CS కైనా అదే రూల్! హాజరుపై తేల్చేసిన మంత్రి

ABN , First Publish Date - 2022-08-19T17:33:42+05:30 IST

ముఖ ఆధారిత హాజరు (Facial recognition) ప్రభుత్వంలోని అన్ని శాఖలకూ విస్తరించనుంది. ఈ విధానాన్ని అటెండర్‌ నుంచి చీఫ్‌ సెక్రటరీ వరకూ అందరికీ అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

CS కైనా అదే రూల్! హాజరుపై తేల్చేసిన మంత్రి

అందరికీ ‘ముఖమే’

అటెండర్‌ నుంచి సీఎస్‌ వరకు అదే హాజరు

సెల్‌ఫోన్లపై శాఖల వారీగా నిర్ణయం

తొలుత విద్యాశాఖలో అమలు చేస్తున్నాం

టీచర్లకు 15 రోజులు ట్రయల్‌ రన్‌ 

ఈలోగా సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి బొత్స

తర్వాతైనా పరికరాలు ఇవ్వాలి: ఉపాధ్యాయ సంఘాలు

అసంపూర్ణంగా ముగిసిన చర్చలు


అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ముఖ ఆధారిత హాజరు (Facial recognition) ప్రభుత్వంలోని అన్ని శాఖలకూ విస్తరించనుంది. ఈ విధానాన్ని అటెండర్‌ నుంచి చీఫ్‌ సెక్రటరీ వరకూ అందరికీ అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Education Minister Botsa Satyanarayana) ప్రకటించారు. ఉద్యోగుల సెల్‌ఫోన్ల ద్వారా నమోదు చేయాలా... ప్రభుత్వమే పరికరాలు ఇస్తుందా అనే అంశంపై ఆయా శాఖలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. మొత్తంగా ముఖ హాజరు అనేది అందరికీ తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే మొదట విద్యాశాఖలో టీచర్లకు అమలు చేస్తున్నామన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే పరిష్కరిస్తాం తప్ప మొత్తం విధానాన్నే వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. ముఖహాజరు విధానంపై ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స గురువారం విజయవాడలో చర్చలు జరిపారు. సుదీర్ఘంగా రెండు గంటల పాటు చర్చలు జరిగినా ఎటూ తేలకుండానే అసంపూర్ణంగా ముగిశాయి. ముఖ హాజరు విధానానికి తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వమే పరికరాలు సరఫరా చేయాలని సంఘల నేతలు కోరారు. రాష్ట్రంలో 45వేల పాఠశాలలకు ఒక్కోదానికి రూ.10వేలు చొప్పున చూసినా, అంత భారం ప్రభుత్వం భరించదని మంత్రి స్పష్టం చేశారు. అంత ఖర్చుచేసి కొన్నా మూడేళ్ల తర్వాత అవి పనిచేయవని, ఈలోగా ప్రతి నెలా నిర్వహణ భారం పడుతుందన్నారు. 


అందువల్ల టీచర్లు వారి ఫోన్లలోనే హాజరు వేయాలని తేల్చిచెప్పారు. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నా వ్యక్తిగత డేటాకు ఏ ప్రమాదం ఉండదన్నారు. ఎవరైనా ఫోన్‌ తీసుకురావడం మర్చిపోయినా వేరే ఫోన్‌ నుంచి కూడా హాజరు వేసుకోవచ్చన్నారు. 15 రోజుల తర్వాత యాప్‌ వాడకంలో ఇంకా ఇబ్బందులుంటే మరోసారి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం డివైజ్‌లు ఇవ్వకుండా సొంత ఫోన్లలో హాజరు వేసే ప్రసక్తే లేదని సంఘాల నేతలు తేల్చిచెప్పారు. చర్చలు సఫలమయ్యాయా అని మంత్రిని మీడియా ప్రశ్నించగా... ఆ విషయం సంఘాలు చెప్పాలంటూ బదులిచ్చారు. ఈ చర్చల్లో యూటీఎఫ్‌ నుంచి ఎన్‌.వెంకటేశ్వర్లు, ప్రసాద్‌, ఏపీటీఎఫ్‌ 257 నుంచి సీహెచ్‌.మంజుల, ఎస్టీయూ నుంచి ఎల్‌.సాయి శ్రీనివాస్‌, తిమ్మన్న, ఏపీటీఎఫ్‌ 1938నుంచి ఎస్‌.చిరంజీవి, పీఆర్‌టీయూ నుంచి సీవీఎస్‌ రామకృష్ణ, నవాబ్‌ జానీ, ఆప్టా నుంచి రాంబాబు పాల్గొన్నారు. 


నాలుగోసారి సగం రోజు సెలవు

ముఖహాజరు విధానంలోనూ పాత నిబంధనలే అమలవుతాయని మంత్రి బొత్స చెప్పారు. నిర్దేశిత సమయం దాటి నాలుగుసార్లు ఆలస్యంగా వస్తే సగంరోజు సెలవుగా పరిగణిస్తారన్నారు. రాష్ట్రంలో 1.83 లక్షల మంది ఉపాధ్యాయులుంటే, ఇప్పటికే లక్ష మంది యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారన్నారు. ఇంటర్నెట్‌ పనిచేయకపోతే ఏం చేయాలనే దానిపై స్పష్టతనిస్తామన్నారు. యాప్‌ వినియోగంపై సవివరంగా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. కాగా, యాప్‌ ద్వారా విద్యార్థుల హాజరు వేయకపోతే చర్యలు తీసుకుంటామని పైనుంచి బెదిరింపులు రావడంతోనే ఉపాధ్యాయులు యాప్‌ ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నారని ఫ్యాప్టో చైర్మన్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు అన్నారు. ఉపాధ్యాయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

Updated Date - 2022-08-19T17:33:42+05:30 IST