‘టీచర్స్‌ ఎమ్మెల్సీ’ల్లో విద్యాశాఖ ఉన్నతాధికారుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2021-01-12T06:36:56+05:30 IST

కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు చొరబడుతున్నారు.

‘టీచర్స్‌ ఎమ్మెల్సీ’ల్లో విద్యాశాఖ ఉన్నతాధికారుల అత్యుత్సాహం

రెండు జిల్లాల ఎంఈవోలతో రహస్య సమావేశాలు

ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ సతీమణి అభ్యర్థిత్వంపై సమాలోచనలు

అధికార దుర్వినియోగమంటున్న టీచర్లు

అధికారపార్టీ అభ్యర్థిగా ఎవరికీ లభించని అభయం

ఓటర్ల చేర్పుల తుది గడువు ముగిశాక  నిర్ణయం


కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు చొరబడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ సతీమణి అభ్యర్థిత్వంపై సమాలోచనలు జరపడంలో విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తూ ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ ప్రతాపరెడ్డి ఆహ్వానం మేరకు రెండు జిల్లాల్లో పనిచేస్తున్న ఎంఈవోలతో మంగళగిరి సమీపంలోని డోలాస్‌నగర్‌ డాన్‌బాస్కో పాఠశాలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం, దానికి ఎంఈవోలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సంఘ నాయకులు వాట్సాప్‌ ద్వారా సమాచారం పంపడం, ఆ సమాచారం రహస్యంగా ఉంచాలని సూచించడం ఉపాధ్యాయవర్గాల్లో  కలకలాన్నే సృష్టించింది. పైగా ఈ రెండు జిల్లాల్లో అభ్యర్థులకే కరువొచ్చినట్టు వేరే జిల్లా నుంచి ఇక్కడ పోటీ పెట్టడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 



ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యాశాఖ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలనే ఉదాహరణగా టీచర్లు చెప్పుకుంటున్నారు. రెండు జిల్లాల్లో పనిచేస్తున్న ఎంఈవోలతో మంగళగిరి సమీపంలోని డోలాస్‌నగర్‌ డాన్‌బాస్కో పాఠశాలలో ప్రత్యేక సమావేశం జరుగుతుందని ఎంఈవోల సంఘ నాయకులు ఇటీవల వాట్సాప్‌ ద్వారా సమాచారం పంపారు. ఆ సమాచారంలో వివరాలు ఇలా ఉన్నాయి. ‘కృష్ణా, గుంటూరు జిల్లాల ఎంఈవోలందరికీ నమస్కారం. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు మంగళగిరి సమీపంలోని డోలాస్‌నగర్‌లో ఉన్న  డాన్‌బాస్కో  పాఠశాలలో  మన రెండు జిల్లాల ఎంఈవో మిత్రుల కలయికను ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ ప్రతాపరెడ్డి ఆహ్వానం మేరకు ఏర్పాటు చేయడమైనది. టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏ రకమైన అడుగులు వేయాలో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి జేడీ సర్వీసెస్‌ దేవానందరెడ్డి, పరీక్షల విభాగం డైరెక్టర్‌ సుబ్బారెడ్డి తదితరులు హాజరవుతారు. ఈ సమావేశం అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన సమావేశం. ప్రతి ఒక్క ఎంఈవో తప్పనిసరిగా హాజరుకావాలని సంఘపరంగా కోరడమైనది. రాష్ట్ర సంఘ ప్రతినిధినైన నాతోపాటు గౌరవ ప్రధాన కార్యదర్శి, గౌరవ కోశాధికారి, గౌరవాధ్యక్షులు తదితరులంతా పాల్గొంటారు. సమావేశం అనంతరం డిన్నర్‌ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ ఒక్క ఎంఈవో ఈ సమావేశానికి మిస్‌కావద్దని మనవి. అలాగే ఈ సమావేశం వివరాలు, సంబంధిత విషయాలు మీ పక్కవానితో కూడా చెప్పవద్దు. సంఘపరంగా మనం వేసే మొట్టమొదటి అడుగు. కావున ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దు. ఈ సమావేశానికి విచ్చేసిన జేడీలతో ప్రధాన డిమాండ్లు, వాటి పరిష్కారానికి కృషి చేసే అంశంపై చర్చిద్దాము.’ 

ఈ సమాచారం ఎంఈవోల నుంచి టీచర్ల వాట్సాప్‌ గ్రూపులకు చేరి హల్‌చల్‌ చేస్తోంది. ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి తన భార్యను కృష్ణా,  గుంటూరు జిల్లాల ఉపాఽధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీలో నిలబెట్టడంలో భాగంగా ఈ తరహా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికారులు  ఇలా చేయకూడదనే వాదనను ఉపాధ్యాయులు వినిపిస్తున్నారు. అంతటితో ఆగకుండా, ఎన్నికల నిబంధనలను తమ వాట్సాప్‌ గ్రూపుల ద్వారా  పంపుకుంటున్నారు.  రెండు జిల్లాల ఎంఈవోలతో అధికారులు ఈ తరహా సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటనే ప్రశ్న టీచర్ల నుంచి వినిపిస్తోంది. 


అధికార పార్టీ అభ్యర్థి ఎంపికపై సమావేశం 

అధికార పార్టీ నుంచి టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక అంశంపై వైఎస్సార్‌ టీఎఫ్‌, జాక్టో రాష్ట్రస్థాయి నాయకులు నాలుగు రోజుల క్రితం తాడేపల్లిలో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు ఉపాధ్యాయులు చెప్పుకుంటున్నారు. టీచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉండి, ప్రచారం చేసుకుంటున్న ఒకరిని ఈ సమావేశానికి పిలిపించి, పోటీ నుంచి తప్పుకోవాలని సూచించినట్టు సమాచారం. తామంతా ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి భార్యకు మద్దతు తెలియజేస్తున్నామని చెప్పినట్టు టీచర్లు చెప్పుకుంటున్నారు.  సదరు అభ్యర్థి  తాను పోటీ నుంచి తప్పుకోనని ఖరాఖండిగానే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం ప్రభుత్వ సలహాదారుని వద్దకు వెళ్లగా, ఈ నెల 18వతేదీ వరకు టీచర్స్‌ ఎమ్మెల్సీ ఓటర్ల చేర్పులకు సమయం ఉంది కదా. ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ తన భార్యను ఎలా పోటీ చేయిస్తారు? ఇప్పుడే అంత తొందరెందుకు? అని ఆయన ప్రశ్నించినట్టు టీచర్లు చెబుతున్నారు. బయటి జిల్లాల నుంచి అభ్యర్థిని నిలబెట్టడం మంచి పద్ధతి కాదోమోననే వాదనను ప్రభుత్వ సలహాదారుడువినిపించడంతో  వైఎస్సార్‌ టీఎఫ్‌,  జాక్టో నాయకులు మిన్నకుండిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్‌ విడుదల  కానుండటంతో పలు టీచర్‌ యూనియన్‌లు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను నిలబెడతారా? లేదా తెరవెనుక మద్దతు తెలియజేస్తారా? అనే అంశంపై  స్పష్టత రావాల్సి ఉంది. ఈ లోగానే కొన్ని టీచర్స్‌ యూనియన్‌ల నాయకులు కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీచేసేందుకు అభ్యర్థులెవరూ లేనట్టు  వేరే జిల్లాకు  చెందిన వారి పేర్లను తెరపైకి తేవడం వెనుక కారణం ఏమై ఉంటుందోనని టీచర్లు గుసగుసలాడుకుంటున్నారు.

Updated Date - 2021-01-12T06:36:56+05:30 IST