ఏకపక్ష ధోరణితో విద్యావకాశాలు దూరం!

ABN , First Publish Date - 2021-06-16T06:20:00+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో విద్యావికాసం కొరకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, రాజ్యాంగ మౌలిక స్వభావాలకు దూరంగా రూపొందిన నూతన జాతీయ విద్యావిధానం–2020ను అమలు చేయడానికి...

ఏకపక్ష ధోరణితో విద్యావకాశాలు దూరం!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యావికాసం కొరకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, రాజ్యాంగ మౌలిక స్వభావాలకు దూరంగా రూపొందిన నూతన జాతీయ విద్యావిధానం–2020ను అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేయడం విద్యారంగ నిపుణులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మొత్తం ప్రీ పైమ్రరీ, 1-, 2 తరగతులను ప్రాథమిక విద్యలోకి, 3, 4 తరగతులను హైస్కూల్‌ విధానంలోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఇబ్బందికరమైన అంశం ఏమిటంటే– అంగన్‌వాడీ సెంటర్లను వైయస్సార్‌ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చి వాటిని ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం చేస్తూ ఒక ఎస్‌జిటిని కేటాయించడం. కానీ మూడు నుంచి ఐదు తరగతులను హైస్కూల్‌లో విలీనం చేస్తూ సమీప ప్రాథమికోన్నత లేక ఉన్నత పాఠశాలలకు బదిలీ చేస్తూ టీచర్లను కూడా పునర్నియమిస్తున్నట్లు తెలియజేశారు. గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ పాఠశాలలు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి. ఏడు, ఎనిమిది సంవత్సరాల పిల్లలను మూడు కిలోమీటర్ల పరిధిలో పాఠశాలలకు పంపడం అంత సులువైన విషయమా? పైవ్రేట్‌ పాఠశాలలకు పంపుతున్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలకు కూడా పంపుతారని భావిస్తున్నారా? ఇది వాస్తవాలకు దూరంగా లేదా? విద్యా హక్కు చట్టం–2009 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వరకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి, ఇంకొకవైపు ఇలా పాఠశాలలను విభజించడం వారికి చట్టం ద్వారా అందించవలసిన విద్యా హక్కును నిరాకరించడం కాదా? ఇంకో వైపు ఏ స్కూలు కూడా మూతపడదు అని చెప్పడం నమ్మశక్యంగా లేదు.


ప్రభుత్వానికి చేసే విజ్ఞాపన ఏమిటంటే– 1) వైయస్సార్‌ ప్రిపరేటరీ పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలకు అనుబంధం చేస్తూ రెండో తరగతి వరకు కాకుండా ఐదవ తరగతి వరకు కొనసాగించాలి. 2) అవకాశం ఉన్న చోట మండలానికి ఒకటి, రెండు ఉన్నత పాఠశాలలను జూనియర్‌ కాలేజీలుగా ఉన్నతీకరించి పేద ప్రజల పిల్లలకు విద్యావకాశాలు కలిగించాలి. 

గోనెపాటి అశోక్‌ కుమార్‌, హిందీ ఉపాధ్యాయుడు

Updated Date - 2021-06-16T06:20:00+05:30 IST