ట్రిపుల్‌ ఐటీల్లో ఫీజులున్నాయా? లేవా?

ABN , First Publish Date - 2022-10-02T10:03:17+05:30 IST

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఫీజులపై గందరగోళం నెలకొంది. ట్రిపుల్‌ ఐటీల్లో చేరే విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు, మెస్‌ చార్జీల గురించి ఆర్టీయూకేటీ ఆగస్టు 8న

ట్రిపుల్‌ ఐటీల్లో ఫీజులున్నాయా? లేవా?

మొత్తం ఉచితమని ప్రకటించిన మంత్రి బొత్స 

ఒక్క రూపాయి కూడా తీసుకోరని వెల్లడి 

నోటిఫికేషన్‌లో మాత్రం స్పష్టంగా ఫీజులు 

పీయూసీకి రూ.45వేలు, బీటెక్‌కు 50 వేలు

ఎన్‌ఆర్‌ఐల పిల్లలకు రూ.3 లక్షలు 

విద్యా దీవెన రానివారంతా కట్టాల్సిందే 

భోజనాలకూ నెలవారీగా చార్జీలు చెల్లించాలి 

ప్రభుత్వ విరుద్ధ ప్రకటనలతో గందరగోళం 


అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఫీజులపై గందరగోళం నెలకొంది. ట్రిపుల్‌ ఐటీల్లో చేరే విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు, మెస్‌ చార్జీల గురించి ఆర్టీయూకేటీ ఆగస్టు 8న ఇచ్చిన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొంది. ఏపీ, తెలంగాణకు చెందినవారితో పాటు విదేశాల్లో ఉండే తల్లిదండ్రుల పిల్లలు ఎంతెంత చొప్పున ఫీజులు కట్టాలో అందులో సవివరంగా ఇచ్చింది. అయితే ఆర్జీయూకేటీ 2022-23 విద్యా సంవత్సరం ప్రవేశాల జాబితా విడుదల కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం మొత్తం ఉచితం అని ప్రకటించారు. విద్యార్థి ఒకసారి ట్రిపుల్‌ ఐటీల్లో చేరితే వారికి వసతి, భోజనం, యూనిఫాం, ల్యాప్‌టాప్‌ సహా మొత్తం ప్రభుత్వమే సమకూరుస్తుందని, ఒక్క రూపాయి తీసుకోరన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌ కేసీ రెడ్డి గానీ, నాలుగు ట్రిపుల్‌ ఐటీల డైరెక్టర్లు గానీ ఫీజులు ఉన్నాయన్న విషయాన్ని చెప్పి మంత్రి ప్రకటనను సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. నోటిఫికేషన్‌లో ఒకవిధంగా, మంత్రి మరో విధంగా చెప్పడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు  అయోమయానికి గురవుతున్నారు. 


నోటిఫికేషన్‌లో ఏముందంటే....

ఆర్జీయూకేటీ ఆరేళ్ల కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్‌ ఇచ్చింది. అందులో ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులకు ప్రీ యూనివర్సిటీ కోర్సులకు (పీయూసీ) ఏడాదికి రూ.45వేలు, బీటెక్‌ కోర్సులకు ఏడాదికి రూ.50వేలు ఫీజులు ఉంటాయి. 


విద్యా దీవెన పథకం వర్తించేవారికి ఫీజుల నుంచి మినహాయింపు ఉంటుంది. విద్యా దీవెన నగదు తల్లిదండ్రుల ఖాతాల్లో జమ అయిన వారంలో ఫీజులు చెల్లించాలి. ఈ పథకం వర్తించని విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మొత్తం ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి. 

విద్యార్థులు ప్రతినెలా మెస్‌ చార్జీలు కట్టాలి. (సుమారు రూ.2,500 నుంచి రూ.3,500). ఒకవేళ వసతి దీవెన కింద నగదు వస్తే, దానికి బ్యాలెన్స్‌ కలిపి మొత్తం మెస్‌ చార్జీలు చెల్లించాలి.

అడ్మిషన్‌ ఫీజు కింద రూ.వెయ్యి చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలైతే రూ.500 కట్టాలి. హాస్టల్‌ నిర్వహణ కింద రూ.వెయ్యి చెల్లించాలి. 

 

‘‘టిపుల్‌ ఐటీల్లో విద్యార్థి ఒకసారి జాయిన్‌ అయితే వారికి వసతి, భోజనం, యూనిఫాం, ల్యాప్‌టాప్‌ అన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఏ ఒక్కదానికీ, ఒక్క రూపాయి కూడా కౌన్సెలింగ్‌ ద్వారా వచ్చిన విద్యార్థుల వద్ద చార్జ్‌ చేసేది లేదు. వారి తల్లిదండ్రులు ఇక చూసుకోనక్కర్లేదు. మన కుటుంబంలో మన పిల్లల్ని ఎలా సాకుతామో, అలాగే వర్సిటీల్లో పిల్లల్ని చూసుకుంటారు’’ 

- విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 

Updated Date - 2022-10-02T10:03:17+05:30 IST