విద్యకు.. విఘాతం

ABN , First Publish Date - 2022-06-21T06:21:27+05:30 IST

జీవో 117తో ప్రభుత్వ విద్య ప్రమాదంలో పడుతుందని ఉపాధ్యాయవర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విద్యకు.. విఘాతం

నాణ్యమైన విద్య కనుమరుగే 

ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలకు చెల్లుచీటీ

ప్రభుత్వ విద్యార్థుల పాలిట శాపంలా జీవో 117

92 మందికి తగ్గితే హెచ్‌ఎం, పీఈటీ పోస్టులు లేనట్లే 


గుంటూరు(విద్య), జూన్‌ 20: జీవో 117తో ప్రభుత్వ విద్య  ప్రమాదంలో పడుతుందని ఉపాధ్యాయవర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2,245 ప్రాథమిక, 262 ప్రాథమికోన్నత 344 ఉన్నత పాఠశాలల్లో దాదాపు 6 లక్షల మందికిపై విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే జీవో 117 ప్రకారం జరిగే రేషనలైజేషన్‌లో అనేక సమస్యలు వస్తాయని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30 మందికంటే తక్కువ విద్యార్థులు ఉన్న ఇక ప్రాథమిక పాఠశాలలన్నీ ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్నాయి. ఆ పాఠశాలల్లో రెండో టీచర్‌ పోస్టు రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. ఆరు నుంచి పదో తరగతి వరకు 92 మంది కంటే తక్కువగా విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉండరు. ఈ పోస్టులు కూడా రేషనలైజేషన్‌ ద్వారా మాయం కానున్నాయి. యూపీ స్కూల్స్‌లో ప్రాథమిక ఉపాధ్యాయులే బోధన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి అవసరం లేకుండా ఉన్న పోస్టులు సర్దుబాటు చేయడానికి జీవో 117 అవకాశం ఇస్తుంది. ఫలితంగా గ్రామీణ విద్యకు విఘాతం కలుగుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


నాణ్యమైన విద్యకు పాతర

ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు జీవో 117 పాతర వేస్తుంది. సర్దుబాటు పేరుతో భారీగా ఉపాధ్యాయ పోస్టులకు కోత విధిస్తారు. ఇక డీఎస్సీ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. 

- ఎం కళాధర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్‌


600 మందికి ఒక హిందీ టీచరా?

జీవో 117 వల్ల 600 మంది విద్యార్థులకు ఒకే హిందీ టీచర్‌ బోధన అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.   హిందీ బోధనకు 17వ సెక్షన్‌ వరకు ఒక ఉపాధ్యాయుడు, 18వ సెక్షన్‌కు మరో ఉపాధ్యాయుడు ఉండాలి. అయితే జీవో వల్ల ఆ అవకాశం ఉండదు. 

-వనిమిరెడ్డి విజయకుమార్‌, హిందీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి 


హెచ్‌ఎం లేకుంటే ఎలా?

రేషనలైజేషన్‌ ద్వారా 92 మంది విద్యార్థుల కంటే తగ్గితే ఆ పాఠశాలలో హెచ్‌ఎం, పీఈటీ పోస్టు రద్దుచేస్తారు. దీని వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే వారికి అనేక నష్టాలు జరుగుతాయి.

- మేకల సుబ్బారావు, ఏపీటీఎఫ్‌(1938) జిల్లా కార్యదర్శి 


పండిట్స్‌కు ఉద్యోగోన్నతులు ఇవ్వాలి

డీఈవో పూల్‌లో ఉన్న తెలుగు, హిందీ పండిట్లకు  ఉద్యోగోన్నతులు కల్పించిన తర్వాతే రేషనలైజేషన్‌ నిర్వహించాలి. జీవో 117పై వచ్చే నష్టాల గురించి ఇప్పటికే ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించాం. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నాం. 

- సాంబయ్య, పండిత పరిషత్‌ అధ్యక్షుడు










Updated Date - 2022-06-21T06:21:27+05:30 IST