ఏడుపాయల ఆలయంలో అపహరించిన హుండీ సొమ్ము సిలాంపల్లిలో స్వాధీనం

ABN , First Publish Date - 2022-01-23T04:55:31+05:30 IST

మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల క్షేత్రంలో రెండు రోజుల క్రితం అపహరణకుగురైన హుండీ సొమ్మును చిల్‌పచెడ్‌ మండలం సిలాంపల్లిలోని ఓ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో హుండీని ఈ నెల 19వ తేదీన ఓ

ఏడుపాయల ఆలయంలో అపహరించిన హుండీ సొమ్ము సిలాంపల్లిలో స్వాధీనం

నిందితుడు కామారెడ్డి జిల్లా వాసిగా గుర్తింపు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌/చిల్‌పచెడ్‌, జనవరి 22: మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల క్షేత్రంలో  రెండు రోజుల క్రితం అపహరణకుగురైన హుండీ సొమ్మును చిల్‌పచెడ్‌ మండలం సిలాంపల్లిలోని ఓ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో హుండీని ఈ నెల 19వ తేదీన ఓ దుండగుడు పగులగొట్టి సొత్తును ఎత్తుకెళ్లాడు. పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టారు. సీసీకెమెరాలు, సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు చోరికి పాల్పడిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆత్మకూరు గ్రామానికి లక్ష్మారెడ్డిగా గుర్తించారు. కొల్చారం, కౌడిపల్లి మీదుగా వెళ్లిన నిందితుడు చోరీ చేసిన సొమ్మును సిలాంపల్లి గ్రామంలో తమ బంధువైన వృద్ధురాలి ఇంట్లో దాచి వెళ్లిపోయినట్టు గుర్తించారు. ఈమేరకు శనివారం మెదక్‌ డీఎస్పీ సైదులు, కొల్చారం ఎస్‌ఐ శ్రీనివా్‌సగౌడ్‌, చిల్‌పచెడ్‌ ఎస్‌ఐ రమేష్‌ సిబ్బందితో తనిఖీలు చేపట్టి ఇంట్లోని వాషింగ్‌మిషిన్‌లో చోరీ చేసిన సొమ్మును గుర్తించారు. పంచాయతీ కార్యదర్శులు భూమేష్‌, మనోచారి, సర్పంచ్‌ కవితముకుందరెడ్డి సమక్షంలో పోలీసులు సొమ్మును లెక్కించగా రూ. 2,36,260 నగదు, 4 వెండి బిస్కట్లు, 107 వెండి కండ్లు, 4 డాలర్లు, వెండి తొట్టెల, కాళ్ల పట్టీలు, పుస్తెలతాడు, ముక్కుపుడక, నాలుగు సెల్‌ఫోన్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఏడుపాయల చోరీ కేసు పురోగతిని మెదక్‌ డీఎస్పీ సైదులు విలేకరులకు వివరించారు. కేసు దర్యాప్తునకు మూడు ప్రత్యేక బృందాలను నియమించామని, సాంకేతికత ఆధారంగా చేపట్టిన విచారణలో నిందితుడిని గుర్తించామని వెల్లడించారు. సీసీకెమెరాలు, సెల్‌సిగ్నల్‌ ఆధారంగా నిందితుడు చోరీ సొత్తును సిలాంపల్లిలో దాచినట్టు గుర్తించామన్నారు. ఇంట్లో ఓ వృద్ధురాలు మాత్రమే నివసిస్తుండటంతో ఎవరికీ అనుమానం రాదనే నమ్మకంతోనే ఇక్కడ దాచినట్టు భావిస్తున్నామని పేర్కొన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 

Updated Date - 2022-01-23T04:55:31+05:30 IST