‌ జరగనుంది. ఈ విడతలో కనీసం 75 శాతం సీట్లు అయినా భర్తీ అయ్యేలా కళాశాలల యాజమాన్యాలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. కళాశాలల వారీగా అధ్యాపకులకు ఈ బాధ్యతలు  అప్ప గించారు. జిల్లాలో మొత్తం 40 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉంటే వాటిలో మొదటి విడత కేవలం ఐదు కళాశాలల్లో మాత్రమే నూరుశాతం సీట్లు భర్తీ అయ్యాయి. దాదాపు 50 శాతం కళాశాలల్లో సగం సీట్లు కూడా భర్తీ కాలేదు. 40 కళాశాలల్లో ఈ ఏడాది ఇన్‌టేక్‌ సీట్లు 15498 ఉండగా మొదటి విడత కౌన్సెలింగ్‌లో 10,047 సీట్ల భర్తీ అయ్యాయి. అంటే దాదాపు 5వేలకుపైగా సీట్లు మిగిలి పోయాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 23 వరకు జరిగే  రెండో విడత నిర్వహించే వెబ్‌ కౌన్సె లింగ్‌పైనే యాజమాన్యాలు ఆశలు పెట్టుకున్నాయి. ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలో అర్హత సాఽధించిన విద్యార్థుల కోసం కళాశాలలు జల్లెడ పడుతున్నాయి. జిల్లాలో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 15,498 సీట్లు ఉన్నాయి. అర్హత సాఽధించిన వారు దాదాపు 16 వేల మందిపైనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా యాజమాన్యాలు అన్వేషిస్తున్నాయి. కొన్ని కళాశా లలు అయితే ర్యాంకులతో సంబంధం లేకుండా ఎంసెట్‌లో అర్హత సాధిస్తే చాలు అన్న చందంగా విద్యార్థుల కోసం గాలిస్తున్నాయి. ఎంసెట్‌లో 90వేల ర్యాంకుపైన వచ్చిన వారిని కూడా ఇంజనీరింగ్‌ వైపు వచ్చేలా చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది విద్యా ర్థులు డిగ్రీ కళాశాలల్లో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. వారిని ఇంజనీరింగ్‌ వైపు మళ్ళిం చడానికి  ప్రయత్నాలు చేస్తున్నారు. సదరు విద్యా ర్థులకు ఫీజులో రాయితీలు ఇవ్వడానికి సైతం వెను కాడడం లేదు. ఇటీవలే డిగ్రీ అడ్మిషన్లు కూడా ఆన్‌లైన్‌ పద్ధతిలో చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు.


మొదటి విడతలో భర్తీ ఇలా..

మొదటి విడతలో 80 నుంచి 95శాతం సీట్లు భర్తీ అయిన కళాశాలల సంఖ్య జిల్లాలో పది మాత్రమే. 70 శాతం సీట్లు  భర్తీ అయిన కళాశాలలు రెండు ఉన్నాయి. 50 శాతం సీట్లు భర్తీ అయిన కళాశాలలు 4 ఉన్నాయి. 30 నుంచి  40శాతం సీట్లు భర్తీ అయిన కళాశాలలు 8 ఉండగా 28 శాతం భర్తీ అయిన కళాశాలలు 3 ఉన్నాయి. జిల్లాలో ఆరు కళాశాలల్లో 10 నుంచి 18శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సింగిల్‌ డిజిట్‌ శాతంలో  సీట్లు భర్తీ అయిన కళాశాలలు రెండు ఉన్నాయి. తొలి విడత సీట్లు ఎంచుకున్న విద్యార్థులు ఈ నెల 18న కళాశాలల్లో రిపోర్టు చేయాలని ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2021-01-17T05:33:05+05:30 IST